ETV Bharat / international

కరోనా వైరస్​తో  వేల కోట్లలో ఆకలి కేకలు!

author img

By

Published : May 28, 2020, 1:41 PM IST

కరోనా వైరస్ సంక్షోభంతో లాటిన్​ అమెరికాలోనే సుమారు 14 మిలియన్ల మందికి ఆహార కోరత ఏర్పడనుందని హెచ్చరించింది ఐరాస అనుబంధ సంస్థ డబ్ల్యూఎఫ్​పీ. ఆకలి కేకలు 2019తో పొలిస్తే.. నాలుగు రెట్లు పెరిగినట్లు తెలిపింది.

Virus could push 14 million into hunger in Latin America
కరోనా వైరస్​తో 'ఆకలి' బారిన 14 మిలియన్ల మంది!

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. లాటిన్​ అమెరికాలో వైరస్​ తీవ్రమవడం, లాక్​డౌన్​, ఆర్థికవ్యవస్థ సంక్షోభం వంటి కారణాలతో దాదాపు 14 మిలియన్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్​పీ). బుధవారం విడుదల చేసిన తాజా అంచనాలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాయి. 2019లో 3.4 మిలియన్ల మందికి ఆహార కొరత ఉండగా.. అది ప్రస్తుతం నాలుగు రెట్లకు పెరగనున్నట్లు అంచనా వేసింది.

"క్లిష్ట దశలోకి ప్రవేశిస్తున్నాం. దానిని మేము ఆకలి మహమ్మారిగా పిలుస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆకలి కేకలు పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో చాలా మంది అసంఘటిత కార్మికులే. లాటిన్​ అమెరికా కార్మికశక్తిలో వారే అత్యధికంగా ఉన్నారు. మిగతా వారు 2008 ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాలు కోల్పోయి పేదరికంలో కూరుకుపోయిన వారై ఉండొచ్చు."

- మిగ్యుల్​ బారెటో, డబ్ల్యూహెఫ్​పీ ప్రాంతీయ డైరెక్టర్​.

అంతకుమించి

అయితే.. ఐరాస అంచనాలకు మించి ఆహార కొరత ఉంటుందని చెబుతున్నారు పలువురు విశ్లేషకులు. సంస్థ కేవలం 11 దేశాల్లోని సమాచారాన్నే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతి ముగ్గురిలో ఒకరు ఆకలి బాధలను ఎదుర్కొన్న వెనుజువెలా వంటి దేశాలను లెక్కలోకి తీసుకోలేదన్నారు.

2020 చివరి నాటికి సుమారు 130 మిలియన్ల మంది ఆకలి అంచుకు చేరుకోవచ్చని ఐరాస ఆహార సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ డేవిడ్​ బిస్లే ఏప్రిల్​ నెలలోనే హెచ్చరించారు. ఒక్క హైతీలోనే సుమారు 1.6 మిలియన్ల మంది ఆకలితో అలమటించనున్నారని అంచనా. ఆహార కొరతలో భారీ పెరుగుదల ప్రభావం దీర్ఘకాలిక బాల్య పోషకాహారలోపం నుంచి భద్రత వరకు చాలా సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.

దక్షిణ కొరియాలో కరోనా విజృంభణ..

దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 50 రోజులుగా ఈ మేర నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 79 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటించింది కొరియా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం. అందులో 67 సియోల్​ మెట్రోపాలిటన్​ ప్రాంతంలోనివేనని పేర్కొంది.

ఈ సందర్భంగా రాజధాని ప్రాంత ప్రజలు అనవరంగా ఇంటి నుంచి బయటకి రావొద్దని, పరిశ్రమల్లో ఉద్యోగులు అనారోగ్యానికి గురైనట్లు కనిపిస్తే సెలవుపై పంపాలని కోరారు ఆరోగ్య శాఖ మంత్రి పార్క్​ న్యూయాంగ్​ హూ. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 69 మంది స్థానిక ఈ కామర్స్​ దిగ్గజం కౌపాంగ్​ ఆధ్వర్యంలో పని చేసే వారని పేర్కొన్నారు. నైట్​ క్లబ్​లు, వినోద కేంద్రాలకు వందల కేసులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు. భౌతిక దూరం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

చైనాలో మళ్లీ దొంగ కరోనా..

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. అక్కడ కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. అందులో 23 మందిలో లక్షణాలు కనపించలేదని అధికారులు తెలిపారు. రెండు పాజిటివ్​ కేసుల్లో ఒకటి షాంఘై, మరొకటి ఫుజియాన్​లో నమోదు కాగా ఇద్దరు విదేశీయులేనని తెలిపింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​. లక్షణాలు కనపించిన వారిలో 19 మంది కొవిడ్​-19కు కేంద్ర బిందువైన వుహాన్​ నగరానికి చెందిన వారేనని పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన 413 కేసుల్లో 344 వుహాన్​లోనివే.

76 రోజుల లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత వుహాన్​లో​ 6 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అయితే.. నగరం మొత్తం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో లక్షణాలు కనపడని కేసులు బయటపడుతున్నాయి. చైనాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 82,995కు చేరింది. 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.