ETV Bharat / international

Biden India Visit G20 Summit : భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు.. మోదీ నాయకత్వంపై ప్రశంసలు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 8:16 AM IST

Biden India Visit G20 Summit
Biden India Visit G20 Summit

Biden India Visit G20 Summit : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు రానున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన దిల్లీకి విచ్చేయనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఆయన భారత్​లో పర్యటిస్తారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది.

Biden India Visit G20 Summit : దిల్లీ వేదికగా జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7నుంచి 10 వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ లో పర్యటించనున్నారు. వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్ వివాదం సహా అనేక ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల అధినేతలతో ఈ సందర్భంగా ఆయన చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బైడెన్ పర్యటన వివరాలను శ్వేతసౌధం వెల్లడించింది.

Joe Biden India G20 Meeting : జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సహకారానికి పాటుపడే జీ20 కూటమికి తాము కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారని తెలిపింది. 2026లో ఈ కూటమికి నాయకత్వం వహించడానికి అమెరికా ఎదురుచూస్తోందని పేర్కొన్నట్లు వివరించింది.

జీ-20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో హస్తినలో జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది. జీ-20 సమావేశం దృష్ట్యా దిల్లీలోని బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్​లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు.

'బైడెన్​కు భారతే ముఖ్యం'
ఇదిలా ఉండగా.. ప్రపంచంలో భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని అధ్యక్షుడు బైడెన్ తనతో చెప్పారని భారత్​లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా.. ఇరుదేశాల బంధంపై ఇలాంటి వ్యాఖ్య చేయలేదని అన్నారు. అమెరికా పన్నుచెల్లింపుదారులలో ఆరు శాతం మంది భారతీయ అమెరికన్లే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.

"టెక్నాలజీ నుంచి వర్తకం వరకు, పర్యావరణం నుంచి మహిళా సాధికారత వరకు, చిన్న వ్యాపారాల నుంచి అంతరిక్షం వరకు మనం (భారత్-అమెరికా) కలిసి పని చేస్తున్నాం. సాధారణంగా ఆకాశమే నీ హద్దు అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఆకాశం కూడా హద్దు కాదు. భారత్-అమెరికాలు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే బలీయమైన శక్తులు"

-- ఎరిక్ గార్సెట్టీ, అమెరికా రాయబారి

మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇండోనేసియా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4-7 మధ్య ఆమె జకార్తాలో జరిగే యూఎస్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇండోపసిఫిక్ దేశాధినేతలతో ఆమె చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.

'త్వరలో 5 ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థగా భారత్'.. ​బ్రిక్స్ సదస్సులో మోదీ

Trump Arrest : 'గురువారం నన్ను అరెస్టు చేస్తారు.. అంతా బైడెన్‌ ఆధీనంలోనే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.