ETV Bharat / international

'ఓట్లేయండి బాబు'.. అంటున్న ట్రంప్​- బైడెన్​

author img

By

Published : Oct 30, 2020, 10:16 PM IST

Updated : Oct 30, 2020, 11:47 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​ ప్రచార జోరు పెంచారు. ప్రతి ర్యాలీలోనూ 'బయటకువచ్చి ఓట్లేయండి(గెట్​ అవుట్ టు ఓట్​)' అనే ఇతివృత్తంతోనే ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను నవంబరు 3న తప్పకుండా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లండని అభ్యర్థిస్తున్నారు.

'Get out to Vote' is the common theme in rallies for US presidential polls
'ఓట్లేయండిరా బాబు'.. అమెరికన్లకు ట్రంప్​, బైడెన్​ల విన్నపం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్తి జో బెైడెన్​లు ఎన్నికల్లో ప్రత్యర్థులైనప్పటికీ ఇప్పుడు ఒకే ఇతివృత్తంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ దగ్గరపడుతున్న తరుణంలో వారు పాల్గొనే ప్రతి ర్యాలీలోనూ ' బయటకు వచ్చి ఓట్లేయండి(గెట్​ అవుట్​ టు ఓట్)'​ అని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని, మీ స్నేహితులు, బంధుమిత్రులతో నవంబరు 3న పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అమెరికన్లకు సూచిస్తున్నారు.

రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికవ్వడమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ట్రంప్. ఆరిజోనాలోని బుల్​హెడ్​ నగరంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పోలింగ్​కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని, ప్రతి ఓటు ఎంతో కీలకమని తన మద్దతుదారులకు తెలిపారు.

" గెట్ అవుట్​ టు ఓట్. మీ కుటుంబసభ్యులు, పొరుగువారు, బంధుమిత్రులు, సహోద్యోగులు, యజమానులు, అందరూ వచ్చే మంగళవారం ఓటు వేసెందుకు వెళ్లండి. అమెరికా చరిత్రలోనే ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు."

ర్యాలీలో ట్రంప్​

ఫ్లోరిడాలో గురువారం నిర్వహించిన ర్యాలీలోను ఇదే విషయాన్ని చెప్పారు ట్రంప్. కచ్చితంగా అందరూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు.

అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్​ కూడా తన మొదటి ఎన్నికల ప్రచార ర్యాలీలో ఇదే విషయాన్ని చెప్పారు.

'ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకోకపోతే నవంబరు 3న ఓటింగ్​లో పాల్గొనండి. అందరినీ ఓటు వేసే విధంగా ప్రోత్సహించండి' అని మెలానియా అన్నారు.

'గో అవుట్ అండ్ ఓట్​'

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్​ కూడా తాను పాల్గొన్న ప్రతి ర్యాలీలో 'గో అవుట్ అండ్​ ఓట్​' అంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాలెట్ ఓటింగ్​ను వినియోగించుకోవాలని తన మద్దతుదారులను కోరుతున్నారు. ఓటింగ్ పాల్గొనాలని ప్రజలను ప్రోత్సహించేందుకు 'www.iwillvote.com' వెబ్​సైట్​, యాప్​ను ప్రారంభించారు డెమొక్రాట్లు.

కరోనా నేపథ్యంలో ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకునేందుకు ఈసారి బ్యాలెట్​ ఓటింగ్​కు ముందుగానే అనుమతిచ్చింది అమెరికా ప్రభుత్వం. దీని ద్వారా మొత్తం 24 కోట్లమంది ఓటర్లకు గానూ 8 కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమొక్రాట్ల నేత బరాక్ ఒబామా అన్నారు. ప్రతిఒక్కరు కుటుంబంతో సహా ఓటింగ్​లో పాల్గొనాలని ఫ్లోరిడా ర్యాలీలో పిలుపునిచ్చారు. ఓటు వేసినా, వేయకపోయినా పెద్దగా మార్పు ఉండదనే భావన ఉండకూడదన్నారు. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైతేనే మార్పు తెలుస్తుందన్నారు.

ట్రంప్​ అధికారంలోకి వచ్చిన 2016 ఎన్నికల్లో ఓటింగ్ 55.5శా తంగా నమోదైంది. ఒబామా మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2008 ఎన్నికల్లో 57.1 శాతం మంది ఓటింగ్​లో పాల్గొన్నారు. 2012లో ఆయన రెండోసారి గెలిచినప్పుడు ఓటింగ్​ శాతం 54.8గా ఉంది.

Last Updated : Oct 30, 2020, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.