ETV Bharat / international

పాక్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం

author img

By

Published : Oct 22, 2020, 6:56 AM IST

పాకిస్థాన్​లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సైన్యానికి, పోలీసు బలగాలకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్​ను పారా మిలిటరీ బలగాలు అరెస్టు చేయడంపై ఇమ్రాన్​ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

Civil war_Pak
పాక్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం

పాకిస్థాన్‌లో గద్దెనెక్కిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికార, విపక్షాల మధ్య ఆధిపత్య పోరు మలుపులు తిరుగుతోంది. అది చివరికి అటు సైన్యానికి, ఇటు పోలీసు బలగాలకు మధ్య విభేదాల్ని రాజేస్తోంది.

రేంజర్లుగా పిలిచే పారా మిలిటరీ బలగాలు సింధ్‌ ప్రావిన్సులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు సఫ్దర్‌ను అరెస్టు చేసిన వ్యవహారం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.

సింధ్‌ పోలీస్‌ చీఫ్‌ ముష్తాఖ్‌ మహర్‌ ఇంటిపైకి రాత్రివేళ రేంజర్స్‌ను పంపి, ఆయన్ని అపహరించి, సంతకం కోసం ఒత్తిడి తీసుకువచ్చి మరీ సఫ్దర్‌ను అరెస్టు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అరెస్టు సంఘటన పోలీసు బలగాలకు, సైన్యానికి మధ్య అగాథం పెంచింది.

ఆగ్రహించిన సీనియర్ పోలీసులు

ఘటనపై మండిపడిన సింధ్‌ ప్రావిన్సులోని సీనియర్‌ పోలీసు అధికారులు సామూహిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరికి పాక్‌ సైన్యాధిపతి జావెద్‌ బజ్వా సూచనతో వెనక్కి తగ్గారు. సైన్యానికి అనుకూలంగా ఉండే ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు దీనిపై అధికారికంగా స్పందించలేదు. జావెద్‌ బజ్వా మాత్రం ఐజీ అపహరణ ఉదంతంపై విచారణకు ఆదేశించారు.

రెండేళ్ల క్రితం పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికైనప్పటి నుంచి చిన్న చిన్న సంక్షోభాలు తలెత్తుతున్నా.. ఇంతటి తీవ్ర సంక్షోభం మాత్రం ఇదే మొదటిసారి. పెరిగిపోతున్న ఆహార కొరత, ద్రవ్యోల్బణం, రాజకీయాల్లో సైనిక జోక్యాన్ని నిరసిస్తూ 11 విపక్ష పార్టీలు ఇప్పటికే పాక్‌ అంతటా ఆందోళన నిర్వహిస్తున్నాయి. దీంతో విపక్ష నేతలు పలువురిని ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళనలు దేశంలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:'మరో మార్గం లేదు'- ప్రజలకు పాక్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.