ETV Bharat / international

అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం

author img

By

Published : Mar 27, 2023, 6:03 PM IST

Updated : Mar 27, 2023, 7:48 PM IST

అఫ్గానిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

afghanistan bomb blast today
అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 6గురు దుర్మరణం

అఫ్గానిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు తాలిబన్‌ భద్రతా సిబ్బందితో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ డౌన్‌టౌన్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.

రంజాన్​ మాసం ప్రారంభమైన నేపథ్యంలో విదేశాంగ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా కాబుల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఒక పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌-కే.. విదేశాంగ సంస్థతో సంబంధం ఉన్న అధికారులు, షియాలు, సూఫీలు, భద్రతా సిబ్బంది, మైనారిటీలు సహా ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులకు పాల్పడుతోంది. ఈ వరుస ఘటనల్లో ఇప్పటికే వందలాది మంది చనిపోగా అనేక మంది క్షతగాత్రులయ్యారు.

అఫ్గానిస్థాన్‌లో మహిళలు, బాలికల భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన ఆంక్షలు విధించింది. అంతేగాక బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు చదువుకునేందుకు స్వేచ్ఛనివ్వాలని అక్కడి మహిళలు తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం తాలిబన్​ ప్రభుత్వం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్​కు అంతర్జాతీయ గుర్తింపు కోసం విజ్ఞప్తి చేస్తోంది.

మిలిటరీ ఎయిర్​పోర్టులో బాంబు పేలుడు..
ఈ ఏడాది జనవరి 1న కూడా కాబుల్ మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద భారీ బాంబు పేలుడుకి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తఖార్‌లోని తాలిబాన్ భద్రతా కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీ ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ధ్రువీకరించారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డెస్క్ కింద బాంబు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారని అక్కడి వార్తా సంస్థ నివేదించింది.

Last Updated :Mar 27, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.