ETV Bharat / international

కొవిడ్‌ తర్వాత వేగంగా వ్యాధుల ముసురు.. కారణమిదే...

author img

By

Published : Nov 1, 2021, 2:54 PM IST

covid
కొవిడ్​-19

కొవిడ్​-19 శరీరంలోని రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ కారణంగానే.. కరోనా తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు(Post Covid Complications) తలెత్తినప్పుడు రోగనిరోధక కణాలు స్పందించే తీరులో మార్పులు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.

కొవిడ్‌ సోకితే రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక కణాల సామర్థ్యాన్ని ఇది బలహీనపరుస్తోందని.. ఫలితంగా అనుబంధ ఆరోగ్య సమస్యలు(Post Covid Complications) తలెత్తినప్పుడు అవి స్పందించే తీరులో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.

మ్యూనిచ్‌లోని లూడ్విగ్‌ మాక్సిమిలియన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. విశ్వవిద్యాలయ బయోమెడికల్‌ సెంటర్‌లోని ఇమ్యూనాలజీ ప్రొఫెసర్‌ అన్నె క్రూగ్‌ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.

వైరస్‌ కారణంగా రోగనిరోధక శక్తిపై పడుతున్న అదృశ్య దుష్ప్రభావాలను(Covid complications) కనుక్కోవడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన ఫలితాలను పీఎల్‌వోఎస్‌ పాథోజెన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.

పరిశోధన ఫలితాలు ఇలా..

సార్స్‌ కోవ్‌-2 సోకిన వారిలో 3 నుంచి 10 శాతం రోగులకు మధ్య స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో వైరస్‌పై రోగనిరోధక శక్తి తీవ్రంగా స్పందిస్తోంది. ఇది శరీరంలోని కీలక వ్యవస్థల్లో వాపును పుట్టిస్తోంది. నరాల లోపల రక్తం గడ్డలు కట్టేందుకు కారణం అవుతోంది. ఫలితంగా ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపిస్తోన్నట్లు గుర్తించారు.

సార్స్‌ కోవ్-2 వైరస్‌ సోకిన తర్వాత శరీరంలోని రోగనిరోధక శక్తిలోని డెన్డ్రిటిక్‌ అనే కణాల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పనిచేయదు. దీని ఫలితంగా సదరు రోగి వైరస్‌ నుంచి కోలుకొన్నా.. సెకండరీ ఇన్ఫెక్షన్ల(అనుబంధ ఆరోగ్య సమస్య) బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరిగిపోతోంది.

ఏమిటీ డెన్డ్రిటిక్‌ కణాలు..?

డెన్డ్రిటిక్‌ కణాలు వ్యాధినిరోధక వ్యవస్థలో చాలా కీలకమైనవి. శరీరంలో ప్రవేశించే క్రిములకు వ్యతిరేకంగా వ్యాధినిరోధక స్పందనను ఇవే ప్రేరేపిస్తాయి. సహాయ టి కణాలను సచేతనం చేస్తాయి. ఇవి బి సెల్స్‌ యాంటీబాడీస్‌ను స్రవించి వైరస్‌ను చంపేలా చూస్తాయి.

ప్రొఫెసర్‌ క్రూగ్‌ బృందం మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులపై పరిశోధనలు చేసింది. మొత్తం 65 మంది రక్త నమూనాలు సేకరించి వాటిని విశ్లేషించింది. వీరి రక్తంలో డెన్డ్రిటిక్‌ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాదు, డెన్డ్రిటిక్‌ కణాలకు టి సెల్స్‌ను సచేతనం చేసే సామర్థ్యం కూడా తగ్గిన విషయాన్ని గమనించారు.

ఇదీ చూడండి: కొవిడ్ ఆంక్షల అమలుపై షాకింగ్ సర్వే- థర్డ్ వేవ్ తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.