ETV Bharat / international

Kenya Drought: మూగజీవాల మృత్యుఘోష- చుక్కనీరు లేక అల్లాడిపోయి..

author img

By

Published : Dec 15, 2021, 12:18 PM IST

Kenya Drought: కెన్యాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాగేందుకు చుక్కనీరు లేక వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడే కుప్పకూలి విగతజీవులుగా మారిపోతున్నాయి. ప్రాణాలు కోల్పోయి గుంపులు గుంపులుగా పడి ఉన్న జిరాఫీల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

Kenya Drought
Kenya Drought, కెన్యా దుర్భిక్షం

Kenya Drought: తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాలో ప్రజలే కాకుండా జంతువులు కూడా దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అక్కడి వన్యప్రాణులపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తాగేందుకు చుక్కనీరు దొరక్క అల్లాడిపోతున్న వన్యప్రాణులు.. అడుగు ముందుకు వేయలేక, ఎక్కడికక్కడే విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదలిస్తున్నాయి. తాజాగా కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నీటి కోసం అల్లాడిన జిరాఫీలు.. చివరకు ప్రాణాలు కోల్పోయి గుంపులుగా పడివున్న దృశ్యాలు అక్కడి కరవు కాటకాలకు అద్దం పడుతున్నాయి.

గతకొంత కాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి అక్కడి వాజిర్‌ కౌంటీలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులకు ప్రాణసంకటంగా మారాయి. ఎక్కడ చూసినా తిండి, నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన జంతువుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న కొన్ని జిరాఫీలు నీటి కోసం తీవ్రంగా వెతికాయి. చివరకు బురదగా మారిన ఓ నీటి కుంటవద్దకు వెళ్లిన మూగజీవాలు అక్కడే కూరుకుపోయాయి. అనంతరం తిండి, నీరు లేక అక్కడే జీవితాన్ని చాలించాయి. అలా ఓ ఆరు జిరాఫీలు ఒకేచోట విగత జీవులుగా పడివున్న హృదయ విదారక దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేవలం ఇవే కాకుండా ఎన్నో వందల వన్యప్రాణులు ఆహారం, నీరు దొరక్క తనువు చాలిస్తున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Kenya Drought: Giraffes killed by severe drought in Kenya
విగతజీవులుగా మారుతున్న వన్యప్రాణులు

జాతీయ విపత్తు..

తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాను కరవు పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో గత సెప్టెంబర్‌ నెలలో సాధారణ వర్షపాతం కంటే 30శాతం తక్కువ నమోదైంది. దీంతో అక్కడ కరవు పరిస్థితులు తీవ్రమయ్యాయి. చుక్క నీటి కోసం అక్కడి ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఇదే సమయంలో పెంపుడు జంతువులకు స్థానికులు కాస్త ఆహారం, నీరు అందిస్తున్నప్పటికీ.. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చే వన్యప్రాణులను మాత్రం అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వేల సంఖ్యలో వన్యప్రాణులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ఇలా క్షామ పరిస్థితుల కారణంగా గరిస్సా కౌంటీ సమీప ప్రాంతంలోనే దాదాపు 4వేల జిరాఫీల ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అక్కడి స్థానిక మీడియా ది స్టార్‌ వెల్లడించింది. ఇదిలాఉంటే, దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న కెన్యాలో.. కరవును జాతీయ విపత్తుగా సెప్టెంబర్‌ నెలలో కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ప్రకటించారు.

ఇవీ చూడండి: మరణాన్ని జయించాలనే మానవుని ఆశ తీరనుందా!

Artificial Intelligence: కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.