ETV Bharat / international

చైనా‌ 'ఆపరేషన్‌ ఫాక్స్‌హంట్‌'ను ఛేదించిన అమెరికా

author img

By

Published : Oct 31, 2020, 6:00 AM IST

US-charges-8-with-involvement-in-Chinas-Operation-Fox-Hunt
డ్రాగన్‌ ‘'ఆపరేషన్‌ ఫాక్స్‌హంట్‌'’ ను ఛేదించిన అమెరికా

చైనా ప్రభుత్వం అమెరికాలో రహస్యంగా చేపట్టిన 'ఆపరేషన్‌ ఫాక్స్‌హంట్‌'ను అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, ఎఫ్‌బీఐలు ఛేదించాయి. చైనాకు చెందిన ఎనిమిది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

చైనా నుంచి పారిపోయి అమెరికాలో తలదాచుకుంటున్న వారిని తిరిగి రప్పించేందుకు జిన్​పింగ్ ప్రభుత్వం రహస్యంగా చేపట్టిన 'ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌'ను అమెరికా ప్రభుత్వం ఛేదించింది. అక్టోబర్‌ 28న ఎనిమిది మంది చైనా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పలువురిని వెంటాడేందుకు, అమెరికా నుంచి తరలించేందుకు వీరిలో ఆరుగురు కుట్రలు పన్నుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

"వీరంతా పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అధికారుల ఆదేశాల మేరకు అమెరికాలో నిఘా కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ నివసిస్తున్న కొందరిపై దాడి చేశారు. వారిని చట్ట విరుద్ధంగా చైనా తరలించాలని చూస్తున్నారు. తమ దేశం నుంచి పారిపోయిన వారిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చేందుకు చట్టవిరుద్ధంగా 'ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌'లో వీరు భాగం" అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిన్‌పింగ్‌ వ్యతిరేకులను వేధించేందుకు..

సాధారణంగా దేశాల మధ్య నేరగాళ్లను అప్పగించుకోవడానికి ఒప్పందాలు జరుగుతాయి. ఆ చర్చల ప్రకారం అప్పగింతలు ఉంటాయి. కానీ, చైనా అవేమి లేకుండా చట్టవిరుద్ధంగా తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది.

దేశం నుంచి పారిపోయిన నేరగాళ్లను పట్టుకొచ్చేందుకు 2014లో జిన్‌పింగ్‌ ప్రభుత్వం అత్యంత రహస్యంగా 'ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌' చేపట్టింది. 2015 నాటికి 800 మంది అవినీతి పరులైన అధికారులను పట్టుకొచ్చినట్లు అక్కడి మీడియా గొప్పగా చెప్పుకొంది. పారిపోయిన వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించి.. కొన్ని సందర్భాల్లో విదేశాల్లో కిడ్నాపులు చేసి వారిని చైనాకు తరలించారు. వీరిలో నేరాలు చేసిన వారికంటే జిన్‌పింగ్‌కు, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారే ఎక్కువ.

ట్రంప్‌ కార్యవర్గం అధికారంలోకి వచ్చాక చైనాను అదుపుచేయడానికి ఈ 'ఫాక్స్‌హంట్‌'పై గురిపెట్టింది. గత జులైలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ వ్రే మాట్లాడుతూ "ఫాక్స్‌ హంట్‌ బాధితులు ఎఫ్‌బీఐని ఆశ్రయిస్తున్నారు. చట్టాలను చైనా తుంగలో తొక్కుతోంది" అని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్‌ అనుపానులు..

* న్యూజెర్సీలో జాన్‌డోయి అనే వ్యక్తిని రప్పించేందుకు చైనా అధికారులు 2016 నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి తండ్రితో చాలా మంది చైనా అధికారులు అక్కడకు వచ్చి వెళ్లారు. అతడి ఇంటి వద్ద నోటీసులు కూడా ఉంచారు.

"నువ్వు బుద్ధిగా చైనా వస్తే 10 ఏళ్లు జైల్లో ఉంటావు.. నీ భార్య, కుమార్తె సురక్షితంగా ఉంటారు" అని దానిలో పేర్కొన్నారు. ఆ బాధితుడి కుటుంబీకులు చైనాలో ఉండటం వల్ల వారిని వేధించడం మొదలు పెట్టారు. ఆ వ్యక్తి సోదరిని చైనాలో అరెస్టు చేశారు. ఇక బాధితుడి కుమార్తెను ఆన్‌లైన్‌లో వేధించడం మొదలు పెట్టారని అధికారులు వెల్లడించారు.

* గతనెలలో న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ టిబెట్‌ వాసిపై కేసుపెట్టారు. అతను చైనా ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న కొందరు చైనీయులపై అతను నిఘా వేసి.. ఆ సమాచారం చైనాకు పంపుతున్నట్లు తేలింది.

తాజా ఘటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్‌ స్పందించారు. సీమాంతర నేరాలను అడ్డుకోవడం మంచిదే.. కానీ, అక్కడ చైనా చట్ట ప్రకారమే వ్యవహరించిందన్నారు. "చైనా పేరును మసకబార్చడానికి అమెరికా వాస్తవాలను వక్రీకరిస్తోంది. చైనా దానిని వ్యతిరేకిస్తోంది. తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని అమెరికాకు సూచిస్తున్నాం" అని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో వుహాన్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరోలో పోలీస్‌ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.