ETV Bharat / international

'అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది'

author img

By

Published : Aug 12, 2021, 9:08 PM IST

pakistan pm on us
'అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది'

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను వెళ్లగొట్టేందుకు అమెరికా తమను పావులా వాడుకుందని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రామ్​ఖాన్​ ఆరోపించారు. అగ్రరాజ్యం భారత్​కే అధిక ప్రాధాన్యం ఇస్తోందని వాపోయారు.

అమెరికాపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర విమర్శలు చేశారు. అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్ని తొలగించేందుకే అగ్రరాజ్యం తమ దేశాన్ని ఉపయోగించుకుందని మండిపడ్డారు. భారత్‌తో మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వాపోయారు. భారత్‌తో పోలిస్తే పాక్‌తో వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో విదేశీ పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను వెల్లగొట్టేందుకు తమను పావులా వాడుకొందని అసహనం వ్యక్తం చేశారు.

అఫ్గాన్‌ అధ్యక్షుడిగా అష్రఫ్‌ ఘనీ ఉన్నంత వరకు కాబూల్‌ ప్రభుత్వంతో చర్చలకు తాలిబన్లు సిద్ధంగా లేనందున అఫ్గానిస్థాన్‌ సమస్యకు రాజకీయ పరిష్కారం కష్టమేనని ఇమ్రాన్‌ అభిప్రాయపడ్డారు. ఘనీ ప్రభుత్వం తోలుబొమ్మలాంటిదని తాలిబన్లు ఆరోపిస్తున్నారన్నారు. ఘనీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చలకు తాము వెళ్లేది లేదని తాలిబన్లు తేల్చి చెబుతున్నట్టు ఇమ్రాన్‌ తెలిపారు. అమెరికా అఫ్గాన్‌ నుంచి నాటో దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం వల్ల ఆ దేశం మరింత గందరగోళ పరిస్థితుల్లో పడిందని వ్యాఖ్యానించారు.

గత కొద్ది రోజులుగా అమెరికా వ్యవహరిస్తున్న వైఖరిపై ఇమ్రాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేశాక ఇమ్రాన్‌కు ఒక్కసారి కూడా ఫోన్‌ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అఫ్గాన్‌ వంటి కొన్ని ముఖ్యమైన అంశాల్లో పాకిస్థాన్‌ను కీలక దేశంగా పరిగణించినప్పటికీ తమ ప్రధాని ఇమ్రాన్‌తో మాత్రం బైడెన్‌ మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసుఫ్‌ ఇటీవల తన అసంతృప్తిని బయటపెట్టారు. తమ దేశ నాయకత్వాన్ని విస్మరించడాన్ని బైడెన్‌ ఇలాగే కొనసాగిస్తే తమకు వేరే ఆప్షన్లు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదీ చదవండి : ఆగని తాలిబన్ల దురాక్రమణ- భారత్ ఇచ్చిన చాపర్ సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.