ETV Bharat / international

దావూద్​ సహా 21 మంది ఉగ్రవాదులకు పాక్​ వీఐపీ భద్రత!

author img

By

Published : Sep 20, 2020, 7:26 PM IST

Pakistan treat 21 dreaded terrorists as VIPs
21 మంది కరడుగట్టిన ఉగ్రవాదులకు పాక్​ వీఐపీ భద్రత!

ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్​ఏటీఎఫ్​) గ్రే లిస్ట్​లో ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదంపై చర్యలు చేపడుతున్నట్లు పైకి చెబుతూనే అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పుతోందా? ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపుతున్నామంటూనే వారికి ఆశ్రయం కల్పిస్తోందా అంటే అవుననక తప్పదు. తాజాగా 21 మంది కరడుగట్టిన ఉగ్రవాదులకు వీఐపీ భద్రత కల్పించటమే అందుకు నిదర్శనం. ఆ జాబితాలో మోస్ట్​ వాంటెడ్​ అండర్​వరల్డ్​​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఉండటం గమనార్హం.

ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోన్న పాకిస్థాన్ జిత్తులమారితనం.. మరోసారి బయటపడింది. ఓ వైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఆర్థిక చర్యల కార్యదళం​ (ఎఫ్​ఏటీఎఫ్​) కత్తి మెడపై వేలాడుతున్నా.. మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. తాజాగా భారత మోస్ట్​ వాంటెడ్​ అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం సహా పలువురికి రాచమర్యాదలు చేస్తున్నట్లు నిఘావర్గాల సమాచారం. వారికి వీఐపీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

21 మందికి వీఐపీ భద్రత..

గత నెలలో 21 మంది కరడుగట్టిన ఉగ్రవాదులకు వీఐపీ భద్రత కల్పించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. వీఐపీ సౌకర్యాలు కల్పించిన వారి జాబితాలో.. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం, వాద్వా సింగ్​, బబ్బర్​ ఖాల్సా ఇంటర్నేషనల్​(బీకేఐ) అధినేత, ఇండియన్​ ముజాహిద్దీన్​(ఐఎం) చీఫ్​, ఖలిస్థాన్​ జిందాబాద్​ ఫోర్స్​ సభ్యుడు రంజీత్​ సింగ్​ నీతాలు ఉన్నారు. ఇందులో చాలా మంది భారత మోస్ట్​ వాంటెడ్​ జాబితాలో ఉన్నారు. ఉగ్రమూకలకు నిధులు సమకూర్చుతోన్న పాకిస్థాన్​ తీరును.. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతూనే ఉంది భారత్​.

భ్రమను కల్పిస్తోంది..

ఎఫ్​ఏటీఎఫ్​ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు కొద్ది వారాలుగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు పాక్​ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐరాస భద్రత మండలి విడుదల చేసిన జాబితా మేరకు.. గత నెలలో హఫీజ్​ సయీద్​, మసూద్​ అజహర్​, జాకీర్​ రెహ్మాన్​లు సహా 88 మంది ఉగ్రవాదులపై ఆంక్షలు విధించింది పాక్​. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తులను సీజ్​ చేసింది. ప్రయాణాలపై నిషేధం విధించింది. చర్యలు చేపట్టినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారో ఎలాంటి అధారాలు లేవు.

అక్టోబర్​లో తేలనున్న భవితవ్యం..

ప్రస్తుతం ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే లిస్ట్​లో ఉంది పాక్​. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జూన్​ వరకు గడువు ఇచ్చిన ఎఫ్​ఏటీఎఫ్..​ కరోనా నేపథ్యంలో దానిని సెప్టెంబర్​ వరకు పొడిగించింది. అక్టోబర్​లో ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్​లిస్ట్​లో పెట్టకుండా తప్పించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పైకి చూపించే ప్రయత్నం చేస్తోంది పాక్​. కానీ, పాకిస్థాన్​​లో ఉగ్రమూకలు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు అఫ్గాన్​ నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.