ETV Bharat / international

అణ్వాయుధాలు వదులుకొని.. నట్టేట మునిగిన ఉక్రెయిన్​..!

author img

By

Published : Feb 24, 2022, 6:13 PM IST

Ukraine Crisis: ప్రపంచ దేశాల మాటలు నమ్మి.. అణ్వాయుధాలు వదులుకొని.. జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టినందుకు ఫలితం అనుభవిస్తోంది ఉక్రెయిన్​. దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది. నాడు అండగా నిలుస్తామని చెప్పిన ఏ ఒక్క దేశం సాయానికి రావడం లేదు.

Ukraine Crisis
నమ్మి నట్టేట మునిగిన ఉక్రెయిన్​

Ukraine Crisis: పుట్టుకతోనే ఐదువేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి ఉక్రెయిన్‌. కానీ, ప్రపంచ దేశాల మాటలు నమ్మి.. అణ్వాయుధాలు వదులుకొని.. జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టినందుకు ఫలితం అనుభవిస్తోంది. దీనికి తోడు అవినీతి మర్రివూడల్లా వేళ్లూనుకోవడం.. పరాయి దేశాలకు అడుగులకు మడుగులొత్తే వారు అధికారంలోకి రావడం దానికి శాపంగా మారింది. ఫలితంగా దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది. నాడు ముచ్చట్లు చెప్పిన దేశాలు ఒక్కటి కూడా పూర్తి సాయానికి రావడంలేదు. దీంతో మౌనంగా తమకు జరిగిన అన్యాయానికి ఉక్రెయిన్‌ వాసులు కుమిలిపోయే పరిస్థితి వచ్చింది.

ఉక్రెయిన్​ రక్షణ శాఖ యూనిట్​లో కమ్ముకున్న పొగ

మూడో అతిపెద్ద అణుశక్తిగా ఆవిర్భావం..

కోల్డ్‌ వార్‌ ముగిసే సమయానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాల కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం ఉక్రెయిన్‌. ఈ దేశం ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు 5 వేలకు పైగా అణ్వస్త్రాలు దీనికి ఉన్నాయి. సోవియట్‌కు చెందిన 43 రాకెట్‌ ఆర్మీ, 19వ రాకెట్‌ డివిజన్‌, 37వ గార్డ్స్‌ రాకెట్‌ డివిజన్‌, 46వ రాకెట్‌ డివిజన్‌, 50వ రాకెట్‌ డివిజన్‌లు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. వీటి వద్ద ఉన్న 175 ఖండాంతర క్షిపణులను ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లోని భూగర్భ బొరియల్లో భద్రపరిచింది. ఎస్‌ఎస్‌24 క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ క్షిపణులు ఒక్కోటి 10 థర్మో న్యూక్లియర్‌ అణ్వాయుధాలను ప్రయోగించగలదు. ఉక్రెయిన్ కంటే రష్యా, అమెరికా వద్ద మాత్రమే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. 33 హెవీ బాంబర్లు కూడా ఉక్రెయిన్‌లో ఉన్నాయి. కొత్త పాలకులు వీటిని నిర్వహించే సైనికులు, కమాండర్లను దేశానికి విశ్వాసంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయమని కోరగా.. కొందరు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Ukraine Crisis
బుడాపెస్ట్​ ఒప్పందంపై సంతకం

నమ్మి బుడాపెస్ట్‌ ఒప్పందంపై సంతకం..

ఉక్రెయిన్‌తో అణు నిరాయిధీకరణ చేయించేందుకు బ్రిటన్‌, రష్యా, అమెరికా చర్చలు జరిపాయి. 1994లో ఈ నాలుగు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ జనవరి 10వ తేదీన ఒక ప్రకటన చేశారు. 1994 డిసెంబర్‌ 5వ తేదీన హంగేరీ రాజధాని బుడాసెస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్సిన్‌, అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు లియోనిడ్‌ కుచ్‌మా, బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేజర్‌ నాన్‌ప్రోలిఫరేషన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని బుడాపెస్ట్‌ ఒప్పందంగా పిలుస్తారు. దీని ప్రకారం ఉక్రెయిన్‌ అణ్వాయుధాలను నాశనం చేయాలి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, నాటి సరిహద్దులను గౌరవించాలి. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఈ దేశాలు ఎటువంటి సైనిక శక్తిని ప్రయోగించకూడదు. వెంటనే ఉక్రెయిన్‌ ఒప్పందాన్ని అమలు చేసేలా సాయం చేయడానికి ఐరాస భద్రతమండలి రంగంలోకి దిగింది. వాస్తవానికి కీవ్‌కు అమెరికా సెనెట్‌ దీనిని సాధారణంగా ఆమోదించింది. అమెరికా ఇచ్చిన వాగ్దానం ‘చట్టపరమైన హామీ వలే’ పరిగణిస్తామని పేర్కొంది. కానీ, చట్టపరమైన హామీ అని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత 1996 నాటికి చిట్టచివరి అణ్వాయుధం కూడా రష్యాకు అప్పగించింది. ఈ ఒప్పందాన్ని శాంతి ఉద్యమకారులు, దౌత్యవేత్తలు గొప్ప విజయంగా చెప్పుకొంటారు.

