ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా​ కలకలం.. ఏడాది తర్వాత మరణాలు

author img

By

Published : Mar 19, 2022, 4:28 PM IST

Covid Cases in China: చైనాలో గత కొన్ని వారాలుగా కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ మరణాలు నమోదయ్యాయి. 2019లో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చైనాలో 4,638 మంది వైరస్‌తో మృతిచెందినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

corona virus
మహమ్మారి

Covid Cases in China: కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇక్కడ దాదాపు ఏడాది తర్వాత వైరస్‌ మరణాలు సంభవించడం గమనార్హం. కరోనాతో రెండు మరణాలు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు శనివారం వెల్లడించారు. 2021 జనవరి తర్వాత ఈ దేశంలో వైరస్‌ మరణాలు సంభవించడం మళ్లీ ఇప్పుడే.

ఈశాన్య జిలిన్‌ ప్రావిన్స్‌లో ఇద్దరు వ్యక్తులు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2019లో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చైనాలో 4,638 మంది వైరస్‌తో మృతిచెందినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇక తాజాగా సామాజిక వ్యాప్తితో 2,157 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జిలిన్‌ ప్రావిన్స్‌లోనే బయటపడ్డాయి. కరోనా విజృంభణతో ఇప్పటికే చైనాలో 4 కోట్ల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లారు.

ఇకపైనా 'జీరో కొవిడ్‌' విధానమే..

మరోవైపు చైనాలో 'జీరో కొవిడ్‌' విధానానికి స్వస్తి పలకాలని డ్రాగన్‌ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న 'జీరో కొవిడ్‌' (కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకూడదన్న) విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని నిపుణులు సూచించినా సాధ్యం కాదని శుక్రవారం చైనా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే కట్టుబడి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఉప మంత్రి వాంగ్‌ హెషెంగ్‌ స్పష్టం చేశారు. జీరో కొవిడ్‌ విధానం వల్ల ప్రజల జీవితం, వృత్తి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడినా వారి ఆరోగ్యాలను, భద్రతను కాపాడటానికి ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

మరోవైపు చైనా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల 23,000 మంది భారతీయ విద్యార్థులతో సహా లక్షలాది మంది విదేశీ విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది.

అటు హాంకాంగ్‌లోనూ కొత్తగా కేసులు విజృంభించాయి. ఈ ఏడాది హాంకాంగ్‌లో కొవిడ్‌ వల్ల 5,000 మంది మృతి చెందారు. రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. రెస్టారంట్లు, వ్యాపారాలు మూతబడ్డాయి. దీనంతటినీ దృష్టిలో ఉంచుకుని చైనా ప్రభుత్వం మరికొంత కాలం జీరో కొవిడ్‌ విధానాన్ని అనుసరించి లాక్‌డౌన్‌లను కొనసాగించడానికే నిర్ణయించింది. ఇందులో భాగంగా పౌరులకు పదేపదే కొవిడ్‌ పరీక్షలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ అమలు చేస్తోంది.

ఇవీ చూడండి : 'జీరో కొవిడ్​'పై డ్రాగన్​ ఎత్తులు చిత్తు.. లాక్​డౌన్లకు గుడ్​బై!

'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్​కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.