ETV Bharat / international

9 మందికి కరోనా- 90 లక్షల టెస్టులకు చైనా సిద్ధం

author img

By

Published : Oct 12, 2020, 2:34 PM IST

దాదాపు రెండు నెలల తర్వాత చైనాలో కొత్తగా 9 కరోనా కేసులు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమమించింది. కేసులు నమోదైన నగరంలో 90 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

China to test 9 million after fresh outbreak
9 మందికి కరోనా..90లక్షల టెస్టులు చేయనున్న చైనా

కరోనాకు పుట్టినిల్లైన చైనాలో రెండు నెలల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదయ్యాయి. కిండావ్​ నగరంలో 9 మందికి పాజిటివ్​గా తేలింది. వీరిలో 8మంది ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలోని రోగులు కాగా.. మరొకరు బయటి కుటుంబానికి చెందివారు.

వైరస్​ కేసులు లేవని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంక్షలు ఎత్తివేసింది చైనా. తాజా కేసులతో అప్రమత్తమైంది. వైరస్​ ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై విచారణ చేపట్టింది. కేసులు నమోదైన నగరంలో 5 రోజుల్లోనే 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.

చైనాలో ఇప్పటివరకు మొత్తం 85,578 కేసులు నమోదయ్యాయి. 4,634మంది వైరస్​కు బలయ్యారు. ఆగస్టు 15న ఉరుంకి నగరంలో నలుగురికి పాజిటివ్​గా తేలిన తర్వాత ఇప్పటి వరకు కొత్త కేసులు వెలుగు చూడలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంత మందికి వైరస్​ నిర్ధరణ అయినప్పటికీ స్థానికులు ఎవరూ లేరు. విదేశీయులకు 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఇంకా అమల్లో ఉంది.

తాజాగా 9 కేసులు నమోదైన కిండావ్ నగరంలోని నౌకాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు కూడా ఈ నగరంలోనే ఉన్నాయి. పర్యటకుల నుంచే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

దక్షిణ కొరియాలో 97 కేసులు..

దక్షిణ కొరియాలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 97 మందికి పాజిటివ్​గా తేలింది. గత వారంతో పోల్చితే ఇవి అత్యధిక కేసులు. ఆ దేశంలో ఇప్పటివరకు 24,703 మందికి వైరస్ సోకగా.. 433 మంది ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.