ETV Bharat / international

తాలిబన్ల చేతికి 15 లక్షల మంది బయోమెట్రిక్ డేటా!

author img

By

Published : Aug 24, 2021, 8:32 PM IST

అమెరికా సైన్యానికి సహకరించిన అఫ్గాన్ పౌరుల బయోమెట్రిక్ సమాచారం తాలిబన్ల(Taliban news) చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 15 లక్షల మందికి పైగా పౌరుల వేలి ముద్రలు, ఐరిస్, ఫేషియల్ స్కానింగ్ డేటా ఇందులో ఉన్నాయి.

AFGHAN TALIBAN BIOMETRIC DATA
తాలిబన్ల చేతికి 15 లక్షల మంది బయోమెట్రిక్ డేటా!

ఆటవిక పాలనను తలదన్నే పద్ధతులు.. ప్రత్యర్థులను కర్కశంగా హతమార్చడం.. ఆక్రమణలు, అరాచకాలు, అకృత్యాలు.. ఇవీ తాలిబన్లు అంటే ఎవరికైనా గుర్తొచ్చే అంశాలు. అలాంటి వారి చేతుల్లోకి కీలకమైన సమాచారం వెళితే? కానీ సుమారు 15 లక్షల మంది బయోమెట్రిక్ డేటా తాలిబన్ల(taliban biometric data) హస్తగతమైనట్లు తెలుస్తోంది.

అఫ్గాన్ పౌరుల ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కానింగ్, ఐరిస్ డేటాను నిక్షిప్తం చేసేందుకు అమెరికా సైన్యం 2007లో 'హైడ్' అనే చిన్న పరికరాన్ని(HIIDE biometric device) రూపొందించింది. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరంతో బయోమెట్రిక్ సమాచారం సేకరించి డేటాబేస్​లో నిల్వ చేసేది. చొరబాటుదారులను, వాంటెడ్ నేరస్థులను పట్టుకునేందుకు దీన్ని తయారు చేసినప్పటికీ.. అమెరికా యుద్ధానికి సహకరిస్తున్న అఫ్గాన్ పౌరుల సమాచారాన్ని సేకరించేందుకు సైతం ఈ పరికరాన్ని ఉపయోగించారు. 15 లక్షల మందికి పైగా అఫ్గాన్ పౌరుల సమాచారం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యాండ్​హెల్డ్ ఇంటర్ఏజెన్సీ ఐడెంటిటీ డిటెక్షన్ ఎక్విప్​మెంట్.. ఇదీ హైడ్ పూర్తిపేరు. ఇప్పుడీ హైడ్ డేటా పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిందని(Taliban access to the biometric data) తెలుస్తోంది. దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న ముష్కర ముఠా.. ఆయుధాలు, మిలిటరీ పరికరాలనూ తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇందులో అమెరికా సేకరించిన బయోమెట్రిక్ డేటా సైతం ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

తాజా పరిణామంతో బయోమెట్రిక్ సమాచార సేకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా సేకరించి, నిల్వ చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బయోమెట్రిక్ డేటాబేస్​(biometric databases)లు ఎలా తయారు చేస్తారు?

ఓ వ్యక్తిని గుర్తించేందుకు ఉపయోగపడే శారీరక, వ్యక్తిత్వ లక్షణాల సమాచారాన్నే బయోమెట్రిక్ డేటా(సంక్షిప్తంగా బయోమెట్రిక్స్) అంటారు. ముఖ లక్షణాలు, స్వర నమూనా, వేలి ముద్రలు, ఐరిస్(కంటిపాప)ను గుర్తించి బయోమెట్రిక్స్​ను సేకరిస్తారు. వ్యక్తుల గుర్తింపును నిర్ధరించేందుకు అత్యంత విశ్వసనీయమైన పద్ధతిగా బయోమెట్రిక్​ను పరిగణిస్తారు. ప్రభుత్వాలు, సంస్థలు విరివిగా ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి.

