ETV Bharat / international

Lucy Mission Nasa: నింగిలోకి 'లూసీ'.. 12 ఏళ్లు, 630 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం

author img

By

Published : Oct 17, 2021, 7:36 AM IST

సౌర కుటుంబంలోని గ్రహాల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' (Nasa Lucy) ఓ వ్యోమనౌకను నింగిలోకి ప్రయోగించింది. దీనికోసం సుమారు 98.1 కోట్ల డాలర్లను సానా ఖర్చు చేసింది. సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావం గురించిన కీలక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్​ చేపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి లూసీ (Lucy Mission Nasa) అనే పేరును ఖరారు చేశారు.

Lucy Mission Nasa
మిషన్​ లూసీ

సౌర కుటుంబంలోని 8 గ్రహశకలాల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' (Nasa Lucy) శనివారం 'లూసీ' (Lucy Mission Nasa)అనే వ్యోమనౌకను విజయవంతంగా (Lucy Nasa Launch) నింగిలోకి ప్రయోగించింది. ఇది 12 ఏళ్ల పాటు ఏకంగా 630 కోట్ల కిలోమీటర్ల ప్రయాణించి, పరిశోధనలు సాగిస్తుంది. తద్వారా సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావం గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 98.1 కోట్ల డాలర్లను నాసా వెచ్చించింది.

ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి అట్లాస్‌-5 రాకెట్‌ ద్వారా లూసీని (Lucy Nasa Launch) ప్రయోగించారు. 1974లో ఆఫ్రికాలోని ఇథియోపియాలో లభ్యమైన లూసీ అనే మానవ శిలాజం పేరును దీనికి ఖరారు చేశారు. 32 లక్షల ఏళ్ల నాటి ఆ అస్థికల ద్వారా మానవజాతి పూర్వాపరాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో 'బీటిల్స్‌' రాక్‌ బ్యాండ్‌ ఆలపించే 'లూసీ ఇన్‌ స్కై విత్‌ డైమండ్స్‌' (Lucy In The Sky) పాటకు గుర్తుగా 'లూసీ' అని పేరును శిలాజానికి పెట్టారు. తాజాగా నాసా.. నాటి బ్యాండ్‌లోని సభ్యుల బాణీలు, ప్రముఖుల సూక్తులను ఒక ఫలకంపై ముద్రించి, వ్యోమనౌకలో ఉంచింది. ఇందులోని ఒక పరిశోధన పరికరంలో.. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలతో తయారైన డిస్క్‌ను ఉంచారు. తద్వారా బీటిల్స్‌ గేయం 'లూసీ ఇన్‌ స్కై విత్‌ డైమండ్స్‌' (వజ్రాలతో ఆకాశంలోకి వెళ్లిన లూసీ) ఇక్కడ అచ్చంగా సరిపోలింది. లూసీ వ్యోమనౌక ప్రధానంగా ఏడు 'ట్రోజోన్‌' గ్రహశకలాలు, ఒక సాధారణ అంతరిక్ష శిలపై పరిశోధన సాగిస్తుంది. ట్రోజోన్‌ గ్రహశకలాలు గురు గ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లూసీ యాత్ర చాలా సంక్లిష్టంగా ఉంటుంది.

  • 2023లో లూసీ భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని ముందడుగు వేస్తుంది. తిరిగి 2024లో ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది. తద్వారా గురు గ్రహానికి చేరుకోవడానికి అవసరమైన వేగాన్ని, శక్తిని పొందుతుంది.
  • 2025 ఏప్రిల్‌లో ఇది అంగారకుడు, గురుడు మధ్య ఉన్న డొనాల్డ్‌ జొహాన్‌సన్‌ అనే గ్రహశకలానికి చేరువగా వెళ్లి, పరిశోధనలు సాగిస్తుంది.
  • 2027-28లో లూసీ.. గురుడికి ముందు భాగంలోని ఐదు గ్రహశకలాలకు చేరువగా వెళ్లి పరిశీలనలు సాగిస్తుంది.
  • 2030లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుంది. పుడమి గురుత్వాకర్షణ శక్తి సాయంతో తిరిగి బలాన్ని పుంజుకొని, పయనం సాగిస్తుంది. 2033 మార్చిలో గురుడి వెనుక భాగంలోని రెండు గ్రహశకలాలకు చేరువగా వెళ్లి, పరిశోధనలు చేపడుతుంది.
  • లూసీలోని పరికరాలు ఈ గ్రహశకలాల రంగు, ఆకృతి, నిర్మాణం, వాటిలోని పదార్థాలు, ఉష్ణోగ్రతలు, అంతర్గత నిర్మాణంపై పరిశీలనలు చేపడతాయి.
  • ఈ వ్యోమనౌక బరువు 1.5 టన్నులు. లూసీలో వృత్తాకారంలో ఉన్న రెండు భారీ సౌర ఫలకాలు శక్తిని అందిస్తాయి. గురుగ్రహం వద్ద సౌరశక్తి చాలా తక్కువగా లభ్యమవుతుంది. అలాంటి చోట కూడా సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఇంత భారీ సౌర ఫలకాలను ఏర్పాటుచేశారు.
  • భూమితో కమ్యూనికేషన్‌ సాగించడానికి ఈ వ్యోమనౌకలో రెండు మీటర్ల పొడవైన హై గెయిన్‌ యాంటెన్నాను ఏర్పాటుచేశారు.
  • సౌర శక్తితో నడిచే ఒక వ్యోమనౌక.. సూర్యుడి నుంచి అత్యంత దూరంగా వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. అలాగే ఒక వ్యోమనౌక ఏకంగా 8 గ్రహశకలాలను శోధించడం కూడా ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: అంతరిక్ష కేంద్రంలోకి చైనా వ్యోమగాములు- 6 నెలలు అక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.