ETV Bharat / international

ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్!

author img

By

Published : Aug 1, 2021, 10:35 PM IST

UNSC, TS thirumurthy
యూఎన్​ఎస్​సీ, టీఎస్​ తిరుమూర్తి

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల విధులు నిర్వర్తించనుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్‌ తిరుమూర్తి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్‌ ఈ పదవిలో కొనసాగనుంది. అంతకుముందు నెల(జులై)లో ఈ పదవిలో ఉన్న ఫ్రాన్స్‌ ప్రతినిధి నుంచి భారత రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భద్రతా మండలిలో రెండేళ్ల పాటు (2021-2022) తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్‌, అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆగస్టు నెలతో పాటు తాత్కాలిక సభ్య దేశంగా గడువు ముగిసే (డిసెంబర్‌ 2022) చివరి నెలలోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్‌ తిరుమూర్తి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.

ఆ మూడు అంశాలు..

ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన భారత్‌, కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ముఖ్యంగా శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్ర తీర భద్రత అంశాలను అజెండాగా పేర్కొంది. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని.. ఇకపై కూడా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. భారత్‌ ఈ పదవి చేపట్టడానికి కృషిచేసిన ఫ్రాన్స్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టడం పట్ల ఫ్రాన్స్‌, రష్యా దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించాయి. భారత్‌ అజెండాలోని మూడు అంశాలపై కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఫ్రాన్స్‌ పేర్కొంది. ఫ్రాన్స్‌ తర్వాత భారత్‌ ఈ పదవి చేపట్టడం సంతోషంగా ఉందని.. అంతేకాకుండా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనెన్‌ పేర్కొన్నారు. అటు భారత్‌ అజెండా స్ఫూర్తిదాయకంగా ఉందని రష్యా కూడా అభిప్రాయపడింది.

ఇక ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో.. ఇతర సభ్యదేశాలతోనూ కలిసి ముందుకు సాగుతామని భారత విదేశాంగమంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ సంయమనంతో సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్‌ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:భారత్​ చేతికి ఐరాస భద్రతా మండలి పగ్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.