ETV Bharat / entertainment

వెండితెరపై బంగారు తల్లులు.. ఈ సినిమాలు చూశారా?

author img

By

Published : May 8, 2022, 6:43 AM IST

Updated : May 8, 2022, 7:00 AM IST

Tollywood Mother centiment movies
వెండితెరపై బంగారు తల్లులు

Tollywood Mother centiment movies: అమ్మ అనే మాట కంటే కమ్మని కావ్యం లేదు.. అమ్మ అనే పదం కంటే తీయని రాగం లేదన్నాడో సినీ కవి. ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిల్లో 'అమ్మ'ను మించింది లేదు. అందుకే 'అమ్మ' గొప్పతనం గురించి చెప్పే సినిమాలకు, పాటలకు ఎవరైనా ఇట్టే కనెక్ట్‌ అవుతారు. ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. తెరపై మదర్​ సెంటిమెంట్​ సినిమా కనిపిస్తే కదలని మనసుండదు. ఎందరో రచయితలు, దర్శకులు అమ్మదనాన్ని పొగుడుతూ ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. ఇంకా తెరకెక్కిస్తూనే ఉన్నారు. వాటిని ప్రేక్షకులు ఆప్యాయంగా హత్తుకుంటూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా 'అమ్మ' నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు మీకోసం..

Mother centiment movies Telugu: అమ్మ దేవత.. బిడ్డ ఎవరైనా ప్రాణం పోస్తుంది... బిడ్డా ఎలా ఉన్నా ప్రేమ పంచుతుంది. కావాలంటే... 'అమ్మచెప్పింది' సినిమా చూడండి.
అమ్మ స్నేహితురాలు.. సమాజం మొత్తం నిన్ను చిన్న చూపు చూసినా...మనల్ని నమ్ముతుంది. గెలిపిస్తుంది. 'రఘువరన్‌ బీటెక్‌' చూస్తే ఇది మీకే అర్థమవుతుంది.
అమ్మ అమృతం... తను ఉన్నప్పుడే కాదు... తను బతికి లేకున్నా.. బిడ్డలు బాగుండాలని తాపాత్రయ పడుతుంది. 'మాతృదేవోభవ' కన్నా నిదర్శనం కావాలా?
ఇలా అమ్మ మన జీవితానికి దర్శకురాలు. మన భవిష్యత్తుకు నిర్మాత. మన ఎదుగుదలను చూస్తూ ఆనందభాష్పాలతో చప్పట్లు కొట్టే తొలి ప్రేక్షకురాలు. అలాంటి అమ్మ గురించి తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాతృదినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

అమ్మను మించిన గురువెవ్వరు?.. మన మీద సమాజం చూపించే ప్రేమ, గౌరవం మనకున్న హోదా, తెలివితేటల వల్లే కావచ్చు. కానీ అమ్మ ప్రేమ పొందడానికి అవేం అవసరం లేదు. బిడ్డ ఎలా ఉన్నా, సమాజం ఎలా చూసినా అమ్మ ప్రేమలో తేడా ఉండదని చెప్పిన సినిమా 'అమ్మ చెప్పింది'. ఇందులో శర్వానంద్‌ మానసిక పరిపక్వత లేని యువకుడిగా బోస్‌ పాత్రలో నటించాడు, శర్వా తల్లిగా సుహాసిని కనిపిస్తుంది. అందరి నుంచి సూటిపోటి మాటలు ఎదురవుతున్నా..అమాయకుడైన తన బిడ్డకు తోడుగా ఉండే అమ్మ పాత్రలో సుహాసిని జీవించింది. ఆఖర్లో అమ్మ చెప్పిందని అందరినీ కాపాడడానికి ప్రమాదానికి ఎదురెళ్లి తన ప్రాణాలు త్యాగం చేస్తాడు బోస్‌. వెక్కిరింపులకు గురైన బోస్‌ చివరికి అమ్మ మాట విని గొప్పవాడిగా నిలిచిపోతాడు. అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌లలో ఈ మాతృదినోత్సవాన ఈ సినిమా చూడొచ్చు.

తాజాగా శర్వానంద్‌ మరో సారి అమ్మ గురించి చెప్పనున్నాడు. త్వరలోనే రానున్న 'ఒకే ఒక జీవితం'లో తల్లీకొడుకుల బంధం ఇతివృత్తంగా కథ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అమ్మ పాట అందరినీ అలరిస్తోంది. ఇందులో శర్వాకు తల్లిగా అమల అక్కినేని నటిస్తున్నారు.

