ETV Bharat / international

అమెరికాపై 'హిమ ఖడ్గం'- 11 మంది మృతి

author img

By

Published : Feb 17, 2021, 12:58 PM IST

మంచు తుపాను ధాటికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధ్వానంగా మారింది. టెక్సాస్​ రాష్ట్రంలో విద్యుత్​ సరఫరా లేక లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కరోలినాలో అనూహ్యంగా సంభవించివ టోర్నడో కారణంగా ముగ్గురు మరణించారు.

snow storm
అంధకారంలో అమెరికన్లు.. తుపానుకు 14 మంది మృతి

అమెరికాను ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. టెక్సాస్​, ఒక్లాహోమా, టెన్నేసీ, ఇల్లీనోయిస్​ రాష్ట్ర ప్రజలు మంచు తుపానుతో ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు ఉత్తర కరోలినా రాష్ట్రంలో టోర్నడోల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈనెల 14 నుంచి ఇప్పటివరకు మంచు తుపానుకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, టోర్నడోకు ముగ్గురు బలయ్యారు.

snow stormsnow storm
కాలీఫోర్నియాలో మంచు తుపాను ప్రభావం

ప్రాణాలు అరచేతిలో..

కొద్దిరోజులుగా తీవ్రమైన హిమపాతంతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెక్సాస్​లో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై ప్రభావం పడింది. రక్తం గడ్డం కట్టించే చలిని ఎదుర్కొనే హీటర్లు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు మంచుతో నిండిపోయిన పరిస్థితుల్లో అనేక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు.

"పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉంది. విద్యుత్​ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే వీలైనంత వరకు కరెంటును సరఫరాను నిలిపివేయడమే మంచిది."

-అధికారులు

చలి పులిని ఎదుర్కొనేందుకు టెక్సాస్ రాష్ట్ర అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆస్పత్రులు, నర్సింగ్​ హోంలకు విద్యుత్​ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం నుంచి జనరేటర్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్​ బ్లాక్​ఔట్ అయిన ప్రాంతాల్లో ప్రజలు చలిని తట్టుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

టోర్నడో కారణంగా..

మంచు తుపానుతో అనేక రాష్ట్రాలు గజగజలాడుతుంటే... ఉత్తర కరోలినాపై అనూహ్యంగా టోర్నడో విరుచుకుపడింది. బ్రున్స్​విక్​ కౌంటీలో సుడిగాలి కారణంగా ముగ్గురు మృతి చెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఈ టోర్నడో వస్తుందని ఊహించలేదని వాతావరణ శాఖ పేర్కొనడం గమనార్హం.

snow storm
ఉత్తర కరోలీనాలో టోర్నడో కారణంగా ధ్వంసం అయిన ప్రాంతం

టీకా పంపిణీపై ప్రభావం..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు టీకా పంపిణీకు అడ్డంకిగా మారాయి. టెక్సాస్​లోని ఓ కేంద్రంలో సోమవారం విద్యుత్​ సరఫరా నిలిపోవడం వల్ల 8 వేలకు పైగా ఉన్న టీకాల పంపిణీ నిలిపివేశారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పడింది. టీకా సరఫరా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : '9/11' తరహా కమిషన్​తో ట్రంప్​కు ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.