ETV Bharat / international

దూకుడు పెంచిన రష్యా.. క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న కీవ్​

author img

By

Published : Mar 16, 2022, 6:59 AM IST

ukraine russia conflict
కీవ్​పై దాడులు

Ukraine Russia War: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​పై రష్యన్​ సేనలు విరుచుకుపడుతున్నాయి. నాటో కూటమిలోని పోలండ్‌, చెక్‌, స్లొవేకియా దేశాధినేతలు మంగళవారం కీవ్‌ను సందర్శించిన నేపథ్యంలో రష్యా దూకుడు పెంచింది. ఒక విశ్వవిద్యాలయంపై, మరో మార్కెట్‌పై దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారనీ, సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని చేరవేస్తున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ఒక వృద్ధురాలు చనిపోయారనీ ఉక్రెయిన్‌ తెలిపింది.

Ukraine Russia War: చర్చల ద్వారా ప్రతిష్టంభన తొలగింపు నిమిత్తం ఓవైపు ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరానికి మరింత సమీపంగా వస్తున్నాయి. ప్రస్తుతం అవి కీవ్‌ నడిబొడ్డుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తాజా చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించకపోయినా.. మరింత సమగ్రంగా చర్చించుకునేందుకు రెండు దేశాలూ దౌత్య మార్గాలను తెరిచి ఉంచాయి. అదే సమయంలో కీవ్‌ నగరం రష్యా రాకెట్లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. నాటో కూటమిలోని పోలండ్‌, చెక్‌, స్లొవేకియా దేశాధినేతలు మంగళవారం కీవ్‌ను సందర్శించిన నేపథ్యంలో రష్యా దూకుడు పెంచింది. నిజానికి ఈ పర్యటన గురించి చివరి క్షణం వరకు గోప్యంగా ఉంచారు. ఈ మూడు దేశాలూ ఈయూలో కూడా ఉన్నాయి. నాటో కూటమిలో తాము చేరలేమన్నది గ్రహించామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. 'నాటో తలుపులు తెరిచి ఉంటాయని ఏళ్లుగా వింటున్నాం. మేం దానిలో చేరలేమని ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ వాస్తవాన్ని మా ప్రజలు గ్రహిస్తున్నారు' అని పేర్కొన్నారు.

తెల్లవారక ముందే విధ్వంస కాండ

సూర్యోదయానికి ముందే పుతిన్‌ సేనలు కీవ్‌లో విధ్వంసం సృష్టించాయి. 15 అంతస్తుల అపార్ట్‌మెంటు ఒకటి ఈ దాడుల్లో పూర్తిగా దెబ్బతింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా అనేకమంది ఆ భవనం లోపలే చిక్కుకుపోయారు. పొడిల్‌స్కీలో మరో 10 అంతస్తుల అపార్ట్‌మెంటుపైనా ఇలాంటి దాడే జరిగింది. ఒక విశ్వవిద్యాలయంపై, మరో మార్కెట్‌పై దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారనీ, సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని చేరవేస్తున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ఒక వృద్ధురాలు చనిపోయారనీ ఉక్రెయిన్‌ తెలిపింది. ఖేర్సన్‌ నగరంలో పలు ప్రాంతాలు పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లాయి. ఆంటోపొల్‌లో టీవీ టవర్‌పై రాకెట్‌ దాడిలో 9 మంది చనిపోయారు. అమెరికాకు చెందిన ఫాక్స్‌న్యూస్‌ వీడియో జర్నలిస్టు పియెర్రే జకర్‌జెవెస్కీ (55) బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇరాక్‌, అఫ్గాన్‌, సిరియా యుద్ధాల వార్తల కవరేజిలో ఆయన పాల్గొన్నారు.

తరలింపు.. పొడిగింపు..

రష్యా తాజా దాడులతో ఉక్రెయిన్‌లో మార్షల్‌ చట్టాన్ని ఏప్రిల్‌ 24 వరకు పొడిగించాలని జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఎట్టకేలకు మేరియుపొల్‌లో సురక్షిత నడవా ద్వారా 2,000 వాహనాల్లో పౌరులు తరలి వెళ్లగలిగారు. ఇర్పిన్‌, హోస్తొమెల్‌, బుచా సబర్బన్‌ ప్రాంతాల్లోనూ రష్యా సైనిక బలగాలు రాత్రంతా విరుచుకుపడ్డాయి. మేరియుపొల్‌పై నియంత్రణ సాధించాలన్న రష్యా ప్రయత్నాన్ని తిప్పికొట్టామని ఉక్రెయిన్‌ తెలిపింది. ఆ నగరంలో అనేక బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమైనట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. ఈ నగరంలోనే 150 మంది రష్యా సైనికుల్ని హతమార్చి, రెండు ట్యాంకుల్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.

ఉక్రెయిన్‌ క్షిపణి దాడిలో 20 మంది మృతి

డొనెట్స్క్‌లో ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణిదాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. డాన్‌బాస్‌లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు 13,500 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

ఇదీ చూడండి : బైడెన్​పై రష్యా ఆంక్షలు.. నాటో వైఖరి పట్ల జెలెన్​స్కీ అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.