ETV Bharat / international

కరోనా నుంచి కోలుకోని బ్రిటన్​ పీఎం- ఆసుపత్రికి తరలింపు

author img

By

Published : Apr 6, 2020, 10:21 AM IST

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. కరోనా వైరస్​ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు. జాన్సన్​ మరికొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని వెల్లడించారు.

Boris Johnson admitted to hospital for COVID-19 tests
కరోనా నుంచి కోలుకోని బ్రిటన్​ ప్రధాని-ఆసుపత్రికి తరలింపు

కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు అధికారులు. గత పది రోజులుగా స్వీయ నిర్బంధంలో చికిత్స పొందుతున్నా.. ప్రధానిలో ఇప్పటికీ వైరస్‌ లక్షణాలున్నాయని, అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

జ్వరం తగ్గలేదు

జాన్సన్​కు గతవారమే కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయనలో ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడగించుకున్నట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా తెలిపారు.

"నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికీ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంతవరకు నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను."

- బోరిస్​ జాన్సన్‌, బ్రిటన్​ ప్రధాని

ఒక్కరోజే 621 మరణాలు

బ్రిటన్‌లో వైరస్‌ విజృంభణ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలులో ఉన్న షట్‌డౌన్‌ ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు అధికారులు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటించకపోతే బహిరంగ వ్యాయామాలపైనా నిషేధం విధిస్తామని హెచ్చరించారు. బ్రిటన్‌లో 24 గంటల్లో 5,903 కేసులు పెరిగినట్లు ఆదివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. ఫలితంగా ఇప్పటి వరకు వైరస్‌ సోకినవారి సంఖ్య 47,806కు పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 621 మంది మృత్యువాత పడినందున మరణాల సంఖ్య 4,934కు చేరింది.

బోరిస్‌ కోసం అమెరికా ప్రార్థనలు

ఆసుపత్రిలో చేరిన బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారన్నారు. బోరిస్‌ను దృఢమైన మనిషిగా, గొప్ప నేతగా అభివర్ణించిన ట్రంప్‌ ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రిటన్​ రాణి సందేశం

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2. ఈ మహమ్మారిపై విజయం సాధించేందుకు యుద్ధ సమయాల్లో పాటించే వ్యక్తిగత క్రమశిక్షణ అవసరమని ప్రజలకు సూచించారు. వైరస్​పై విజయం సాధిస్తామని.. మనం తిరిగి కలుసుకుంటామని, మంచి రోజులు తిరిగొస్తాయని సందేశమిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.