ETV Bharat / international

టైటానిక్​ హీరోకు జెఫ్‌ బెజోస్‌ వార్నింగ్​.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Nov 10, 2021, 5:16 AM IST

Updated : Nov 10, 2021, 6:31 AM IST

హాలీవుడ్‌ అగ్రహీరో, నటుడు లియోనార్డో డికాప్రియోపై అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడకు రా... చూసుకుందాం అంటూ వార్నింగ్​ ఇచ్చారు. ఇంతకు వారి మధ్య ఏం జరిగింది?

Jeff Bezos Reacts To Viral Video Of His Girlfriend With Leonardo DiCaprio
ప్రముఖ నటుడుకు జెఫ్‌ బెజోస్‌ వార్నింగ్​

అపర కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్.. హాలీవుడ్‌ అగ్ర హీరో, టైటానిక్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు లియోనార్డో డికాప్రియోపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడకు రా.. చూసుకుందాం అంటూ భయపెట్టాడు. అయితే ఇదంతా సరదాకే. తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్‌ బెజోస్‌ ట్విట్టర్‌ వేదికగా సరదాగా స్పందించారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో గత శనివారం జరిగిన లాక్మే ఆర్ట్‌ ఫిల్మ్‌ గాలా కార్యక్రమానికి అమెజాన్‌ అధినేత తన ప్రియురాలు లారెన్‌ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో సైతం వచ్చారు. ఈ సందర్భంగా డికాప్రియో, లారెన్‌ సాంచెజ్‌ కొద్దిసేపు సరదాగా సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరు సెకన్ల నిడివి గల ఓ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరలవుతోంది. కాగా ఈ వీడియోపై జెఫ్ బెజోస్‌ సరదాగా స్పందించారు. 'ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం' అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. 'లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి' అంటూ బెజోస్‌ ఓ ట్వీట్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల మంది వీక్షించారు. 1.4 లక్షల లైకులతోపాటు వేల మంది సరదా కామెంట్లు చేశారు.

57 ఏళ్ల జెఫ్‌ బెజోస్‌కు 25 ఏళ్ల క్రితమే మెకెంజీ స్కాట్‌ అనే మహిళతో వివాహం జరిగింది. అయితే అమెరికన్‌ యాంకర్‌ అయిన లారెన్‌ సాంచెజ్‌తో బెజోస్‌కు 2019లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో తమ దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ అదే ఏడాది భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్నాడు. భరణంగా 38 బిలియన్‌ డాలర్లు (రూ.2.62 లక్షల కోట్లు) ఇచ్చినట్లు పలు వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: ఐవీఎఫ్​లో పొరపాటు.. ఒకరి గర్భంలో మరొకరి శిశువు.. పుట్టిన 3 నెలలకు...

Last Updated : Nov 10, 2021, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.