ETV Bharat / international

'పాంపియో.. మా మధ్య విభేదాలు తేవొద్దు'

author img

By

Published : Oct 27, 2020, 4:49 PM IST

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.. భారత​ పర్యటనపై చైనా స్పందించింది. దక్షిణాసియా దేశాలకు చైనాకు మధ్య విభేదాలు సృష్టించవద్దని పాంపియోను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఇండో- పసిఫిక్​ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను పాడు చేయొద్దని చెప్పుకొచ్చింది.

Beijing on Pompeo's visit to India
'పాంపియో.. మాకు మాకు మధ్య విభేదాలు తేవొద్దు'

అమెరికా- భారత్​ మధ్య జరిగిన 'బెకా' సహా కీలక రక్షణ ఒప్పందాలను చూసి ఓర్వలేని చైనా అక్కసు వెళ్లగక్కింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.. ఆసియా దేశాల పర్యటనపై తీవ్ర విమర్శలు చేసింది. దక్షిణాసియా దేశాలకు చైనాకు మధ్య విభేదాలు సృష్టించడం ఆపాలని పాంపియోను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

భారత్​ సహా శ్రీలంక, మాల్దీవుల్లో పాంపియో బృందం పర్యటించడంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ స్పందించారు.

"చైనాపై పాంపియో చేసే వ్యాఖ్యలు, ఆరోపణలు కొత్తేం కాదు. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని వారు కోరుకుంటున్నారు అనడానికి ఈ విమర్శలే సంకేతాలు. ఇలాంటి పద్ధతిని మానుకోవాలని మేం కోరుతున్నాం. చైనా, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విభేదాలను పెంచడానికి ఆయన చేసే ప్రయత్నాలని వెంటనే మానుకోవాలి. ఇక్కడి శాంతి సుస్థిరతలను పాడుచేయొద్దు."

- వాంగ్​ వెన్​బిన్​, చైనా విదేశాంగ అధికార ప్రతినిధి

భారత్, అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బెకా ఒప్పందం కుదిరింది. అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు 'బెకా' ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాపై చైనా విమర్శలు చేయడం గమనార్హం.

అమెరికా దూకుడు...

కరోనా మహమ్మారికి చైనానే కారణమని కొన్నాళ్లుగా అమెరికా విమర్శలు చేస్తోంది. అంతేగాక ఒకప్పటి సోవియట్​ యూనియన్​తో ఇతర దేశాలకు వచ్చిన ముప్పు కన్నా చైనాతోనే ప్రమాదం అధికంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా తన బలాన్ని చూపించాలని దురాక్రమణలకు పాల్పడితే సరైన సమయంలో మిత్ర దేశాలతో కలిసి తగిన బదులు ఇస్తామని ఇప్పటికే పలుమార్లు పాంపియో హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.