ETV Bharat / international

'స్పుత్నిక్‌-వీ టీకా సాంకేతికత బదిలీకి సిద్ధం'

author img

By

Published : Jun 5, 2021, 8:03 PM IST

Updated : Jun 5, 2021, 10:51 PM IST

స్పుత్నిక్‌ టీకా సాంకేతికత బదిలీకి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ ప్రకటించారు. విదేశాల్లోనూ టీకా తయారీకి సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యానేనని ప్రకటించిన ఆయన.. స్పుత్నిక్‌ సామర్థ్యంపై వస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.

Russia putin sputhnik
స్పుత్నిక్‌ పుతిన్‌

రష్యా టీకా స్పుత్నిక్‌-వీ తయారీకి సంబంధించిన సాంకేతికతను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్ ప్రకటించారు. సాంకేతిక బదిలీతో పాటు టీకాల తయారీని విదేశాలకు విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థల.. ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమైన పుతిన్‌ స్పుత్నిక్‌ టీకాల సామర్థ్యంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు.

66 దేశాలకు..

ఇప్పటివరకు 66 దేశాలకు స్పుత్నిక్‌ టీకాలను విక్రయిస్తున్నట్లు తెలిపిన ఆయన.. టీకా సామర్థ్యంపై వస్తున్న ఆరోపణలు కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తున్నవిగా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ నిపుణులు సైతం స్పుత్నిక్‌ టీకా 97.6 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు చెప్పారని పుతిన్‌ గుర్తుచేశారు.

మరోవైపు భారత్‌లో స్పుత్నిక్‌ టీకాల తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ముందుకు రాగా.. ఇందుకు కేంద్రం అనుమతించింది. అటు.. పనేసియా బయోటెక్‌తో కలిసి రష్యన్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ భారత్‌ లోనే టీకాలను తయారు చేస్తోంది.

అమెరికా అధ్యక్షునితో చర్చలు..

అమెరికా-రష్యాల మధ్య ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఇరు దేశాలూ కృషి చేయాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన ప్రసంగించారు. జూన్​ 16న జెనీవాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో జరగనున్న సమావేశంలో.. వ్యూహాత్మక స్థిరత్వం, అంతర్జాతీయ వివాదాలకు పరిష్కారం, కరోనాపై పోరులో సహకారం, ఆయుధ నియంత్రణ, ఉగ్రవాద ముప్ప, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

అమెరికా-రష్యా సంబంధాలు అగ్రరాజ్యంలోని అంతర్గత రాజకీయ ప్రక్రియలకు బందీగా మారినట్లు పుతిన్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఏదో ఒక చోట ముగుస్తుందని ఆయన నమ్ముతున్నట్లు జిన్హువా వార్తా సంస్థ పుతిన్​ను ఉటంకిస్తూ పేర్కొంది.

ఇవీ చదవండి: 'మోదీ, జిన్​పింగ్​లకు ఆ సామర్థ్యం ఉంది'

'త్వరలో కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు'

రూ.500లకే రెండు డోసుల టీకా!

Last Updated : Jun 5, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.