ETV Bharat / international

'కరోనా వ్యాప్తికి శీతాకాలం అనువైనది'

author img

By

Published : Nov 16, 2020, 7:06 PM IST

శీతాకాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువగా ఉండటం వల్ల కరోనా​ వ్యాప్తి బయట కన్నా.. ఇండోర్​లోనే ఎక్కువగా ఉంటుందన్నారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ సలహాదారు డాక్టర్​ వివేక్​ మూర్తి. చలికాలం వైరస్​ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణంగా తెలిపారు. అమెరికాలో వైరస్​ కట్టడికి జో బైడెన్​ చర్యలు చేపట్టారని చెప్పారు.

corona virus
కరోనా వైరస్​ వ్యాప్తి

కరోనా వ్యాప్తికి శీతాకాలం అనువైనదన్నారు జో బైడెన్ సలహాదారు డాక్టర్​ వివేక్​ మూర్తి. చలికాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారని, దీంతో బయటి ప్రదేశాలకంటే ఇండోర్​లోనే వైరస్​ వ్యాప్తి సులభంగా జరుగుతుందని తెలిపారు.

అమెరికాలో వైరస్​ నియంత్రణకు బైడెన్​ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఫాక్స్​ న్యూస్​తో కీలక విషయాలు వెల్లడించారు మూర్తి. ఈ మహమ్మారితో ప్రజలు అలసట చెందారని తెలిపారు.

" చాలా నెలలుగా మహమ్మారితో పోరాడుతున్నాం. ముఖ్యమైన అంశం వైరస్​ అలసట. అంటే ప్రజలు తమ బబుల్​లోకి ఇతరులను అనుమతిస్తున్నారు. డిన్నర్​ పార్టీలు, రాత్రి ఆటల వంటి వాటితో ఇతరులతో కలుస్తున్నారు. ఇలాంటి సమావేశాలతోనే అధిక కేసులను గుర్తిస్తున్నాయి ఆరోగ్య శాఖ విభాగాలు. ఇలాంటి వాటి వల్లే అమెరికాలో ఇటీవల కేసులు పెరిగాయి. వైరస్​ వ్యాప్తిని తగ్గించటమే తక్షణం చేయాల్సిన పని. అది మన ప్రవర్తన, మనం చేయబోయే పనులపై ఆధారపడి ఉంటుంది. మాస్క్​లు ధరించటం, భౌతిక దూరం, చేతులు కడుక్కోవటం వంటివి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి వైరస్​ వ్యాప్తిని తగ్గించటంలో చాలా శక్తివంతమైనవి. "

- డాక్టర్​ వివేక్​ మూర్తి, బైడెన్​కు ఇండో- అమెరికన్​ సలహాదారు.

అమెరికాలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పరీక్షల సామర్థ్యం పెంచటం, కేసులను గుర్తించటం వంటి వాటిపై బైడెన్​ తమతో చర్చించారని పేర్కొన్నారు మూర్తి. వ్యక్తిగత భద్రత కిట్ల ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారని, దాంతో ఆరోగ్య సిబ్బందికి మాస్క్​లు, గ్లౌజ్​లు లభిస్తాయన్నారు. పాఠశాలలు, వ్యాపారాలతో పాటు రాష్ట్ర సంస్థలు, భారీ క్రీడా పోటీలను సురక్షితంగా ఎలా నిర్వహించుకోవాలనే దానిపై మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

లాక్​డౌన్​ చివరి అవకాశం..

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ దేశవ్యాప్త లాక్​డౌన్​ చివరి అవకాశం అని వెల్లడించారు మూర్తి. వైరస్​ ప్రారంభంలో ఉన్న దాని కంటే ప్రస్తుతం ప్రజల్లో ఎంతో అవగాహన వచ్చిందన్నారు.

" మన ప్రయత్నాలు చేయకుండా దేశం మొత్తాన్ని లాక్​చేస్తే.. మహమ్మారి ప్రభావాన్ని తీవ్రతరం చేసినట్లే అవుతుంది. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటాయి. పాఠశాలలను మూసివేసి మన చిన్నారుల విద్యను దెబ్బతీసినట్లే."

- డాక్టర్​ వివేక్​ మూర్తి, బైడెన్​ సలహాదారు

వ్యాక్సిన్​ పంపిణీ అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు మూర్తి. చాలా ఏళ్లుగా ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నామని, కానీ, త్వరలో చేపట్టబోయే వ్యాక్సినేషన్​ దేశ చరిత్రలోనే చాలా కీలకమైనదిగా అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లపై రాజకీయాలు చేస్తున్నారని చాలా మంది ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెప్పే మాటలు ప్రజలు నమ్మేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి: టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్‌ సలహాదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.