ETV Bharat / international

అక్కడ స్మోకింగ్​ బ్యాన్​- వారు జీవితకాలం సిగరెట్​ తాగలేరు!

author img

By

Published : Dec 9, 2021, 3:41 PM IST

Updated : Dec 9, 2021, 5:16 PM IST

new zealand smoke free: పొగతాగేవారి సంఖ్య తగ్గించడానికి న్యూజిలాండ్​ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఇక నుంచి ఏటా స్మోకింగ్​కు ఉండే కనీస వయసు అర్హతను పెంచుతామని వెల్లడించింది. ప్రభుత్వ ప్రతిపాదనపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తుందని పేర్కొన్నారు.

New Zealand Smoke Free
స్మోకింగ్​

New Zealand Smoke Free: ధూమపానంపై నిషేధం విధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్​ ప్రభుత్వం వినూత్న ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏటా ధూమపానం చేసేందుకు యువతకు ఉండాల్సిన కనీస వయసును పొడగించనుంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో ప్రస్తుతం 14 ఏళ్లు లేదా అంతన్నా తక్కువ వయసు ఉన్న వారికి సిగరెట్లపై జీవితకాల నిషేధం విధించినట్లైంది.

65 ఏళ్ల తర్వాత..

ఈ కొత్త ప్రతిపాదన చట్టంగా వస్తే 65 ఏళ్ల తర్వాత సిగరెట్లు కొనుగోలు చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 80 ఏళ్లకు చేరుతుంది. ఇలా చేయడం వల్ల దేశంలో రానురానూ.. సిగరెట్​ వినియోగం తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి దేశంలో పొగతాగేవారి సంఖ్య 5 శాతం కన్నా తక్కువ ఉండాలన్నది న్యూజిలాండ్​ ప్రభుత్వ లక్ష్యం.

ప్రస్తుతం న్యూజిలాండ్​లో సిగరెట్​ కాల్చాలంటే ఉండాల్సిన కనీస వయసు 18 ఏళ్లు.

ఆ ఉత్పత్తులపైన కూడా..

సిగరెట్లపై నిషేధంతో పాటు పొగాకు ఉత్పత్తులపై కూడా ఆంక్షలను విధించనుంది ప్రభుత్వం. విక్రయదారులు నికొటిన్​ మోతాదు తక్కువ ఉన్న పొగాకు ఉత్పత్తులనే ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని పేర్కొంది. ఈ ఉత్పత్తులు విక్రయించే స్టోర్ల సంఖ్యను తగ్గించనుంది. అయితే ఇందుకోసం రిటైలర్లకు కొంత సమయం ఇవ్వనుంది.

"పొగాకు ఉత్పత్తుల ద్వారా ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. ఏటా సగటున 5వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మరణాలను కట్టడి చేసేందుకు పన్ను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావట్లేదు. కొంతమంది సుంకాలను మరింత పెంచాలని సూచిస్తున్నారు.. కానీ అలా చేస్తే స్మోకింగ్​ అలవాటు ఉన్న వారిపై మరింత భారం పడుతుంది. అందుకే ఈ ప్రతిపాదనను తెచ్చాము. దీని వల్ల భవిష్యత్తు తరాల వారు ఈ అలవాటుకు దూరంగా ఉంటారు."

-డాక్టర్​ అయేష్​ వెరాల్​, న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి

ఈ చర్యతో వారికి నష్టం..

ప్రభుత్వ ప్రతిపాదను పలువురు స్థానికులు తప్పుపట్టారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎందరో చిరు వ్యాపారులు నష్టపోతారని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం సుంకాలు పెంచడం వల్ల ఇప్పటికే బ్లాక్​ మార్కెట్​ కూడా ఏర్పడిందని.. తాజా ప్రతిపాదన పరిస్థితిని మరింత దిగజారుస్తుందన్నారు.

న్యూజిలాండ్​లో స్మోకర్ల సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో కేవలం 11 శాతం పెద్దలకు ధూమపానం చేసే అలవాటు ఉంది. వీరిలో 9 శాతం మంది రోజు సిగరెట్​ తాగుతారు. అయితే న్యూజిలాండ్​లో ఉండే మౌరి వర్గానికి చెందిన ప్రజల్లో మాత్రం పొగతాగేవారి శాతం 22కి చేరింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక టాస్క్​ఫోర్స్​తో కట్టడికి చర్యలు చేపడుతోంది.

ప్రభుత్వ ప్రతిపాదనను వెరాల్ సమర్థించుకున్నారు. ఇది సిగరెట్​ అలవాటు మానేవారికి సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : సీడీఎస్ రావత్​ దుర్మరణంపై చైనా, పాక్ రియాక్షన్​ ఇలా...

Last Updated : Dec 9, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.