ETV Bharat / international

ఆర్థిక ఆంక్షలతో 'పుతిన్'​ ఉక్కిరిబిక్కిరి- చైనా తోడున్నా..!

author img

By

Published : Mar 2, 2022, 9:01 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒంటరయ్యారా? అమెరికా, నాటో కూటమి చక్రబంధంలో చిక్కుకున్నారా..? తాను అనుకున్నదొకటి, జరిగిందింకొకటైందా? తాజా పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ, ఏ దేశంపైనా ప్రయోగించని ఆర్థిక ఆంక్షలూ పుతిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.

పుతిన్​
vladmir putin

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్​ తన అణ్వస్త్ర బలగాలతో భారీ బెదిరింపులకు సైతం దిగారు. అయితే గతంలో ఎన్నడూలేనంత విధంగా రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు.. పుతిన్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, నాటో కూటమిల చక్రబంధంలోకి చిక్కుకున్నారని నిపుణులు చెబుతున్నారు.

తాజా పరిణామాలు ప్రపంచ మార్కెట్ల నుంచే కాదు, అంతర్జాతీయ సమాజం నుంచీ రష్యాను ఒంటరి చేసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో చాలా దేశాలు యుద్ధాలకు దిగాయి. వాటిపైనా ఆర్థిక ఆంక్షలు విధించారు. కానీ రష్యాపై విధించినవి అసాధారణమైనవని.. గతంలో ఏ దేశమూ ఇంతటి కఠిన ఆంక్షలు ఎదుర్కోలేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇవి రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు.

ఒక దెబ్బకు రెండు పిట్టలు

రష్యా కరెన్సీ రూబుల్‌ విలువను పడేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టాలన్నది అమెరికా, నాటో కూటమి వ్యూహం. దీన్ని సాధించాలంటే చమురు, సహజవాయువు ఎగుమతుల ద్వారా ఇప్పటికే ఆ దేశం దగ్గర భారీగా పోగుపడిన దాదాపు 630 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలను కట్టడి చేయాలి. అందుకే ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ‘స్విఫ్ట్‌’ అస్త్రాన్ని ప్రయోగించాయి. ప్రపంచంలో 11 వేల బ్యాంకులను అనుసంధానం చేసే స్విఫ్ట్‌ సమాచార వ్యవస్థ నుంచి రష్యా బహిష్కరించడం ద్వారా ఇటు రూబుల్‌ విలువా పడిపోయింది. అటు కష్టకాలంలో అక్కరకొస్తాయనుకున్న విదేశీ మారక ద్రవ్య నిధుల్లో చాలా భాగం విదేశీ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి. ఇది పుతిన్‌కు ఊహించని పరిణామమే.

ఆటల్లేవ్‌.. పాటల్లేవ్‌..!

ఆర్థిక రంగంలోనే కాదు అన్నింటిలోనూ రష్యా ఒంటరవుతోంది. అంతర్జాతీయ టోర్నీల నుంచి ఆ దేశాన్ని బహిష్కరించాలని అన్ని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం ఆదేశించింది. ఫుట్‌బాల్‌ సంఘాలదీ అదే బాట. ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌ మాస్కో నుంచి పారిస్‌కు తరలింది. చాలా టోర్నీల వేదికలను రష్యా నుంచి మారుస్తున్నట్లు వివిధ క్రీడా సంఘాలు ప్రకటించాయి. ప్రతిష్ఠాత్మక ‘యూరో విజన్‌ సాంగ్‌’ పాటల పోటీ నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్లు ఐరోపా బ్రాడ్‌కాస్టింగ్‌ యూనియన్‌ తెలిపింది.

నార్డ్‌స్ట్రీమ్‌’ సెగ

అమెరికా, బ్రిటన్‌ కొన్ని దేశాలు ఎంతగా తమపై వ్యతిరేక గళమెత్తినా..జర్మనీ, ఫ్రాన్స్‌ కాస్త మెతక వైఖరిని అనుసరిస్తాయని పుతిన్‌ భావించారు. ఆ అంచనాలూ తప్పాయి. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ప్రారంభంలో జర్మనీ కాస్త తటపటాయింపు ధోరణినే అవలంభించింది. దీనికి కారణం లేకపోలేదు. 50% పైగా జర్మనీ ఇంధన అవసరాలకు రష్యాయే ఆధారం. ఆ దేశం నుంచి నేరుగా జర్మనీకి వేసిన 11 బిలియన్‌ డాలర్ల విలువైన నార్ట్‌స్ట్రీమ్‌-2 గ్యాస్‌ పైపులైన్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. అనుమతులే తరువాయి. పైప్‌లైన్‌ కార్యకలాపాలు ప్రారంభమైతే జర్మనీ ఇంధన కష్టాలు తీరిపోతాయి. అందుకే కాస్త ఊగిసలాడింది. కానీ రష్యా దాడి చేయగానే పైప్‌లైన్‌పై నిషేధం విధించింది. ఇది పుతిన్‌ ఊహించలేదు.

చైనా తోడుంది కానీ..!

రష్యా దాడులపై చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికా, నాటో కూటమి వైఖరిని ఖండిస్తూ ఉన్నా.. రష్యాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించడానికి వెనుకాడుతోంది. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోమని హితబోధ చేస్తోంది.

ఇవీ చూడండి:

రష్యా విధ్వంసం.. దద్దరిల్లిపోతున్న ఆవాస ప్రాంతాలు.. కీవ్​పైనా బాంబుల మోత

అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్న రష్యా.. అక్కడే ప్రయోగం!

Ukraine Crisis: పుతిన్‌ ధైర్యం అతడే..? ఇంతకి ఎవరతను?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.