ETV Bharat / international

'తాలిబన్ల చేతిలో చావు కోసం ఎదురుచూస్తున్నా'

author img

By

Published : Aug 18, 2021, 4:51 AM IST

అఫ్గానిస్థాన్​లో తొలి మహిళ మేయర్‌గా గుర్తింపు పొందిన జరిఫా గఫారీ.. ఆ దేశంలో ప్రస్తుత సంక్షోభం పట్ల తల్లడిల్లుతున్నారు. తన ప్రాంతం అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఆమె.. తాలిబాన్ల రాకతో నిస్సహాయురాలిగా మిగిలారు. తనలాంటి వారిని తాలిబన్లు చంపేస్తారని, దానికోసమే ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

Afghanistan
తాలిబన్

అఫ్గానిస్థాన్​లో తొలి మహిళ మేయర్‌ ఆమె.. పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు.. అవమానాలు.. హత్యాయత్నాలు. తన తండ్రినీ చంపేశారు. అయినా వెరవలేదు. విద్యావంతురాలైన ఆమె.. తన ప్రాంతం అభివృద్ధి దిశగా కలలు కన్నారు. ఈ దిశగా పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ.. నేడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి! కారణం తాలిబన్లు. రెండు దశాబ్దాల క్రితం ఆంక్షల సంకెళ్లలో బందీగా కొట్టుమిట్టాడిన తన దేశం.. తాజాగా మరోసారి వారి చేతికి వెళ్లిపోవడం వల్ల ఆమె నిస్సహాయంగా మిగిలారు. మళ్లీ తన బాల్యం నాటి.. ఆటవిక తరహా పాలన ఎక్కడ వస్తుందోనని కలవరానికి గురవుతున్నారు. ఆమే.. 29 ఏళ్ల జరిఫా గఫారీ.

అఫ్గాన్‌లో మహిళల హక్కుల సాధికారతకు చేసిన కృషికిగానూ జరిఫాకు మంచి గుర్తింపు ఉంది. స్థానిక మహిళలకు ఆమె ఒక రోల్‌మోడల్‌. 2019లో బీబీసీ రూపొందించిన 'ప్రపంచవ్యాప్తంగా వంద మంది స్ఫూర్తిదాయక, ప్రభావవంత మహిళలు' జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 2020లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆమెను ఇంటర్నేషనల్‌ వుమెన్‌ ఆఫ్‌ కరేజ్‌ (ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహిళ)గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె తన మాతృభూమిలో సంక్షోభ పరిస్థితులను గమనిస్తూ.. తల్లడిల్లుతున్నారు.

ఇదీ చూడండి: అఫ్గాన్ ప్రజల కళ్లముందు మెదులుతున్న క్రూర పాలన

భారత్‌లోనే ఉన్నత విద్య..

అఫ్గాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో 1992లో జన్మించిన గఫారీ.. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించారు. మన దేశం చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. న్యాయవాది అయిన ఆమె.. హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, వ్యాపారవేత్తగానూ రాణించారు. ఆమె ప్రతిభను చూసి 2018 జులైలో వార్దాక్‌ ప్రావీన్స్‌లోని మైదాన్‌ శెహర్‌కు మేయర్‌గా ఎంపిక చేశారు.

Afghanistan
జరిఫా గఫారీ

కానీ.. స్థానిక రాజకీయ శక్తుల కారణంగా వెంటనే విధులు చేపట్టలేని దుస్థితి. ఎట్టకేలకు మార్చి 2019లో బాధ్యతలు స్వీకరించారు. మొదటిరోజే ఆమె వేధింపులు ఎదుర్కొన్నారు. పదవికి రాజీనామా చేయాలని బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ.. తాలిబన్‌, ఐఎస్‌ఐఎల్‌ తదితర ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి. అనేక సందర్భాల్లో ఆమెపై హత్యాయత్నాలు జరిగాయి.

ఇదీ చూడండి: తాలిబన్లు మంచిగా మారిపోయారా? ఆ ప్రకటనల ఆంతర్యమేంటి?

2020 నవంబరులో ఆమె తండ్రిని ముష్కరులు చంపివేశారు. 'ఇది తాలిబన్ల దుశ్చర్య. మైదాన్ శెహర్‌లో వారు నన్ను ఉండదల్చుకోనివ్వలేదు. అందుకే వారు నా తండ్రిని చంపార'ని ఆమె గతంలో ఓ సందర్భంలో కన్నీటిపర్యంతమయ్యారు. కానీ.. వీడని సంకల్పంతో.. వీటన్నింటిని తట్టుకుని పాలన కొనసాగించారు.

నాలాంటి వారని బతకనివ్వరు..

తాజాగా తన దేశం మరోసారి తాలిబన్ల వశం కావడం వల్ల.. తన ఆవేదనంతా ఓ మీడియా ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు. 'వారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా. నాతో ప్రస్తుతం భర్త, కుటుంబ సభ్యులు మిగిలారు. మాకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు. ఇప్పడు నాలాంటి వారికోసం వారు వస్తారు. చంపేస్తారు' అని తాలిబన్లను ఉద్దేశించి గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఇది ఆమె ఒక్కరి పరిస్థితే కాదు.. వేలాది స్థానికులదీ అదే దుస్థితి.

ఇదీ చూడండి: అఫ్గాన్​ నుంచి బయటపడితే చాలు.. అందరి ఆలోచన ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.