ETV Bharat / international

యుద్ధం వస్తే భారత్​కు తిప్పలే!- వాటిపై తీవ్ర ప్రభావం..

author img

By

Published : Feb 18, 2022, 5:15 PM IST

Ukraine Russia crisis: ఉక్రెయిన్‌- రష్యా వివాదం మరింత తీవ్రమైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడనుంది. ఇప్పటికే కరోనావైరస్‌ కారణంగా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతిన్నాయి. తాజాగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తెరలేచి.. మిగిలిన ప్రపంచ శక్తులు దానిలోకి అడుగుపెడితే భారత్‌పై అది పెనుప్రభావం చూపించనుంది. ముఖ్యంగా చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధాలు, విదేశాంగ విధానం వంటి వాటిల్లో భారత్‌కు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

Ukraine Russia crisis
Ukraine Russia crisis

Ukraine Russia crisis: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతల ప్రభావం ప్రధానంగా చమురు, గ్యాస్‌పై పడనుంది. ముడి చమురు ధరలు గత కొద్ది రోజులుగా పీపాకు 90 డాలర్ల స్థాయికి చేరాయి. వాస్తవానికి భారత్‌ ఆర్థిక సర్వేలో కూడా వీటిధరలు 75 డాలర్ల లోపు ఉండొచ్చని అంచనా కట్టారు. సోమవారం ముడి చమురు ప్రధాన సూచీలైన బ్రెంట్‌ సూచీ 96.78 డాలర్లకు, డబ్ల్యూటీఐ సూచీ 95.82 డాలర్లను తాకింది. 2014 సెప్టెంబర్‌ తర్వాత ఇదే అత్యధికం. ప్రపంచ క్రూడాయిల్‌ ఉత్పత్తిలో 13 శాతం వాటా రష్యాదే. రోజుకు 9.7మిలియన్‌ పీపాల చమురును ఇది ఉత్పత్తి చేస్తుంది. ఒపెక్‌ దేశాల్లో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే వాటిలో రష్యా కూడా ఉంది. ప్రపంచ గ్యాస్‌ సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 40 శాతం దాకా ఉంటుంది. యుద్ధం కనుక మొదలైతే చమురు ధర పీపాకు 120 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్‌ సంస్థ హెచ్చరించింది. అదే సమయంలో రష్యా నుంచి వచ్చే చమురు తగ్గితే.. పీపాకు 150 డాలర్ల వరకు ధర పలకవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Brent Crude Oil Price: చమురు ధరల మంట..!

భారత్‌లో ఇప్పటికే జనవరి నెల ద్రవ్యోల్బణం 6.01గా నమోదైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన మొత్తంలో ఇదే అత్యధికం. యుద్ధాలు వచ్చిన ప్రతిసారి చమురు ధరలు భగ్గుమనడం ఖాయం. చమురు ధరలు పెరిగితే ఈ ద్రవ్యోల్బణంలో ఆజ్యం పోసినట్లవుతుంది. మరోవైపు రూపాయి ధర పతనంతో.. దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి.

ఒకవేళ రష్యా.. ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. అదే జరిగితే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకుంటున్న భారత్‌ ప్రణాళికలు మొత్తం దెబ్బతింటాయి. భారత్‌ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 1.4 శాతంగా ఉంది. భవిష్యత్తులో భారత్‌-రష్యాల ద్వైపాక్షిక పెట్టుబడులను రూ.3.75 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వ్యాపారాన్ని రూ.2.25లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అమెరికా ఆంక్షలు విధిస్తే ఇది అంత తేలిగ్గా జరగదు.

50 శాతానికిపైగా రష్యా ఆయుధాలే..

ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి. భారత్‌ వినియోగిస్తున్న ఆయుధాల్లో రష్యా నుంచి కొనుగోలు చేసినవి 50 శాతానికి పైగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రష్యా నుంచి ఆయుధాలు కొనడం భారత్‌ తగ్గించింది. కానీ, యుద్ధవిమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, నూక్లియర్‌ సబ్‌మెరైన్లు వంటి కీలక ఆయుధాల కోసం ఇప్పటికీ మనం ఆ దేశంపై ఆధాపడుతున్నాం. ఇప్పటికే ఉన్న ఆయుధాలకు స్పేర్లు, సర్వీసులు అక్కడి నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాట్సా వంటి ఆంక్షలు ఆ దేశంపై విధిస్తే.. భారత్‌కు అవస్థలు తప్పవు.

Russia Ukraine Conflict: రష్యా- ఉక్రెయిన్ వివాదంలో భారత్‌ ఏ పక్షం తీసుకోలేని పరిస్థితి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌, ఐరోపా సంఘంతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయా దేశాలు భారత్‌ మద్దతును ఆశిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా బహిరంగంగానే భారత్‌ను మద్దతు కోరింది. అమెరికాతో కలిసి క్వాడ్‌లో, రష్యాతో కలిసి బ్రిక్స్‌, ఆర్‌ఐసీ వంటి కూటముల్లో భారత్‌ భాగస్వామి. ఈ నేపథ్యంలో ఏదో ఒక పక్షం తీసుకోవడం దౌత్యపరంగా భారత్‌కు ఇబ్బందే.

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విద్యార్థులు, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం చాలా కీలకం. ఇప్పటికే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉక్రెయిన్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఆ దేశాన్ని విడిచి వెళ్లాలనుకొనే విద్యార్థులకు తగినన్ని విమానాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి వారిని తీసుకురావడం సవాలుతో కూడుకున్న పని.

ఇవీ చూడండి: మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్​పై రష్యా దాడి: బైడెన్

Ukraine crisis: ఉక్రెయిన్-రష్యా వివాదం.. భారత్​ కీలక వ్యాఖ్యలు

రష్యాతో చర్చలకు ఒకే చెప్పిన అమెరికా.. కానీ ఒక షరతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.