ETV Bharat / international

చైనా నిఘా బెలూన్- అమెరికా ఇంటర్నెట్‌నే వాడి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 1:34 PM IST

China Spy Balloon US : 2023 ఆరంభంలో అమెరికా గగనతలంలో ఎగిరిన చైనా రహస్య బెలూన్‌ కొన్నాళ్ల పాటు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. రహస్య బెలూన్‌ విషయంలో అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇది కేవలం వాతావరణ పరిశోధన కోసమే బెలూన్‌ను ప్రయోగించామని చైనా చెప్పగా అది నిఘా విమానమే అని అమెరికా ఆరోపించింది. తాజాగా చైనా బెలూన్‌ మరోసారి చర్చకు కారణమైంది. డ్రాగన్ బెలూన్‌ అగ్రరాజ్య ఇంటర్నెట్‌ను వాడుకొని సమాచారాన్ని సేకరించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.

china balloon us
china balloon us

China Spy Balloon US : నింగిలో ఏదో వస్తువు కనిపించడం, యుద్ధ విమానాలు దూసుకెళ్లడం, క్షిపణులతో వాటిని నేలకూల్చడం, ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలో ఇది నిత్యకృత్యంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా గగనతలంలో తిరుగున్న నాలుగు బెలూన్లను అమెరికా కూల్చివేసింది.

అగ్రరాజ్య ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే!
ఈ బెలూన్‌ అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచింది. అమెరికా గగనతలంలో కదలాడిన ఆ బెలూన్‌ అగ్రరాజ్య ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుందని తెలుస్తోంది. బెలూన్ నావిగేషన్‌, లొకేషన్‌కు సంబంధించిన డేటాను తిరిగి చైనాకు పంపేందుకు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నట్లు అమెరికా అధికారి తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ CNN కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సర్వీస్‌ ప్రొవైడర్ గురించిన సమాచారం మాత్రం వెల్లడికాలేదు..

యూఎస్‌ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్‌ సెన్సర్లు!
తమ దేశంపై నిఘా పెట్టేందుకే డ్రాగన్‌ ఆ బెలూన్‌ను ప్రయోగించిందని ఇప్పటికే అమెరికా తేల్చి చెప్పింది. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్‌ కన్పించడం వల్ల అగ్రదేశం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఆ బెలూన్‌ను కూల్చివేసి శకలాలను సేకరించింది. బెలూన్‌లో యూఎస్‌ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్‌ సెన్సర్లు ఉన్నట్లు గుర్తించారు.

బీజింగ్​కు బదిలీ!
ఈ సాంకేతికతతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు బదిలీ చేయాలని ప్రయత్నించిందని అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్‌ కాదని అమెరికాపై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని దర్యాప్తులో తేలినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు.

చైనా బెలూన్‌ అలస్కా, కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు ప్రయాణించింది. అయితే, ఈ సమయంలో ఎలాంటి డేటాను ఈ బెలూన్‌ చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు. కాగా ప్రస్తుత వ్యవహారంపై అటు అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, ఆఫీస్‌ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌, ఇటు చైనా వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన 'ఎయిర్‌షిప్‌' అని చైనా మొదటి నుంచి ఒకటే మాట చెప్తోంది. గాలుల కారణంగా లక్షిత ప్రాంతాన్ని దాటి వచ్చిందని, అమెరికా గగనతలంలోకి రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.