ETV Bharat / international

టీకా తీసుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయా?

author img

By

Published : Jun 18, 2021, 7:03 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొవిడ్ టీకాను కోట్లమంది తీసుకున్నారు. అయినా వ్యాక్సిన్​లపై ఇంకా కొందరిలో అపోహలు తొలగలేదు. ప్రధానంగా ఫైజర్​, మోడెర్నా టీకాలు వేయించుకుంటే.. శృంగారంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న భయం కొందరు పురుషులను వెంటాడుతోంది! అయితే ఇది నిజమేనా?

sperm count
వీర్యకణాలు

ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. టీకాలు దుష్ప్రభావం చూపుతాయన్న అనుమానమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఫైజర్​, మోడెర్నా టీకాలు తీసుకుంటే.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందన్న సందేహంతో వ్యాక్సిన్​ అంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అటువంటి అనుమానాలకు చెక్​ పెడుతూ.. తాజా అధ్యయనం కీలక అంశాలను వెలువరించింది. ​

నమ్మకం లేకపోవడమే..

ఫైజర్​, మోడెర్నా టీకాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు.. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల పురుషులకు ఎలాంటి హాని ఉండదని వెల్లడించారు. mRNA టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో వీర్యకణాలు నాణ్యతలో ఎటువంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. టీకాపై నమ్మకం లేకపోవడమే వీర్యకణాల నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన అంశాలను జేఏఎంఏ(జామా) జర్నల్​లో ప్రచురించారు.

డబ్ల్యూహెచ్​ఓ ప్రమాణాలతో పరిశోధన

ఫైజర్​, మోడెర్నా టీకాలు అందుకున్న, గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మందిపై ఈ పరిశోధన జరిపారు. వ్యాక్సినేషన్ పూర్తయిన 70 రోజుల తర్వాత.. వారిని 2-7 రోజుల ఉపవాసం ఉంచి.. వీర్యం నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను శిక్షణ పొందిన ఆండ్రోలాజిస్టులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం విశ్లేషించారు. వీర్యకణాల సంఖ్య, సాంద్రత, చలనశీలత, నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. టీకా తీసుకోక ముందు, తర్వాత సేకరించిన నమూనాలపై పరిశోధన జరిపారు.

అయితే వీరిలో వీర్యకణాలు తగ్గిన దాఖలాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధన ప్రారంభ సమయంలో మిల్లీలీటరకు 26 మిలియన్లు, 36 మిలియన్లు వీర్య కణాలు ఉన్నట్లు వెల్లడించారు. టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత, ఈ సంఖ్య 30 మిలియన్లు/ఎంఎల్​, 44 మిలియన్లకు పెరిగినట్లు పేర్కొన్నారు.

"పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుందన్న సంగతి క్లినికల్ ట్రయల్స్‌లో బయటపడలేదు. అయితే కొవిడ్​.. వీర్యకణాల నాణ్యతను తగ్గించే అవకాశాలున్నాయి. అయితే mRNAలో యాక్టివ్ వైరస్​ ఉండదు. కాబట్టి వీర్యకణాలపై ఎలాంటి ప్రభావం చూపదు" అని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ' మొదట ఆస్ట్రాజెనెకా తీసుకొని.. రెండో డోసుగా ఆ టీకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.