ETV Bharat / international

US Military: అఫ్గాన్​ 'అస్త్రాలను' పేల్చేసిన అగ్రరాజ్యం

author img

By

Published : Sep 1, 2021, 9:50 AM IST

Afghan Taliban
Afghan Taliban

అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్​ను(Afghanistan US Troops) పూర్తిగా విడిచి వెళ్లారు. అయితే వెళ్తూ వెళ్తూ ప్రధాన ఆయుధ సంపత్తిని, అధునాతన అస్త్రాలను పేల్చేసింది అగ్రరాజ్యం. తాలిబన్లకు(Afghanistan Taliban) విధ్వంసకర ఆయుధాలు అందకూడదనే ఇలా చేసింది. 2011లో పాకిస్థాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ను అంతమొందించే ఆపరేషన్‌లోనూ ఓ హెలికాప్టర్‌ను పేల్చేసింది అమెరికా.

శత్రువులను నాశనం చేయడానికి ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అయితే అధునాతన అస్త్రం వారికి చిక్కకూడదనుకున్నప్పుడు దాన్నే నాశనం చేయడం సైనిక తంత్రం. అఫ్గానిస్థాన్‌ నుంచి వైదొలిగిన అమెరికా సైన్యం (Afghanistan US Troops) ఇప్పుడు అదే పనిచేసింది. కోట్ల డాలర్ల విలువైన విమానాలు, వాహనాలు, అస్త్రాలను నిరుపయోగంగా మార్చేసి, తాలిబన్లకు(Taliban News) 'అందకుండా' చేసింది. ఆగస్టు 14 నుంచి కాబుల్‌ విమానాశ్రయం కేంద్రంగా విదేశీయులు, సైనికుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాఫీగా సాగడానికి వీలుగా ఎయిర్‌పోర్టును అగ్రరాజ్యం పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంది. దీన్ని రక్షించడానికి దాదాపు 6వేల మంది సైనికులు, సాయుధ శకటాలు, ఇతర సాధన సంపత్తిని మోహరించింది. 'ఆగస్టు 31 గడువు' నేపథ్యంలో అఫ్గాన్‌ నుంచి హడావుడిగా తిరుగుప్రయాణమైన అమెరికా దళాలు తమ వెంట తీసుకెళ్లగలిగినంత సాధన సంపత్తిని స్వదేశానికి తరలించుకెళ్లాయి. తీసుకెళ్లలేమని భావించిన విమానాలు, వాహనాలు, ఆయుధాలను ధ్వంసం చేశాయి.

వాటిలో ప్రధాన అస్త్రాలు..

  • విమానాలు, హెలికాప్టర్లు: 73. వీటిలో ఏడు చినూక్‌ సీహెచ్‌-46 హెలికాప్టర్లూ ఉన్నాయి.
  • కాక్‌పిట్‌ కిటికీలను పేల్చేయడం, టైర్లను తుపాకులతో కాల్చడం సహా పలు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేశారు.
  • మందుపాతరలనూ తట్టుకోగల ఎంఆర్‌ఏపీ సాయుధ శకటాలు: 70. ఒక్కో వాహనం ధర 10లక్షల డాలర్లు.
  • తేలికపాటి ‘హమ్వీ’ రవాణా వాహనాలు: 27. ఒక్కో దాని విలువ లక్ష డాలర్లు.
  • శత్రువులు ప్రయోగించే రాకెట్, శతఘ్ని, మోర్టార్‌ గుళ్లను పసిగట్టి, మార్గమధ్యంలోనే పేల్చివేసే సి-రామ్‌ వ్యవస్థ: 1. ధర కోటి-కోటిన్నర డాలర్లు. సోమవారం ఉగ్రవాదులు చేసిన రాకెట్‌ దాడుల నుంచి కాబుల్‌ విమానాశ్రయాన్ని రక్షించింది ఈ వ్యవస్థే.

లాడెన్‌ వేట సమయంలోనూ..
2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా ముఠా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను అంతమొందించే ఆపరేషన్‌లోనూ అమెరికా స్వీయ హెలికాప్టర్‌ను పేల్చేసింది. ఆ దాడి కోసం అఫ్గాన్‌ నుంచి 'సీల్స్‌' కమాండో(seals commando)లను రెండు సరికొత్త శ్రేణి యూహెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్ల(blackhawk helicopter)లో తరలించారు. లాడెన్‌ నివాసానికి చేరుకున్నాక సాంకేతిక సమస్యతో ఒక లోహవిహంగం కుప్పకూలింది. అందులోని సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యర్థుల చేతిలో పడకూడదని భావించిన కమాండోలు దాన్ని పేల్చేశారు. శత్రు రాడార్లను ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో ఈ హెలికాప్టర్‌ తయారైంది. అందుకే దాని రాకను పాక్‌ సైన్యం అప్పట్లో పసిగట్టలేకపోయింది. ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ, అధునాతన నేవిగేషన్‌ కంప్యూటర్లూ ఆ హెలికాప్టర్‌లో ఉన్నాయి. నాడు లోహవిహంగంలోని తోక భాగం పేలిపోలేదు. అమెరికా హెచ్చరికలను బేఖాతురు చేస్తూ.. ఆ శకలాల వద్దకు చైనా సైన్యాధికారులను పాక్‌ అనుమతించింది. కొంతకాలం తర్వాత వాటిని అగ్రరాజ్యానికి అప్పగించేసింది.

కరిగించేసే గ్రెనేడ్లు..

కొన్ని ఆయుధ వ్యవస్థలను నాశనం చేయడానికి అమెరికా సైనికులు ప్రత్యేక 'థెర్మేట్‌ గ్రెనేడ్ల'(Thermite grenade)ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అవి పేలగానే దాదాపు 2,200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వెలువడుతుంది. అంత వేడిలో ఆయుధ వ్యవస్థలోని కీలక భాగాలు పూర్తిగా కరిగిపోతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.