ETV Bharat / international

చైనా అగ్రనేతపై టెన్నిస్ స్టార్ లైంగిక ఆరోపణలు- డ్రాగన్ ఉక్కుపాదం!

author img

By

Published : Nov 4, 2021, 10:24 PM IST

Updated : Nov 4, 2021, 11:35 PM IST

MeToo
జాంగ్​ గోలీ-పెంగ్ షుయ్

చైనాలో 'మీటూ' తరహా కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ స్టార్.. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. చైనాలో టాప్​ లీడర్ అయిన ఆ అధికారి... తాను నిరాకరించినప్పటికీ బలవంతం చేయబోయాడని ఆరోపించారు. అయితే వీటికి సంబంధించిన పోస్టులను చైనా అధికారులు క్షణాల్లో తొలగించారు.

చైనా ప్రొఫెషనల్ టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్ ఆ దేశానికి చెందిన మాజీ అగ్రనేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మాజీ వైస్ ప్రీమియర్‌ జాంగ్​ గోలీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి సంబంధించి చైనాలో పాపులర్ అయిన సామాజిక మాధ్యమం వీబోలో(ట్విట్టర్ లాంటిదే) ఆమె వరుస పోస్ట్‌లు చేశారు. 2013-18 మధ్య కాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ మెంబర్​గా పనిచేసిన జాంగ్ గోలీ తనను వేధించాడని 35 ఏళ్ల పెంగ్ వాపోయారు. పదేపదే నిరాకరించినప్పటికీ శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేశాడని రాసుకొచ్చారు. అయితే.. 'ఏడేళ్ల క్రితం ఒకసారి ఆయనతో సెక్స్‌లో పాల్గొన్నానని.. ఆ తర్వాత అతనిపై ఆ భావాలు లేవని' స్పష్టం చేశారు.

tennis star
టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్

"మూడేళ్ల క్రితం బీజింగ్‌లో టెన్నిస్ ఆడుతుండగా జాంగ్.. అతని భార్య వచ్చారు. అనుకోకుండా జాంగ్ నన్ను ఇంటిలోని ఒక గదిలోకి తీసుకువచ్చాడు. అక్కడ నాపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మధ్యాహ్నం నేను చాలా భయపడ్డాను. అయితే ఇలా జరగుతుందని ఎప్పుడూ అనుకోలేదు"

-పెంగ్ షుయ్

అయితే షుయ్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో అదృశ్యమైంది. అంతేగాక ఆమె పేరు, టెన్నిస్ అనే పదానికి సంబంధించిన సెర్చ్​ రిజల్ట్స్​నూ చైనా అధికారులు నిలిపేశారు. అయినప్పటికీ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. అయితే చైనా వీటిని సైతం బ్లాక్ చేసింది.

MeToo
జాంగ్​ గోలీ-పెంగ్ షుయ్

చైనాలో 2018లో వచ్చిన మీటూ ఉద్యమం అనంతరం ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారిపై వచ్చిన మొదటి ఆరోపణ ఇదే. ఇంతకుముందు మీడియా, న్యాయవాదులు, విద్యావేత్తలకు మాత్రమే ఆరోపణలు పరిమితమయ్యాయి.

మరోవైపు.. ఈ తరహా కేసుల్లో ముందుకొచ్చే బాధితులు సహా వారి మద్దతుదారులపై చైనా ఆంక్షలు విధిస్తూ అణచివేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉన్న సామాజిక మాధ్యమాలపై బహిరంగ చర్చను నియంత్రిస్తూ.. అసమ్మతి గళాన్ని వినిపించే వారిపై ఉక్కుపాదం మోపుతోందనే అభిప్రాయం ఉంది.

పెంగ్ షుయ్ డబుల్స్ విభాగంలో టాప్ ర్యాంక్ ప్లేయర్​గా కొనసాగారు. వింబుల్డన్-2013, ఫ్రెంచ్ ఓపెన్‌-2014 సహా.. 23 డబుల్స్ గ్రాండ్​స్లామ్​ టైటిళ్లను సాధించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 4, 2021, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.