సేకరించిన బయోమెట్రిక్ డేటాను ఇంటర్నల్ డేటాబేస్​ సమాచారంతో పోల్చి చూసి వ్యక్తులను కనిపెట్టేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తాయి. హైడ్ పరికరాన్ని ఇలాగే ఉపయోగించుకున్నట్లు అమెరికా ఆర్మీకి చెందిన బయోమెట్రిక్స్ టాస్క్ ఫోర్స్(US Army's Biometrics Task Force) 2007లో ఓ నివేదికలో పేర్కొంది.

ఇరాక్ మిషన్ స్ఫూర్తితో..

ఇరాక్​లో బయోమెట్రిక్ డేటా సేకరణకు అమెరికా చేసిన ప్రయత్నాలే క్రమంగా అఫ్గానిస్థాన్​లో అమలుకు కారణమయ్యాయని ప్రముఖ ఆంథ్రపాలజిస్ట్ నైనా టాఫ్ట్ జనెగరా తెలిపారు ఈ మేరకు 2021 మేలో విడుదలైన ఓ నివేదికలో పేర్కొన్నారు.

"అఫ్గాన్​లో బయోమెట్రిక్ డేటా సేకరణ విషయంలో వినూత్న పద్ధతులు పాటించాలని అమెరికా ఆర్మీ కమాండర్ గైడ్ అధికారులకు సూచించారు. ప్రజలు తమ వ్యక్తిగత డేటాను ఇచ్చేందుకు ఇష్టపడరని ఆయనకు తెలుసు. అందుకే.. వారి సంరక్షణ కోసమే సమాచారం సేకరిస్తున్నామనేలా బయోమెట్రిక్స్ సేకరించాలని సూచించారు. అమెరికా బయోమెట్రిక్ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని అఫ్గాన్ ప్రభుత్వం నేషనల్ ఐడీ కార్డు విధానాన్ని రూపొందించింది. యూనివర్సిటీ విద్యార్థులు, సైనికుల డేటా సేకరించింది. పాస్​పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి చేసింది."

-నైనా టాఫ్ట్ జనెగరా, ఆంథ్రపాలజిస్ట్

అయితే, హైడ్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారా లేదా అన్న విషయంపై అయోమయం నెలకొంది. పైన పేర్కొన్న వ్యక్తుల సమాచారం వారి చేతుల్లో పడితే అనేక సమస్యలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2016-17లో తాలిబన్లు దేశవ్యాప్తంగా బస్సులను ఆపి.. ప్రయాణికులకు బయోమెట్రిక్ చెక్ నిర్వహించారు. బస్సుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను గుర్తించేందుకు ఇలా చేశారు. ఎవరైనా అధికారులు వారికి దొరికితే నిర్బంధిస్తారు. ఒక్కోసారి చంపేస్తారు కూడా! తాజాగా తమకు అందిన సమాచారాన్ని ప్రతీకారం తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మనకు సౌలభ్యమే.. కానీ వారికి మాత్రం..

ప్రస్తుతం స్మార్ట్​ఫోన్లలో బయోమెట్రిక్ ఫీచర్ అందుబాటులో ఉంటోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ ఉంటున్నాయి. ఇవన్నీ సౌలభ్యం కోసం అందుబాటులోకి వచ్చాయి. కానీ, మానవతా సంక్షోభం తలెత్తిన ప్రాంతాలు, యుద్ధాలు జరుగుతున్న ప్రదేశాలలో బాధితులకు సహాయం చేసేందుకు బయోమెట్రిక్ సమాచారమే కీలకం. ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఇవి ఉపయోగపడతాయి.

2002లో పాకిస్థాన్​లోని శరణార్థులను అఫ్గాన్​కు తిరిగి పంపే కార్యక్రమంలో ఐరిస్ టెక్నాలజీని ఉపయోగించారు. శరణార్థులకు అందించే సహాయాన్ని ఒకసారికి మించి స్వీకరించినవారిని గుర్తించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR) బయోమెట్రిక్​ను విశ్వసనీయ సమాచారంగా పరిగణిస్తుంది. 2002 మార్చి-అక్టోబర్ మధ్య బయోమెట్రిక్ పరీక్షలో విఫలమైన.. 3.96 లక్షల మంది శరణార్థులకు సహాయాన్ని నిరాకరించింది.

