ETV Bharat / international

బ్రిటన్ గౌరవ జాబితాలో భారత సంతతి వ్యక్తులు

author img

By

Published : Oct 10, 2020, 2:32 PM IST

బ్రిటన్ రాణి అధికారిక పుట్టిన రోజు వేడకల సందర్భంగా విడుదల చేసిన గౌరవ జాబితాలో పలువురు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. బిలియనీర్ సోదరులు జుబేర్, మోహ్సిన్ ఇస్సా, ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలు, ఫిట్​నెస్​పై అవగాహన కల్పించిన 'స్కిప్పింగ్ సిక్' సహా పలువురు గౌరవ సత్కారాలు అందుకోనున్నారు.

Indian-origin billionaire brothers, academic, Skipping Sikh on Queen's honours list
బ్రిటన్ గౌరవ జాబితాలో భారత సంతతి వ్యక్తులు

బ్రిటన్ మహారాణి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గౌరవ జాబితాలో భారత సంతతికి చెందిన పలువురు వ్యక్తులకు చోటు లభించింది. ఇటీవల యూకే సూపర్​ మార్కెట్ సంస్థ 'ఆస్డా'ను లక్షల పౌండ్లతో కొనుగోలు చేసిన బిలియనీర్ సోదరులు జుబేర్, మోహ్సిన్ ఇస్సాలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. వ్యాపారం, దాతృత్వంలో సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం.. వీరికి 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్​' ప్రకటించింది.

వీరి తల్లితండ్రుల స్వస్థలం గుజరాత్. 1970లో వీరి కుటుంబం యూకేకి వెళ్లిపోయింది. అనంతరం ఈజీ గ్రూప్ వ్యాపారాల్లో భాగంగా యూరో గ్యారేజెస్​ పేరుతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది.

ఇంకా ఎందరో...

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యద్విందర్ సింగ్ మల్హి సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన సీబీఈ(కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సెలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్) గౌరవం అందుకోనున్నారు.

వీరితో పాటు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలే షా(ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్), డా. సంజీవ్ నిచానీ(హీలింగ్ లిటిల్ హార్ట్స్ సీఈఓ) బ్రిటన్ నుంచి ఓబీఈ(ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సెలెంట్ ఆర్డర్) గౌరవం అందుకోనున్నారు.

74 ఏళ్ల 'స్కిప్పింగ్ సిక్​' సైతం బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఎంబీఈ(మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ధి బ్రిటిష్ ఎంపైర్) సత్కారాన్ని పొందనున్నారు. లాక్​డౌన్ సమయంలో ఫిట్​నెస్​, ఆరోగ్యానికి సంబంధించి వీడియోలు తీసి ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఆయనను ఎంపిక చేశారు.

వీరితో పాటు

యూకే జాతీయ వైద్య సేవా సంస్థ కోసం 14 వేల డాలర్లు విరాళం సేకరించిన హర్జాల్ సహా ఆరోగ్యం, ఫిట్​నెస్​పై ప్రజలకు అవగాహన కల్పించిన లవీనా మెహతా, లాక్​డౌన్​లో(గురుద్వారాలు మూసి ఉన్నప్పుడు) సిక్కుల ప్రార్థనల కోసం ఆన్​లైన్ పోర్టల్​ ప్రారంభించిన సందీప్ సింగ్ దహీలీ సైతం ఈ జాబితాలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎంబీఈ సత్కారం లభించనుంది. వీరే కాకుండా బింటి వ్యవస్థాపకులు మంజిత్ కౌర్ గిల్, నృత్య గురువు పుష్కల గోపాల్, విద్యా శాఖలో సీనియర్ పాలసీ అధికారి వసంత్ పటేల్, సెంటర్ నాలెడ్జి ఈక్విటీ వ్యవస్థాపకులు బల్జీత్ కౌర్ సంధులు ఈ జాబితాలో ఉన్నారు.

కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు సహకారాలు అందించినందుకు ఈసారి 414 మందికి ఈ గౌరవం కల్పించారు.

ఇదీ చదవండి- ప్లాస్మా దానానికి సిద్ధమే అంటున్న ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.