ETV Bharat / international

తాలిబన్లకు బైడెన్ షాక్- నిధులు అందకుండా ఆంక్షలు

author img

By

Published : Aug 18, 2021, 5:11 PM IST

TALIBAN NEWS
అఫ్గాన్ నిధులపై అమెరికా ఆంక్షలు

తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షాక్ ఇచ్చారు. భారీ స్థాయిలో నిధులపై ఆంక్షలు విధించారు. తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, అఫ్గాన్ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. జీ7 దేశాలు సైతం భేటీ కానున్నాయి.

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లకు(Taliban afghanistan) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ షాక్ ఇచ్చారు. అఫ్గాన్ కోసం కేటాయించిన సుమారు 950 కోట్ల డాలర్ల నిధులను స్తంభింపజేశారు. తాలిబన్ల చేతికి నిధులు అందకుండా చేసేందుకే ఈ ఆంక్షలు విధించారు.

ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెల్లెన్ ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిందని.. పాక్​కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. 'అమెరికాలో అఫ్గాన్ ప్రభుత్వానికి ఉన్న కేంద్రీయ బ్యాంకుల ఆస్తుల్ని తాలిబన్లకు అందకుండా చూస్తాం'(US freezes Afghan reserves) అని ఓ అధికారి స్పష్టం చేశారని పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా విదేశాంగ శాఖతో పాటు శ్వేతసౌధాన్ని సంప్రదించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే కాకుండా, తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర చర్యలనూ బైడెన్ యంత్రాంగం పరిశీలిస్తోందని తెలిపారు.

ఐరాస సమావేశం

మరోవైపు, అఫ్గానిస్థాన్​లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మేధోమధనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్​ పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(UNHRC meet on Afghan) ఆగస్టు 24న కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడి పౌరుల భద్రత, వారి హక్కులపై ప్రభావం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.

సమావేశం నిర్వహించాలని అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్.. ఐరాసను అభ్యర్థించాయి. ఇందుకు మరో 89 దేశాలు మద్దతు ఇచ్చాయి. దీంతో ఈ కీలక భేటీకి పిలుపునిచ్చింది యూఎన్​హెచ్​ఆర్​సీ.

జీ7 దేశాలు సైతం..

అఫ్గాన్​పై చర్చించేందుకు వచ్చేవారం జీ7 దేశాలు వర్చువల్​గా సమావేశం కానున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ సమావేశం నిర్వహణ గురించి చర్చకు వచ్చింది. భేటీ నిర్వహించి.. అఫ్గాన్​ అంశంపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు శ్వేతసౌధం అధికార ప్రకటనలో వెల్లడించింది.

పాక్​కు చురక

అఫ్గాన్​ నూతన ప్రభుత్వాన్ని గుర్తించే విషయమై పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు.. బోరిస్ జాన్సన్ చురకలు అంటించారు. అఫ్గాన్​ నూతన ప్రభుత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆమోదించాలని, ఏకపక్షంగా కాదని అన్నారు.

బైడెన్​తో మాట్లాడటానికి ముందు ఇమ్రాన్​ ఖాన్​కు ఫోన్ చేసిన బోరిస్... అఫ్గాన్​లో మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. "అఫ్గానిస్థాన్​లో ఏర్పడే నూతన ప్రభుత్వాన్ని గుర్తించడం.. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది, ఏకపక్షంగా కాదు. భవిష్యత్​లో ఏర్పడే తాలిబన్ ప్రభుత్వ చట్టబద్ధత అంశం.. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏమేరకు పాటిస్తున్నారనే విషయంపై ఆధారపడి ఉంటుంది" అని తేల్చి చెప్పారు.

సర్కారు ఏర్పడ్డ తర్వాతే గుర్తింపు!

కాగా, అఫ్గాన్​లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తాలిబన్లకు దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చైనా తెలిపింది. అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో స్వేచ్ఛాయుత, సంఘటిత ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో పాటు తాలిబన్లు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా వీగర్ మిలిటెంట్లకు తమ దేశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వొద్దని పేర్కొంది. దీనిపై తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికింది.

టర్కీ తీరుపై వివాదం!

కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రత కోసం మోహరించిన దళాల ఉపసంహరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టర్కీ పేర్కొంది. నాటో సభ్య దేశమైన టర్కీ.. 600 మంది జవాన్లతో ఎయిర్​పోర్ట్​కు భద్రత కల్పిస్తోంది.

అమెరికా, నాటో దళాలు అఫ్గాన్​ను విడిచి వెళ్లినప్పటికీ.. విమానాశ్రయ భద్రత కోసం వీరిని కొనసాగించాలని టర్కీ భావిస్తోంది. ఈ విషయమై తాలిబన్లు, అఫ్గాన్ రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావుసోగ్లు పేర్కొన్నారు.

అయితే, తాలిబన్ల పట్ల టర్కీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని అక్కడి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాలిబన్లు సానుకూల సందేశం ఇస్తున్నారని విదేశాంగ మంత్రి పేర్కొనడాన్ని తప్పుబడుతున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.