ETV Bharat / international

భారత్​లో కరోనా.. ప్రపంచానికి ప్రమాద ఘంటిక!

author img

By

Published : May 6, 2021, 10:58 AM IST

unicef india covid
భారత్ కరోనా యునిసెఫ్

కరోనా విలయంతో అతలాకుతలమవుతున్న భారత్​కు సహాయం అందించేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని యునిసెఫ్ పిలుపునిచ్చింది. ఈ మహా విపత్తును అడ్డుకునేందుకు సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. వైద్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్​లో కరోనా విపత్కర పరిస్థితులు ప్రపంచ దేశాలకు ప్రమాద ఘంటికలు మోగించాయని ఐరాస చిన్నారుల సంరక్షణ విభాగం యునిసెఫ్(ఐక్యరాజ్యసమితి చిన్నారుల నిధి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా ఫోరే పేర్కొన్నారు. భారత్​కు సహాయం అందించేందుకు ప్రపంచం ముందుకు రాకపోతే.. వైరస్ సంబంధిత మరణాలు, మ్యుటేషన్లు పెరగడమే కాకుండా, సరఫరా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఈ మహా విపత్తును అడ్డుకునేందుకు సత్వర చర్యలు అవసరమని యునిసెఫ్ దక్షిణాసియా విభాగ డైరెక్టర్ జార్జి లారియా అడ్జెయి పేర్కొన్నారు. వినాశనాన్ని ఆపేందుకు ప్రభుత్వాలు తమ శక్తిమేర ప్రయత్నాలు చేయాలని అన్నారు. విరాళాలు అందించాలనుకునే దేశాలు వెంటనే పంపించాలని కోరారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

"నైతికంగా ఇది అత్యవసరం. అంతేకాదు, దక్షిణాసియాలో ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి అందరికీ ప్రమాదకరం. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయలేకపోతే.. అంతర్జాతీయ స్థాయిలో మహమ్మారికి వ్యతిరేకంగా సాధించిన పురోగతి తుడిచిపెట్టుకుపోతుంది."

-జార్జి లారియా అడ్జెయి, యునిసెఫ్ దక్షిణాసియా డైరెక్టర్

దక్షిణాసియాలో టీకా పంపిణీ సక్రమంగా చేపట్టకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని లారియా తెలిపారు. మాల్దీవులు, భూటాన్ మినహా ఇక్కడి అన్ని దేశాల్లో టీకా పంపిణీ ఆయా దేశ జనాభాల్లో 1-10 శాతం మధ్యే ఉందని చెప్పారు. టీకాలు సమానంగా అందించేలా చర్యలు తీసుకోవడం అత్యావశ్యకమని అన్నారు. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలని కోరారు.

వైద్య వ్యవస్థ కుప్పకూలేలా..

దక్షిణాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఎక్కడా చూడని విధంగా ఉన్నాయని యునిసెఫ్ పేర్కొంది. వైద్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

"రోగుల కుటుంబ సభ్యులు సహాయం కోసం అర్థిస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరతతో ఈ ప్రాంతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. వైద్య సిబ్బంది తీవ్రంగా అలసిపోయారు. పతనం అంచున ఉన్నారు. వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం కనిపిస్తోంది. అలా జరిగితే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది."

-యునిసెఫ్

భారత్​కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర అత్యవసర వైద్య సామాగ్రిని పంపించినట్లు యునిసెఫ్ తెలిపింది. 85 కరోనా పరీక్ష యంత్రాలు అందించినట్లు వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో 25 ఆక్సిజన్ ప్లాంట్లు, దేశంలోని ఎంట్రీ పాయింట్ల వద్ద 70 థర్మల్ స్కానర్ల ఏర్పాటు కోసం సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అదనపు పరికరాలు, ఆక్సిజన్​ను భారత్​కు అందించేందుకు తమకు 21 మిలియన్ డాలర్లు అవసరమని తెలిపింది. ఇతర కార్యక్రమాలకు 50 మిలియన్ డాలర్లు కావాలని పేర్కొంది.

ఇదీ చదవండి: 'వైద్య పరికరాలు భారత్​కు చేర్చిన వారి కృషి ప్రశంసనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.