ఐరిస్ రికగ్నిషన్​లో రెండు నుంచి మూడు శాతం ఫలితాలు తప్పుగా వచ్చేందుకు ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం 11,800 మంది అర్హులకు సాయం అందలేదని లెక్కగట్టారు.

అనుమతులు లేకుండానే ప్రభుత్వాలకు బదిలీ

మరోవైపు, 2018 నుంచి రోహింగ్యా శరణార్థుల నుంచి కూడా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తోంది యూఎన్​హెచ్​సీఆర్. అయితే, ఈ డేటాను బంగ్లాదేశ్ ప్రభుత్వంతో యూఎన్​హెచ్​సీఆర్ పంచుకుందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ సమాచారాన్ని మయన్మార్ ప్రభుత్వానికి అందించిందని తెలిపాయి. ఇదంతా రోహింగ్యా శరణార్థుల అనుమతి లేకుండానే జరిగిందని పేర్కొన్నాయి. అఫ్గాన్ శరణార్థుల మాదిరిగానే.. రోహింగ్యాలకు సైతం సహాయ నిధులను ఆశ చూపి బయోమెట్రిక్ సమాచారం ఇచ్చేలా చేశారని వివరించాయి.

అఫ్గానిస్థాన్​లో హైడ్​ను ప్రవేశపెట్టే సమయంలోనే.. ఇరాక్​లోని ఫాలుజా నగరంలో బయోమెట్రిక్​ను అందుబాటులోకి తెచ్చింది అమెరికా సైన్యం. తిరుగుబాటు దారులు నగరంలోకి రాకుండా అడ్డుకునేందుకు దీన్ని ప్రవేశపెట్టింది. ఓ ప్రత్యేక బ్యాడ్జి ఉంటేనే నగరంలోకి అనుమతి ఉండేది. బయోమెట్రిక్ డేటా ఇస్తేనే ఈ బ్యాడ్జిని అందించేవారు. 2020లో ఇరాక్ నుంచి వైదొలిగిన అమెరికా.. ఈ సమాచారాన్నంతా అక్కడే వదిలి పెట్టేసింది. మిలిటరీ స్థావరాల్లో ఎవరెవరు పనిచేశారన్న సమాచారం సైతం ఆ డేటాబేస్​లలో ఉంది.

ప్రైవసీ ఉంటేనే బయోమెట్రిక్...

వీటన్నింటినీ గుర్తు పెట్టుకొని బయోమెట్రిక్ డేటా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బయోమెట్రిక్ ఇస్తున్నామంటే.. ప్రస్తుతం డేటా సేకరిస్తున్న ఆ సంస్థకు మాత్రమే కాకుండా.. భవిష్యత్​లో వాటి స్థానంలోకి వచ్చే ఇతర సంస్థలకూ మన సమాచారం వెళ్లినట్టే. ప్రత్యేక సందర్భాల్లో బయోమెట్రిక్ ఉపయోగకరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

సైనిక స్థావరాల్లో పనిచేసే వారితో పాటు, ముప్పు అధికంగా ఉన్న వ్యక్తుల సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఘర్షణాత్మక ప్రాంతాల్లో బయోమెట్రిక్ వ్యవస్థనే ఉపయోగించకుండా చూడాలి.

ఇదీ చదవండి:

ఆల్​ఖైదాకు తాలిబన్ల అండ- అమెరికా గుండెల్లో​ గుబులు!

తాలిబన్లతో పంజ్​షేర్​ సింహం 'రాజీ'!

తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య చర్చలు

అమెరికాకు తాలిబన్ల వార్నింగ్​.. డెడ్​లైన్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.