ETV Bharat / international

డేటింగ్ యాప్​తో సీరియల్​ కిల్లర్​కు రివర్స్​ వల.. 160 ఏళ్లు శిక్ష పడేలా..

author img

By

Published : Oct 7, 2021, 8:31 PM IST

Updated : Oct 7, 2021, 8:54 PM IST

Serial killer
అత్యాచారం

మహిళలపై హత్యాచారానికి పాల్పడి.. మృతదేహాలను గుర్తుపట్టని విధంగా మార్చి పైశాచికానందం పొందిన ఓ కిరాతకుడికి 160ఏళ్ల జైలు శిక్ష విధించింది అమెరికాలోని నెవార్క్​ కోర్టు. అతడిని పట్టుకుని, పక్కా ఆధారాలతో న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు బాధిత మహిళ స్నేహితులు.

డేటింగ్​ యాప్స్​లో అమ్మాయిలకు వల వేసి.. వారిపై అత్యాచారానికి పాల్పడటం న్యూజెర్సీకి చెందిన ఖలీల్​ వీలర్​- వీవర్​(25) అలవాటు. అంతటితో ఆగకుండా వారిని క్రూరంగా హత్య చేయడం అతడి నైజం. అలా 2016లో ముగ్గురిని హత్య చేశాడు. సెప్టెంబర్​- డిసెంబర్​ మధ్య కాలంలో మూడు మృతదేహాలు బయటపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

2016 ఆగస్టు 31న, 19ఏళ్ల రాబిన్​ వెస్ట్​ అనే యువతి.. వీలర్​ వాహనం ఎక్కింది. కొన్ని గంటల తర్వాత హత్యకు గురైంది. ఆమెను వీలర్​ అత్యాచారం చేసి నెవార్క్​ ప్రాంతంలోని తన సొంత నివాసానికి కొద్ది దూరంలోని మరో ఇంట్లో పడేశాడు. అనంతరం ఆ ఇంటికి నిప్పంటించాడు. మృతదేహం వెస్ట్​దే అని తెలుసుకోవడానికి రెండు వారాలు పట్టింది.

వెస్ట్​ మృతదేహం గుర్తించిన నెల రోజుల తర్వాత మరో మహిళ అదే విధంగా హత్యకు గురైంది. జొవాన్​ బ్రౌన్​ను(33) హత్య చేసి, ఓ ఇంట్లో పాతిపెట్టాడు వీలర్​. ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఆరు వారాల సమయం పట్టింది.

బ్రౌన్​ మరణించిన నెల రోజులకు మాంట్​క్లెయిర్​లోని సారా బట్లర్​ అనే మహిళ అదృశ్యమైంది. అమెపైనా హత్యాచారం చేశాడు వీలర్​. బ్రౌన్​ మృతదేహాన్ని గుర్తించే నాలుగు రోజుల ముందు బట్లర్​ మృతదేహం బయటపడింది. వీరందరినీ బట్టలతో గొంతు నులిమి హత్య చేశాడు వీలర్​.

నాలుగో మహిళనూ చంపేందుకు ప్రణాళిక రచించాడు. కానీ ఆమె త్రుటిలో తప్పించుకుంది.

ఇలా బయటపడింది..

వీలరే నేరాలకు పాల్పడ్డాడని రుజువు చేసేందుకు చాలా సమయమే పట్టింది. చివరికి వీలర్​కు జైలు శిక్ష పడటంలో బట్లర్​ స్నేహితులు కీలక పాత్ర పోషించారు. బట్లర్​ సామాజిక మాధ్యమాల ఖాతాకు యాక్సెస్​ పొంది, వీలర్​ గురించి తెలుసుకున్నారు. ముల్లును ముల్లుతో తీయాలని నిర్ణయించుకున్నారు. ఫేక్​ అకౌంట్​ను రూపొందించి, వీలర్​కు వల వేశారు. అది గ్రహించలేని నిందితుడు​.. వారిని కలిసేందుకు మాంట్​క్లెయిర్​ వెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ విషయాన్నంతటినీ జడ్జికి వివరిస్తూ.. ప్రాసిక్యూటర్​.. బట్లర్​ స్నేహితులను అభినందించారు.

వీలర్​ వల నుంచి త్రుటిలో తప్పించుకున్న నాలుగో మహిళ కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వడం వల్ల అతడు తప్పించుకోలేకపోయాడు. బలమైన ఆధారాలు ఉన్న కారణంగా అతడికి శిక్షపడింది.

అన్నివైపులా వాదనలు విన్న నెవార్క్​ కోర్టు జడ్జి ఎస్​ అలీ.. కిరాతకుడికి 160ఏళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయమూర్తి తీర్పు విన్న బాధిత మహిళల బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇంత జరిగినా.. తాను ఎలాంటి తప్పుచేయలేదని, అందరు తనను కావాలని కేసులో ఇరికించినట్టు మొరపెట్టుకున్నాడు వీలర్​.

ఇదీ చూడండి:- గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య

Last Updated :Oct 7, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.