యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇరాన్‌లోని హిర్కానియన్ అడవులకు, ఐస్లాండ్లోని వత్నాజోకల్ గ్లేసియర్ నేషనల్ పార్కుకు చోటు దక్కింది.
ఉత్తర ఇరాన్‌లోని ప్రాచీన హిర్కానియన్ అడవులు 850 చదరపు కి.మీ మేర వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం గొప్పగా ఉందని యునెస్కో పేర్కొంది. ఇరాన్లో ఎక్కువగా ఉండే వాస్కులర్ మొక్కల్లో 44శాతం ఈ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి.
50 మిలియన్ సంవత్సరాల నుంచి హిర్కానియన్ అడవులు పర్షియన్ చిరుతలకు నిలయంగా ఉన్నాయి. 60 రకాల జీవరాశులు, 160 జాతుల పక్షులకు కేంద్రం ఈ హిర్కానియన్ అడవులు. గతంలో ఇరాన్ నుంచి 'లట్' ఎడారికి మాత్రమే యునెస్కో వారసత్వ జాబితాలో చోటు లభించింది.
'అసాధారణ ఉదాహరణ..'
ఐస్లాండ్లోని వత్నాజోకుల్ నేషనల్ పార్క్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి... తన జాబితాలో చేర్చింది యునెస్కో. యూరోప్‌లోని అతిపెద్ద అగ్ని పర్వతాలు, హిమానీనదాల మధ్య ప్రకృతి సోయగాలతో ఈ ప్రాంతం అలరారుతుంటుంది.
"14 వేల 500 చ.కి.మీ విస్తీర్ణం గల ఈ రక్షిత ప్రాంతం.... ఐస్లాండ్ మొత్తం భూభాగంలో 14శాతం ఉంటుంది . ఈ ప్రాంతం అగ్ని పర్వతాలు, హిమానీనదాల సంగమంగా ఉంది. టెక్టోనిక్ పలకలను వేరు చేస్తూ, అసాధారణమైన ఉదాహరణగా ఉంది."- యునెస్కో
ఇదీ చూడండి: 'పెట్టుబడులకు ఊతమిచ్చేలా బడ్జెట్'