ETV Bharat / international

'చట్టానికి లోబడే అధికార మార్పిడి'

author img

By

Published : Nov 21, 2020, 11:46 AM IST

Trump admin done everything required under Presidential Transition Act: White House
'అధికార మార్పిడి చట్టానికి అనుగుణంగానే నడచుకుంటున్నాం'

అధికార మార్పిడి ప్రక్రియకు డొనాల్డ్​ ట్రంప్ సహకరించడం లేదని వస్తున్న ఆరోపణలను శ్వేతసౌధం తోసిపుచ్చింది. ప్రెసిడెన్షియల్​ ట్రాన్సిషన్​ యాక్ట్​ కు అనుగుణంగా తాము నడుచుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల్లో విజేతను నిర్ణయించే రాజ్యాంగ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని వివరణ ఇచ్చింది.

అధ్యక్ష మార్పిడి చట్టానికి అనుగుణంగానే డొనాల్డ్​ ట్రంప్ పరిపాలనా విభాగం నడుచుకుంటోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కేలీ మెకెనీ తెలిపారు. నూతనంగా ఎన్నికైన జో బైడెన్​ బృందానికి తాము సహకరించడం లేదనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. చట్ట ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. ఫలితాలకు సంబంధించి ఇంకా కోర్టుల్లో విచారణ జరుగుతున్నట్లు వివరించారు.

నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ ఘన విజయం సాధించినట్లు అక్కడి మీడియా తెలిపింది. మొత్తం 538 ఎలక్టోరల్​ ఓట్లకు గానూ బైడెన్​ 306, ట్రంప్​ 232 స్థానాల్లో గెలిచినట్లు తెలిపింది. అయితే ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించారు. బైడెన్​కు అధికార మార్పిడి ప్రక్రియకు సహకరించడం లేదు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష బృందానికి మంజూరు చేయాల్సిన 9 మిలియన్​ డాలర్ల నిధులను కూడా నిలిపివేశారు.

ఎన్నికల ఫలితాలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని మెకేనీ చెబుతున్నారు. వేనీ కౌంటీలో గెలిచిన వారికి ఇంకా ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వలేదని ఉదాహరణగా తెలిపారు. ఫలితాలపై కోర్టుల్లోనూ విచారణ పూర్తి కాలేదన్నారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో అధ్యక్షుడికి 7.4 కోట్ల ఓట్లు పోలైనట్లు ఆమె పేర్కొన్నారు. మెయిల్ ఇన్​ ఓటింగ్​లో మోసాలు జరిగే అవకాశాలున్నాయని, వాటిపై వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఇకముందు కూడా అధికార మార్పిడి చట్టం నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్​ అత్యవసర సాయం ఆమోదానికి బైడెన్​ పట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.