పుతిన్‌ రాకతో మారిన చిత్రం..

బోరిస్‌ ఎల్సిన్‌ తర్వాత రష్యాలో పుతిన్‌ అధికారం చేపట్టారు. నాటి నుంచి మెల్లగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. రష్యా విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. మరోపక్క ఉక్రెయిన్‌లో రాజకీయాలను ప్రభావితం చేసిన కీలుబొమ్మ ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఒక దశలో రష్యా వ్యతిరేక అభ్యర్థి విక్టర్ యష్చంకోపై విషప్రయోగం చేశారు. కానీ, అదృష్టం కొద్దీ ఆయన బతికి బట్టకట్టి అధికారం చేపట్టారు. కానీ, 2010లో రష్యా కీలుబొమ్మగా పేరుగాంచిన విక్టర్‌ యాన్కోవిచ్‌ అధికారం చేపట్టారు. దీంతో మెల్లగా రష్యా పట్టు పెరిగిపోయింది. యాన్కోవిచ్‌కు వ్యతిరేకంగా మైదన్‌ స్క్వేర్‌ ఆందోళన చోటు చేసుకొంది. దీంతో యాన్కోవిచ్‌ రష్యాకు పారిపోయారు. దీంతో పట్టు కోల్పోతామని భావించిన పుతిన్‌ క్రిమియాను ఆక్రమించడంతో పాటు తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని ఎగదోశారు. అప్పుడు కూడా అమెరికా, బ్రిటన్‌లు రష్యాపై ఆంక్షలు విధించి చేతులు దులుపుకొన్నాయి సైన్యాలను పంపి అండగా నిలవలేదు.

ముందే చేతులెత్తేసిన అమెరికా..

నాటోలో భాగస్వామ్యం కావాలంటూ కొన్నేళ్లుగా ఉక్రెయిన్‌ నెత్తీనోరు బాదుకొంటున్నా.. అమెరికా సహకరించలేదు. ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వాన్ని అడ్డుకొనేందుకు యత్నించిన ఫ్రాన్స్‌, జర్మనీలను వారించలేదు. తాజాగా పుతిన్‌ యుద్ధసన్నాహాలు చేస్తున్న సమయంలో తమ దళాలు ఉక్రెయిన్‌లో పోరాడవని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ముందుగానే ప్రకటించారు. ఇది రష్యా ధైర్యాన్ని మరింత పెంచింది. నాటో సభ్యదేశం, ఐరోపా ఆర్థిక శక్తి అయిన జర్మనీ ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని హెల్మెట్లతో పాటు వైద్యసాయం అందిస్తామని ప్రకటించి చేతులు దులుపుకొంది. జర్మనీ ఆయుధాలను ఉక్రెయిన్‌ ఇవ్వొద్దని బాల్టిక్‌ దేశాలను అడ్డుకొంది. చివరికి తమ ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ రారని ఉక్రెయిన్‌ వాసులకు అర్థమైంది. ఆత్మరక్షణ కోసం వృద్ధులతో సహా చాలా మంది తక్షణమే సైనిక శిక్షణ పొందడం మొదలుపెట్టారు. 2014 క్రిమియా ఆక్రమణలో లోపాలను సరిచేసుకొని పుతిన్‌ తాజాగా మరోసారి ఉక్రెయిన్‌పై దండెత్తారు. అత్యంత బలీయశక్తి అయిన రష్యాపై ఉక్రెయిన్‌ నిస్సహాయంగా పోరాడుతోంది. ప్రపంచ దేశాలు బయటకు వల్లెవేసే శాంతి వచనాలను విని తమకు రక్షణగా నిలిచే ఆయుధాలను వదిలినందుకు ఉక్రెయిన్‌ వాసులు 2014 నుంచి పశ్చాత్తాప పడుతూనే ఉన్నారు. డాన్‌బాస్‌లోని రెండు ప్రాంతాలకు గుర్తింపునిచ్చే సమయంలో ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తుందంటూ ఆరోపించడం పుతిన్‌ గడసరితనానికి నిదర్శనంగా నిలిచింది. మరోపక్క తన భార్య జిల్‌తో కలిసి నేడు ఉక్రెయిన్‌ ప్రజల కోసం ప్రార్థిస్తానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొనడం కొసమెరుపు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.