ETV Bharat / international

డెల్టా ముప్పు- మళ్లీ కర్ఫ్యూ దిశగా ఆ దేశం!

author img

By

Published : Jul 15, 2021, 7:39 PM IST

కరోనా డెల్టా వేరియంట్ పలు దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్ కారణంగా ఇండోనేసియాలో రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్​లోని పలు ప్రాంతాలు ఆంక్షల బాట పట్టాయి.

delta variant in indonesia
డెల్టా వేరియంట్

ఇండోనేసియాలో కరోనా తీవ్రత భారత్​ను మించిపోయింది. గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. గురువారం కొత్తగా 56,757 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 982 మంది మరణించారు. దీంతో ఆసియాలో వైరస్​కు హాట్​స్పాట్​గా మారింది.

జావా, బాలి ద్వీపాల నుంచి పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా ఆయా ద్వీపాల్లో ఇప్పటికే.. పాక్షిక లాక్​డౌన్ విధించారు.

నెల రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య కేవలం 8 వేలుగా ఉండేది. కానీ.. ఇప్పుడు భారత్ వంటి దేశాల కన్నా అధికంగా కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు, కోటి 56 లక్షల మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేయగలిగింది.

కొరియాలో తొమ్మిదో రోజూ..

దక్షిణ కొరియాలోనూ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వరుసగా తొమ్మిదో రోజు కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం 1600 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజధాని సియోల్​లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ కొవిడ్ విజృంభణ తీవ్రంగా ఉంది.

స్పెయిన్​లోనూ

డెల్టా స్ట్రెయిన్ వ్యాప్తితో స్పెయిన్​లోని బార్సిలోనా నగరం కర్ఫ్యూ బాట పట్టింది. వైరస్ విజృంభణ అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలన్నీ ఆంక్షలను పునరుద్ధరిస్తున్నాయి. 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

కాటలోనియా ప్రాంతంలో వైరస్ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా యువతలో వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతంలోని లక్ష మందిలో వెయ్యి మందికి వైరస్ సోకుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 20-29 ఏళ్ల వయసు ఉన్న యువతలో ఈ సంఖ్య 3,300గా ఉంది.

ఆరు నెలలు కొనసాగిన నైట్ కర్ఫ్యూను మే నెలలో ఉపసంహరించినప్పటి నుంచి కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు సడలించడం వల్ల పర్యటక ప్రాంతాల్లో రద్దీ పెరిగి వైరస్ విజృంభనకు కారణమైందని అధికారులు చెబుతున్నారు.

టీకా పంపిణీ మెరుగ్గా సాగుతున్న ఇతర ఐరోపా దేశాలను సైతం డెల్టా వేరియంట్ హడలెత్తిస్తోంది.

ఇదీ చదవండి: భారత్​ హెచ్చరికతో చర్చలకు సిద్ధమైన చైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.