ETV Bharat / international

శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు

author img

By

Published : Aug 17, 2021, 10:10 PM IST

Updated : Aug 18, 2021, 8:43 AM IST

అఫ్గాన్​ను తమ గుప్పిట్లో పెట్టుకున్న అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు తాలిబన్లు. భయంతో ఉక్కిరిబిక్కరి అవుతున్న దేశ ప్రజలు, ఎప్పుడేం జరుగుతుందా? అని ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలకు అంతా ప్రశాంతంగానే ఉంటుందనే హామీనిచ్చే ప్రయత్నం చేశారు. ఇస్లామిక్​ చట్టాలకు కట్టుబడి మహిళల హక్కులను గౌరవిస్తామన్నారు. తమ నుంచి ప్రపంచ దేశాలకు ఎలాంటి హాని జరగదని తెలిపారు.

Taliban
తాలిబన్

మహిళల హక్కులకు తాము గౌరవమిస్తామని తాలిబన్లు పునరుద్ఘాటించారు. అయితే అవి ఇస్లామిక్​ చట్టాలకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. అఫ్గాన్​ను తమ వశం చేసుకున్న అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజలు, ఇతర దేశాధినేతల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

ప్రైవేటు మీడియాపైనా ఆంక్షలు ఉండవని.. అవి స్వతంత్రంగానే పనిచేయాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు ముజాహిద్​. అయితే ఆయా సంస్థలు దేశ ప్రయోజనాలు, విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలని నొక్కిచెప్పారు.

ఇతర దేశాలపై తాము దాడులకు పాల్పడమని ముజాహిద్​ వెల్లడించారు. తాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదన్నారు.

"1990 నాటి తాలిబన్లకు ఇప్పుడున్న తాలిబన్లకు సిద్ధాంతాలు, విశ్వాసం పరంగా ఎలాంటి మార్పులు లేవు. అప్పుడూ మేము ముస్లింలమే, ఇప్పుడూ ముస్లింలమే. కానీ మాకు అనుభవం పెరిగింది. మా దృష్టికోణం మారింది. పొరుగు దేశాలకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాము.. మమ్మల్ని పావుగా ఉపయోగించుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా మేము ఊరుకోము. మా తరఫున ఏ దేశానికి హాని కలిగించం. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజానికి హామీనిస్తున్నాము."

-జబిహుల్లా ముజాహిద్​, తాలిబన్ ప్రతినిధి.

అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకుంటున్నట్టు తెలిపారు ముజాహిద్​. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.

గత పాలనలో తాలిబన్లు సృష్టించిన అలజడులు ఇంకా అక్కడి ప్రజల్లో మెదులుతూనే ఉన్నాయి. మహిళలు ఇళ్ల బయటకు రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. తాలిబన్ల పాలనలో 10 ఏళ్ల వయసు దాటిన అమ్మాయిలు అసలు చదువుకోకూడదని నియమం ఉండేది. నాటి చీకటి రోజులు మళ్లీ తిరిగి వస్తాయనే భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొందరైతే దేశాన్ని విడిచి పారిపోతున్నారు.

ఇదీ చూడండి: యాక్షన్‌ సినిమాను తలదన్నేలా.. తాలిబన్ల నుంచి ఎస్కేప్!

Last Updated : Aug 18, 2021, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.