ETV Bharat / international

నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?

author img

By

Published : Jul 2, 2020, 7:34 PM IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి వ్యవహార శైలి ఇప్పుడు ఆయన రాజీనామా చేసే పరిస్థితుల వరకు తీసుకొచ్చింది. భారత్​తో వ్యతిరేకంగా వ్యవహరించడం ఇందుకు ఓ కారణం కాగా.. పార్టీలో అంతర్గత లుకలుకలు ఉండటం ఆయనకు ప్రతికూలంగా మారింది. మరోవైపు దేశంలో కరోనా కట్టడి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అంతర్జాతీయ సమస్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.

Nepal PM on stickier wicket after more opposition from within
నేపాల్ ప్రధాని

చైనాకు వంతపాడుతూ భారత్​కు వ్యతిరేకంగా మారడం వల్ల సొంత పార్టీ నేతలకే ప్రత్యర్థిగా మారారు నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి. తన పదవికి రాజీనామా చేయాలని సహచరులే పట్టుబడుతున్నారు. లేదంటే అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని రెండు వర్గాలుగా చీల్చుతానని ఆ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని ఓలి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? నేపాల్​లో రాజకీయ అనిశ్చితి ఏర్పడటానికి బాధ్యులు ఎవరు?

ఇదీ చదవండి- భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

కైలాశ్ మానససరోవరానికి యాత్రికులు సులభంగా చేరుకునే విధంగా భారత భూభాగంలో నిర్మించిన రహదారిని మే నెలలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ ప్రారంభించారు. ఈ రహదారికి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఇరుదేశాల మధ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇది మొదలు సందర్భం దొరికినప్పుడల్లా భారత్​పై అక్కసు వెళ్లగక్కేందుకే ఆ దేశ ప్రధాని ఓలి మొగ్గుచూపారు.

ఇదీ చదవండి- భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

నేపాల్​లో కరోనా వైరస్ వ్యాప్తికి భారతదేశమే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. అనంతరం లిపులేఖ్ పాస్, లింపియాధురా, కాలాపానీ తమవే అంటూ రాద్ధాంతం ప్రారంభించారు. వాటిని తమ భూభాగంలో చూపిస్తూ నూతన మ్యాప్​ రూపొందించారు. చైనా ఆదేశాల మేరకే భారత్​కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఓలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

ఇదీ చదవండి- 'భారత్​-నేపాల్ వివాదం పరిష్కారానికి అదొక్కటే మార్గం'

అయినా వెనక్కి తగ్గని ఓలి.. భారత్​ చేపట్టే వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. భారత సరిహద్దు వెంబడి సైనిక చర్యలు చేపట్టారు. బలగాలను మోహరించి, క్యాంప్​లు వాచ్​టవర్లు ఏర్పాటు చేశారు. చివరకు తనను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి- రాష్ట్రపతితో ప్రధాని భేటీ.. రాజీనామా చేస్తారా?

దృష్టిమరల్చేందుకే!

అయితే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అంతర్జాతీయ సమస్యలను ముందుకేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా విషయంలో ఓలి విఫలమైన నేపథ్యంలో పార్టీలో వ్యతిరేకత ఏర్పడిందని... వీటి నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే ఈ వ్యూహాలను అమలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీలో చీలిక

నేపాల్ కమ్యునిస్టు పార్టీలో ఎప్పటినుంచో లుకలుకలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారం కోసం పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువైనట్లు పరిశీలకులు చెబుతున్నారు. కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని.. మెజారిటీ వర్గం పార్టీ ఛైర్మన్ దహాల్​ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. కరోనా విషయంలో ఓలి వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగానే ఈ క్యాంపుల మధ్య అభిప్రాయభేదాలు ఎక్కువైనట్లు వివరించారు.

ఇదీ చదవండి- నేపాల్​ ప్రధాని రాజీనామాకు సొంత పార్టీ సభ్యుల డిమాండ్​

స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో అధికార పార్టీలోని చాలా వరకు నేతలు ప్రధాని పనితీరును తప్పుబడుతున్నారు. సమావేశాల్లో భాగంగా బుధవారం ఐదుగురు సభ్యులు మాట్లాడగా అందులో ముగ్గురు ప్రధాని పదవి నుంచి ఓలి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పనితీరు మార్చుకోవాలని మరో ఇద్దరు సూచించారు. మంగళవారం జరిగిన సమావేశాల్లో కమల్ దహాల్ సహా సీనియర్ నేతలంతా ఓలి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. స్టాండింగ్ కమిటీలోని 45 మంది సభ్యుల్లో 15 మంది మాత్రమే ఓలికి మద్దతిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

చైనా జోక్యం

నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం పెరగడం కూడా భారత్​కు వ్యతిరేకంగా ఓలి దూకుడుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రధాని వ్యవహారశైలి చైనాకు అనుకూలంగా ఉండటంపై పార్టీ సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా భారత్-నేపాల్ సంబంధాలు దెబ్బతిన్నాయని అంటున్నారు.

ఇదీ చదవండి- ఓలి... భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్‌!

నేపాల్​లో జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు భారీగా పెడుతోంది. ప్రతిష్టాత్మక బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్​లో భాగంగా టిబెట్​లోని కీరంగ్​ నుంచి కాఠ్​మాండూ వరకు రైల్వే లైన్​ నిర్మిస్తోంది. ఇలా నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం పెరిగిపోయింది. భారత్​కు వ్యతిరేకంగా నేపాల్​ను ఓ కీలుబొమ్మలా ఉపయోగించడం మొదలుపెట్టింది బీజింగ్.

"భారత్​కు వ్యతిరేకంగా నేపాల్​ను వాడుకున్న దాఖలాలు గతంలోనూ ఉన్నాయి. కానీ గత రెండేళ్లుగా బీజింగ్ బహిరంగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. భారత్​కు సంబంధించినంత వరకు భౌగోళిక రాజకీయ కోణాల్లో ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి."

-కె. యోమ్,​ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్

మరోవైపు 2015 ఆర్థిక దిగ్బంధనం తర్వాత భారత్​ పట్ల నేపాల్​లో వ్యతిరేకత మొదలైందని చెబుతున్నారు. ఈ సెంటిమెంట్​ను ఉపయోగించుకునే ఓలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని... శతాబ్దాలుగా రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న సన్నిహిత బంధాలు, సాంస్కృతిక సంబంధాలను విస్మరించి ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.