ETV Bharat / international

Flying car: ఎగిరే కారు వచ్చేసింది.. రెండే నిమిషాల్లో ఆకాశంలోకి..!

author img

By

Published : Jan 26, 2022, 6:13 PM IST

Flying car Slovakia: రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలు, వర్షాలు, రహదారి మరమ్మతుల వంటి సందర్భాల్లో స్తంభిస్తున్న రాకపోకలు.. ఇవన్నీ వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా రోడ్డుపై వెళ్తున్న కారుతోనే ఆకాశంలో ఎగిరిపోతే.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది త్వరలో నిజం కాబోతోంది. హాలీవుడ్‌ సినిమాను తలపించేలా భూమిపైన దూసుకుపోతూ, ఆకాశంలో ప్రయాణించే కార్ల కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎగిరే కారుకు ఎయిర్‌ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ.. స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Flying car
ఎగిరే కారు వచ్చేసింది

ఎగిరే కారు వచ్చేసింది

Flying car Slovakia: మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8 వేల అడుగుల ఎత్తున దూసుకుపోతే.. గగనంలో ఆగకుండా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరిస్తే.. ఇదేదో హాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా.. కాదు సాకారమవుతోన్న నిజం.

స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్‌ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్టు ఫ్లైట్, 200 సార్లకుపైగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ల తర్వాత ఈ ఎయిర్‌కార్‌కు ఎయిర్‌ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజిన్‌ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్​ఏ ప్రమాణాలను ఈ ఎగిరే కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్‌‌ కారు 8,200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు అవసరం అవుతుంది.

Flying car
ఆకాశంలో ఎగిరే కారు

ధర రూ.5.5 కోట్లు!

ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని.. దీని ధర రూ. 4.5కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు ఉంటుందని ఎగిరే కారును తయారు చేసిన క్లెయిన్‌ విజన్‌ సంస్థ తెలిపింది. కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉండగా.. ఎగిరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలుకున్న ఈ కారు గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అంటోన్ జాజాక్ తెలిపారు. డ్రోన్‌ల మాదిరిగా ఈ ఎగిరే కారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదని విమానంలానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి రన్‌వే అవసరం అవుతుందని తయారీదారులు వెల్లడించారు.

Flying car
విమానాశ్రయంలో ఎగిరే కారు

2017 నుంచే..

ఈ ఎగిరే కారుతో త్వరలోనే లండన్ నుంచి పారిస్‌కు ప్రయాణించే అవకాశం ఉందని తయారీదారులు తెలిపారు. 2017 నుంచి ఎగిరే కారును క్లెయిన్‌ విజన్‌ కంపెనీ అభివృద్ధి చేస్తుండగా.. దీనికి స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నుంచి తాజాగా ధ్రువీకరణ లభించింది. తాను రూపొందించిన ఎయిర్‌ కారులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిందని.. కారును తయారు చేసిన ప్రొఫెసర్‌ క్లీన్‌ వివరించారు. ప్రస్తుతం రవాణా సదుపాయాలపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఓ సరికొత్త పరిష్కారంగా మారే అవకాశం ఉందని.. నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Flying car
ఆకాశ వీధుల్లో దూసుకెళ్తున్న కారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.