ETV Bharat / international

'టీకాల ఎగుమతిపై అమెరికా చర్యలు చేపట్టాలి'

author img

By

Published : May 8, 2021, 8:15 AM IST

porto eu summit, european union summit 2021
ఐరోపా సమాఖ్య సమావేశం

పేటెంట్​ రద్దు దీర్ఘకాలానికే ఉపయోగపడుతుందని.. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించడానికి అమెరికా.. తమ టీకాలను ఎగుమతి చేయడంపై దృష్టి సారించాలని ఐరోపా సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ మేరకు పోర్చుగల్​​లో జరిగిన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించేందుకు.. టీకాల ఎగుమతిపై అమెరికా దృష్టి సారించాలని ఐరోపా సమాఖ్య పిలుపునిచ్చింది. టీకాలపై మేధో సంపత్తి హక్కుల రద్దు నిర్ణయం దీర్ఘకాలానికే ఉపయోగపడుతుంది అభిప్రాయపడింది.

"మేధో సంపత్తిపై చర్చించాలనుకునే వారు.. ఆ ప్రాంతం(అమెరికా)లో తయారవుతున్న వ్యాక్సిన్లను ఎగుమతి చేసే విధంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉండాలి," అని ఈయూ కమిషన్​ అధ్యక్షురాలు ఉర్సులా వాన్​డెర్​ లేయాన్​ వెల్లడించారు. పోర్చుగల్​లో జరిగిన ఈయూ సదస్సులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె.

ఈ వ్యవహారంపై ఈయూ వైఖరిని ఉద్దేశిస్తూ.. ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఎలా ఉత్పత్తి చేయాలో తెలియని లాబ్​లకు మీరు మేధో సంపత్తి హక్కులను ఇవ్వొచ్చు. కానీ.. రేపు అనే రోజున అవి టీకాలు ఉత్పత్తి చేయలేవు. బైడెన్​ ప్రభుత్వం టీకాల ఎగుమతిపై దృష్టి సారించాలి. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న 100శాతం వ్యాక్సిన్లు కేవలం అమెరికన్​ మార్కెట్​లోనే అందుబాటులో ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మేమే ఎక్కువ శాతం టీకా పంపిణీ చేస్తున్నాము. ఐరోపా అందుకు గర్వపడాలి."

-ఇమ్మాన్యుయేల్ మెక్రాన్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు

దౌత్యపరంగా వ్యాక్సిన్ల విషయంలో ఇంతకాలం ఈయూ ముందువరుసలో ఉంది. టీకాలపై మేధో సంపత్తి హక్కుల రద్దుతో.. ఈయూని వెనక్కి నెట్టి ప్రపంచ దేశాల చూపును తనవైపు తిప్పుకుంది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో.. అమెరికాపై ఒత్తిడి తెచ్చి ప్రపంచ దేశాల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈయూ.

"ఈ వారం ఐరోపా సమాఖ్య 200 మిలియన్ల డోసులను ఐరోపాలో పంపిణీ చేస్తే.. అంతే మొత్తాన్ని మేము ఇతర దేశాలకు ఎగుమతి చేశాము. ఐరోపాలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 50 శాతం దాదాపు 90 దేశాలకు ఎగుమతి అవుతోంది. బైడెన్​ ప్రభుత్వంతో పాటు ఇతర దేశాలు ఈ విధంగా కృషి చేయాలి."

-ఉర్సులా వోన్​ డేర్​ లేయాన్​, ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు

ఇదీ చదవండి : 'భారత్​లో పరిస్థితి చూసి హృదయం ముక్కలైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.