ETV Bharat / international

'ఎడారి' నుంచి అంతరిక్షంలోకి శ్రీమంతుడు

author img

By

Published : Jul 20, 2021, 7:35 AM IST

నేడు అంతరిక్షంలో విహరించనున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ముగ్గురితో కలిసి 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌక ద్వారా పయనించనున్నారు. విశ్వంలోకి అతిపెద్ద, పిన్న వయస్కులు ఈ యాత్రలోనే వెళ్లనున్నారు. పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి యాత్ర షురూ కానుంది.

Jeff Bezos flying to space
బెజోస్‌

అంతరిక్షంలోకి మరో శ్రీమంతుడు ప్రవేశించబోతున్నారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రోదసియాత్రకు రంగం సిద్ధమైంది. స్వీయ సంస్థ 'బ్లూ ఆరిజిన్‌'కు చెందిన 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌకలో ఆయన మంగళవారం నింగిలోకి పయనమవుతున్నారు. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా ఈ యాత్ర సాగుతుంది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ రంగానికి సంబంధించి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం! చంద్రుడిపై మానవుడు తొలిసారిగా కాలుమోపిన రోజును (జులై 20) ఈ చరిత్రాత్మక యాత్ర కోసం బెజోస్‌ ఎంచుకున్నారు. ఆయన వెంట ప్రపంచంలోనే అత్యంత పెద్ద, చిన్న వయసు వ్యోమగాములు కూడా ఉంటారు.

Jeff Bezos flying to space
జెఫ్‌ బెజోస్‌ రోదసి యానం

ఇదీ చూడండి: భారత తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డ్!​

రోదసియానం విషయంలో బిలియనీర్ల మధ్య పోటీ నెలకొన్న వేళ.. 'వర్జిన్‌ గెలాక్టిక్‌' సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఇటీవలే విజయవంతంగా ఈ యాత్ర పూర్తి చేశారు. నిజానికి రోదసియానం చేసే ఉద్దేశం తొలుత ఆయనకు లేదు. బెజోస్‌ తన యాత్ర గురించి ప్రకటన చేయగానే బ్రాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రత్యర్థి కన్నా ముందుండేందుకు ఈ నెల 11న యాత్ర చేపట్టారు. తద్వారా.. స్వీయ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియనీరుగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బెజోస్‌ యాత్ర నిర్వహిస్తున్నారు.

అంతకుమించి..

సబ్‌ఆర్బిటల్‌ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా 'న్యూ షెపర్డ్‌' యాత్ర సాగనుంది. బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. నేల నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. కాగా, బెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళుతుంది. భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు. అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది. దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్‌ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు. అయితే ఫెడరేషన్‌ ఏరోనాటిక్‌ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది. ఈ నేపథ్యంలో తమ అంతరిక్షయాత్రపై ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా చూసేందుకు 100 కిలోమీటర్లను దాటి వెళ్లనున్నట్లు బ్లూ ఆరిజిన్‌ పేర్కొంది. 'న్యూ షెపర్డ్‌' పూర్తిగా స్వయంచోదిత వ్యోమనౌక. అందువల్ల పైలట్ల అవసరం ఉండదు.

ఇదీ చూడండి: Space tour: 'బెజోస్​తో అంతరిక్ష యాత్ర ఊహించలేదు'

ఎడారి నుంచి యాత్ర మొదలు..

పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) న్యూ షెపర్డ్‌ దూసుకెళ్లనుంది. దానిని సాయంత్రం 5గంటల నుంచే BlueOrigin.com, బ్లూ ఆరిజిన్ ట్విట్టర్, ఫేస్​బుక్, యూట్యూబ్​ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేయనున్నారు.

ద్రవీకృత హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ఇంజిన్‌ సాయంతో గంటకు 3,700 కిలోమీటర్ల వేగంతో పయనమవుతుంది. అనంతరం వ్యోమగాములు ఉన్న క్యాప్సుల్‌ నుంచి బూస్టర్‌ విడిపోతుంది. కొద్దిసేపటికి వ్యోమగాములు భారరహిత స్థితిని పొందుతారు. వారు కార్‌మాన్‌ రేఖ ఆవల కొన్ని నిమిషాలు గడుపుతారు. వ్యోమనౌక కిటికీ నుంచి భూమి వంపును, విశ్వాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సుల్‌ తిరిగి భూమికి చేరుకుంటుంది. రోదసిలోకి వెళ్లిన తొలి అమెరికన్‌ అలన్‌ షెపర్డ్‌ పేరిట 'న్యూ షెపర్డ్‌'ను రూపొందించారు.

వెళ్లేది ఎవరు?

Jeff Bezos flying to space
మార్క్, బెజోస్, ఆలివర్, వేలీ ఫంక్

ఈ యాత్రలో బెజోస్‌తో పాటు మహిళా పైలట్‌ వేలీ ఫంక్‌ వెళ్లనున్నారు. ఆమెకు 82 ఏళ్లు. ఈ యాత్రతో.. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 1960లలో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'కు సంబంధించిన మెర్క్యురీ కార్యక్రమం కింద వ్యోమగామి శిక్షణ పొందారు. అయితే నాడు ఆమెకు రోదసిలోకి వెళ్లే అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆమెతోపాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్‌ డేమన్‌.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు. ఇక మిగిలిన ఆ నాలుగో వ్యక్తి బెజోస్‌ సోదరుడు మార్క్‌. ఈ యాత్ర కోసం తొలుత వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్‌ కొన్న ఓ వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

ఇవీ చూడండి:

Space tour: బెజోస్-రిచర్డ్​ యాత్రల మధ్య తేడాలివే..

బెజోస్‌ వ్యోమనౌక వెనుక.. భారత యువతి

బెజోస్​ రోదసి యాత్ర.. ఇవి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.