ETV Bharat / international

ఆ యువతికి రెండు జననాంగాలు.. ఎలాగంటే?

author img

By

Published : Jul 8, 2021, 4:23 PM IST

శరీరంలో ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ అవయవాలతో పిల్లలు జన్మించడం గురించి మనం తరచుగా వింటుంటాం. మూడు కాళ్లు, నాలుగు చేతులు.. అంతెందుకు రెండు తలలు ఉన్న శిశువులు జన్మించడమూ కొత్తేం కాదు. కానీ.. రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు ఒకే మహిళలో ఉండటం మాత్రం చాలా అరుదు. ఇలా.. రెండు జననాంగాలు ఉండే అరుదైన వ్యాధితో బాధపడుతోంది అమెరికాకు చెందిన ఓ యువతి.

Woman with two reproductive systems
రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు

పెయిజ్ డిఎంజెలో... అమెరికాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి. తనకు పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు తన శరీరంలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు ఉన్నాయన్న విషయం ఆమెకు తెలీదు. అవును.. ఈ యువతికి రెండు జననాంగాలు, రెండు గర్భాశయాలు ఉన్నాయి. నెలకు రెండు సార్లు పీరియడ్లు వస్తుంటాయి. మొత్తంగా రెండు వేర్వేరు గర్భధారణ వ్యవస్థలు ఒకే శరీరంలో ఉన్నాయన్న మాట.

పెయిజ్​కు ప్రతి రెండువారాలకు ఒకసారి పీరియడ్స్ వస్తుండేవి. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ గైనకాలజిస్ట్ దగ్గరకు సాధారణ హెల్త్ చెకప్ కోసం వెళ్తే.. అసలు సమస్య బయటపడింది.

"నాకు పీరియడ్లు ఎప్పుడుపడితే అప్పుడు వచ్చేవి. ఒక్కోసారి రోజుల వ్యవధిలో నెలకు రెండు సార్లు వచ్చేవి. ఏ సమయంలో వస్తాయో తెలిసేది కాదు. నా హైస్కూల్ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ విషయం గురించి తెలిసినప్పుడు ఇతరుల స్పందన చూస్తే నవ్వొస్తుంది. చాలా మందికి ఆత్రుత ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా శరీర భాగాల గురించి తప్పుడు భావనతో ఉంటారు. శరీరం బయటివైపే రెండు జననాంగాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అలా ఉండి ఉంటే ముందే నాకు ఈ విషయం తెలిసేది."

-పెయిజ్ డిఎంజెలో

డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఏదో అధిక కణజాలం ఉందని చెప్పారని యువతి పేర్కొన్నారు. ఆ తర్వాత తీసిన ఎంఆర్ఐ స్కానింగ్​లో ఈ విషయం తెలిసిందని చెప్పారు.

"నాకు దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఒక్కసారి తెలియగానే జీర్ణించుకోలేకపోయాను. తొలుత కొంచెం హాస్యాస్పదంగా ఉండేది. గైనకాలజిస్ట్ నాకు వివరించిన తర్వాతే దీని గురించి తెలిసింది."

-పెయిజ్ డిఎంజెలో

పిల్లలు కనడం కష్టమే!

పెయిజ్ ప్రస్తుత స్థితి వల్ల ఆమెకు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అకాల జననాలు సంభవించే అవకాశమూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో పిల్లల్ని కనాలని అనుకుంటే.. 'సరోగసీ' విధానమే మేలని వైద్యులు చెబుతున్నారు.

"నాకు మంచి భవిష్యత్ కావాలి. పెద్ద కుటుంబం ఉండాలని అనుకుంటున్నా. ఇది నాకు గుండె పగిలే వార్తే. నాకు తెలిసిన ఫేస్​బుక్ గ్రూప్​లో కొందరు ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఓ మహిళకు ఐదు గర్భస్రావాల తర్వాత.. ఒకసారి సుఖ ప్రసవం అయింది. నేనిప్పుడు అసంపూర్ణంగా ఉన్నానని అనిపిస్తోంది. అయితే.. ఇదే సమస్యతో బిడ్డలకు జన్మనిచ్చిన మహిళల గురించి వింటూ.. ఆశతో జీవిస్తున్నాను."

-పెయిజ్ డిఎంజెలో

అయితే తన లైంగిక జీవితానికి ఇబ్బందులు ఏమీ లేవని పెయిజ్ స్పష్టం చేశారు. 'నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ విషయంలో అంతా సవ్యంగానే ఉంది' అని చెప్పారు.

తాను ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టిక్​టాక్ ఛానల్​ను ఏర్పాటు చేశారు పెయిజ్. ఈ అకౌంట్​కు మూడు లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

అసలు సమస్య ఎలా వస్తుందంటే?

సాధారణంగా మహిళల శరీరంలోని అండం పెరిగేటప్పుడు.. జననాంగం.. మిల్లేరియన్ డక్ట్స్​ అనే రెండు చిన్న నాళాలుగా వృద్ధి చెందుతుంది. ఎంబ్రియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా ఇవి క్రమంగా కలిసిపోయి.. ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. అయితే ఈ అరుదైన వ్యాధి ఉన్న మహిళల్లో ఎంబ్రియోజెనిసిస్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగదు. కాబట్టి రెండు నాళాలు కలిసిపోకుండా.. రెండు పునరుత్పత్తి వ్యవస్థల ఏర్పాటుకు కారణమవుతుంది. అయితే, శరీర బయటి భాగంలో దీన్ని గుర్తించలేం.

ఇంకా ఎవరైనా ఉన్నారా?

బంగ్లాదేశ్​లో అరిఫా సుల్తానా అనే మహిళ ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారు. ఆశ్చర్యకరంగా 2019లో కవల పిల్లలకు ఆమె జన్మనిచ్చారు. 26 రోజుల వ్యవధిలో ఇద్దరు శిశువులు జన్మించారు. దీన్ని అరుదైన విషయంగా వైద్య వర్గాలు చెబుతుంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.