ETV Bharat / international

'24 గంటల్లోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట'

author img

By

Published : Dec 5, 2020, 8:53 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో వైరస్​ ఉద్ధృతికి కళ్లెం వేసే యాంటీవైరల్​ ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. బాధితుడి నుంచి 24 గంటల్లోనే వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ మందు ఉపయోగపడుతుందని తేల్చారు.

antiviral drug prevents corona virus transmission
24 గంటల్లోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట

కొవిడ్​-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్​ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉద్ధృతికి కళ్లెం వేయడానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. జార్జియా స్టేట్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.

మోల్నుపిరావిర్​ అనే ఈ యాంటీ వైరల్​ ఔషధాన్ని తొలుత ఇన్​ఫ్లూయెంజా వైరస్​ల కోసం అభివృద్ధి చేశారు. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్​ఫెక్షన్లు కలిగించే ఆర్​ఎన్​ఏ వైరస్​లపై మోల్నుపిరావిర్​ సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. ఇన్​ఫెక్షన్​ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు.. వాటి నుంచి బయటకు వెలువడే వైరల్​ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్రయోగాల్లో తేలింది. ఫలితంగా వైరస్​ వ్యాప్తి నాటకీయంగా తగ్గిందని వెల్లడైంది. ఈ లక్షణాల కారణంగా మోల్నుపిరావిర్​ను కొవిడ్​ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ప్రజలందరికీ టీకా వేసేలోగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం చాలా కీలకం.

" ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించటం ఇదే మొదటిసారి. ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుంది."

- రిచర్డ్​ ప్లెంపర్​, పరిశోధకుడు

కొవిడ్​పై ఈ ఔషధ సమర్థతను నిర్ధరించేందుకు ఫెర్రెట్​ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. వాటికి కరోనా వైరస్​తో ఇన్​ఫెక్షన్​ కలిగించారు. వాటి ముక్కు ద్వారా వైరస్​ రేణువులు బయటకు వస్తున్న దశలో కొన్ని జంతువులకు మోల్నుపిరావిర్​ ఇచ్చారు. మిగతా వాటికి ఈ ఔషధాన్ని ఇవ్వలేదు. వాటిని వేర్వేరు బోనుల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ రెండు బోనుల్లోకి ఆరోగ్యంగా ఉన్న ఫెర్రెట్లను ప్రవేశపెట్టారు. మోల్నుపిరావిర్​ ఔషధాన్ని పొందిన జంతువులున్న బోనులోకి వెళ్లిన ఫెర్రెట్లకు వైరస్​ సోకలేదు. ఈ మందును పొందని జీవులున్న బోనులోని ఫెర్రెట్లకు మాత్రం ఈ మహమ్మారి సోకింది. ఈ లెక్కన ఒక కొవిడ్​ బాధితుడికి మోల్నుపిరావిర్​ ఇస్తే.. 24 గంటల్లోనే అతడి నుంచి వైరస్​ వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: 'తొలి టీకానే ఉత్తమం కానవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.