ETV Bharat / international

నౌక ప్రమాదంలో 13 మంది మృతి

author img

By

Published : Dec 25, 2021, 1:18 PM IST

Migrant Boat Capsizes
బోటు ప్రమాదంలో 13 మంది మృతి

Migrant Boat Capsizes: గ్రీస్​లో శుక్రవారం జరిగిన నౌక ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. నౌకలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అంచనా వేశారు. వీరంతా టర్కీ నుంచి ఇటలీకి వలసవెళ్తున్నారని వెల్లడించారు.

Migrant Boat Capsizes: గ్రీస్​లోని అజియన్​ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న నౌక శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన దారిలో ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం..

చాలా మంది వలసదారులు, శరణార్థులు అక్రమ రవాణాదారుల సాయంతో టర్కీ నుంచి ఇటలీకి ప్రయాణిస్తుంటారు. సముద్ర మార్గంలో టర్కీ నుంచి ఇటలీకి చేరుకోవాలంటే గ్రీస్​లోని అజియన్​ దీవుల​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉండే పటిష్ఠ భద్రత నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు ప్రయాణికులను ప్రమాదక మార్గాల నుంచి తరలిస్తారు. ఈ క్రమంలో నౌక ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజా నౌక ప్రమాదం పరోస్​ దీవికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఓడలో సుమారు 80 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఆ నౌక నుంచి 62 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. 13 మంది మృతిచెందారు. మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.

అదే రోజు జరిగిన మరో ఘటనలో గ్రీక్​ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్​ చేశారు. వారు అక్రమంగా తరలిస్తున్న 92 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.

మరో 11 మంది..

అంతకుముందు గురువారం కూడా.. అథెన్స్​కు 235 కిలోమీటర్ల దూరంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. 90 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో 11 మంది మహిళలు, 27 మంది చిన్నారులు ఉన్నారు.

ఫోలెగాన్​డ్రోన్​ దీవి వద్ద జరిగిన మరో నౌక ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది గల్లంతయ్యారు. 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రయాణికులు ఇరాక్​కు చెందిన వారని అధికారులు వెల్లడించారు.

దీంతో ఈ వారంలో జరిగిన నౌక ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 27కు చేరింది.

ఇదీ చూడండి : క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.