అమ్మ కంటే మిత్రుడెవ్వరు?.. ప్రస్తుతం చాలా మంది యువతకు ఎదురవుతున్న సమస్య నిరుద్యోగం. ప్రతి ఒక్కరూ ఈ దశలో ఒత్తిడిని ఎదుర్కొని బయట పడినవాళ్లే. ఆ సమయంలో బంధువులు, స్నేహితులు మనకు తోడుగా ఉండకపోవచ్చు. అప్పుడు మన స్నేహితురాలుగా మారే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ అంశాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం 'రఘువరన్‌ బీటెక్‌'. ఇందులో తల్లిగా నటించిన భువనలో యువత అంతా తమ అమ్మను చూసుకున్నారు. క్లిష్ట సమయాల్లో తల్లి ఇచ్చే భరోసాతో జీవితంలో గెలవచ్చని ఈ చిత్రం చాటిచెప్పింది. అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌లలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

అమ్మ కన్నా మార్గదర్శెవరు?.. పలు కారణాల వల్ల భర్తలను కోల్పోయిన మాతృమూర్తిలెందరో మన చుట్టూ ఉంటారు. తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని ఒంటరిగానే కష్టపడుతూ జీవితాన్ని త్యాగం చేస్తారు. ఇలాంటి అమ్మల గొప్పతనాన్ని చెప్పిందే 'మాతృదేవోభవ'. గొడవకు వెళ్లి భర్త చనిపోతాడు. తనకేమో క్యాన్సర్‌. నలుగురు పిల్లలు.. అందులో ఒకరికి అవిటితనం. వారిని ఎలాగైనా మంచి కుటుంబాలకు దత్తత ఇచ్చి మంచి జీవితాన్ని ఇవ్వడానికి తపనే పడే తల్లిగా మాధవి నటన మనసును మెలిపెడుతుంది. తాను ఉన్నపుడే కాదు జీవించి లేకపోయినా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకోవడం అమ్మకు మాత్రమే చెల్లునేమో..! ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లోనే వీక్షించవచ్చు.

అమ్మను మించి ప్రేమించేదెవరు?.. మన కోసం ఇంత ప్రేమ చూపించి, ఇన్ని రకాలుగా అండగా నిలిచే అమ్మను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పిన చిత్రమే 'బిచ్చగాడు'. తల్లిని కాపాడడం కోసం ఒక కొడుకు పడే ఆరాటంగానే కథ కనిపించినా ప్రతి సన్నివేశమూ అమ్మను కీర్తిస్తూనే ఉంటుంది. అమ్మ ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా జీవితాన్ని గడపడానికి తిరిగి మనం ప్రేమను ఇవ్వడమే ప్రధానమని చెప్పడమే 'బిచ్చగాడు' ఉద్దేశం. అమ్మను కాపాడుకునే ఒక మంచి కొడుకు ఎలా ఉండాలో చెబుతూ విజయ్‌ ఆంటొనీ నటించాడు. దీన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు.

అమ్మ తప్ప ఇంకెవరు?.. "స్వచ్ఛమైన ప్రేమ, త్యాగం వంటి పదాలకి సరైన నిర్వచనం చెప్పమంటే నేను అమ్మ అనే మాటే చెబుతా. పిల్లలు, ఇల్లు అంటూ తనని తాను మరిచిపోయి ఎప్పుడూ మన గురించే ఆలోచించేది అమ్మ తప్ప ఇంకెవరు? ఇవ్వడం అంటే ఏమిటో, ప్రేమని పంచడం అంటే ఏమిటో నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నా. మా కోసమని మా అమ్మ లతా హెగ్డే చాలా వదులుకుంది. మా ఎదుగుదలలోనే తన విజయాన్ని చూసుకుంది. నాపైన అమ్మ ప్రభావం చాలా ఎక్కువ. క్రమశిక్షణగా మెలిగే విషయంలో రాజీపడేది కాదు. అందం మొదలుకొని మా అమ్మ నుంచి నాకు చాలానే అబ్బాయి. అవి కాకుండా ఇంకా అమ్మ నుంచి నాకు సొంతం కావాలనుకునే ఓ మంచి లక్షణం ఏమిటంటే... ఓపిక. అమ్మలకి చాలా ఓపిక ఉంటుంది. పిల్లలంతా ఆ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకోవల్సిందే."
- పూజాహెగ్డే

అమ్మ నుంచి నేర్చుకోవాలి.. అమ్మ కిరణ్‌ నా సూపర్‌హీరో. రోల్‌మోడల్‌. నా బలం ఆమె. తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసింది. అవి ఏవీ.. ఆమె ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. అమ్మ చిన్న పట్టణం నుంచి వచ్చినా ఆమె ఆలోచనలు ఎప్పుడూ అడ్వాన్స్‌గా ఉండేవి. మాకు స్వేచ్ఛనివ్వడంలో, మమ్మల్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్రే ప్రధానం. తను స్వతహాగా టీచర్‌. తన నుంచి నేను నేర్చుకోవాలనుకొనే మంచి లక్షణం మనీ మేనేజ్‌మెంట్‌. చిన్నప్పటి నుంచి ఆమెను గమనిస్తున్నా... అమ్మ ఏ రోజు ఖర్చులను ఆరోజు రాసి పెట్టేది. అది మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది. అలా నేనూ చేయాలనుకుంటా.
-లావణ్య త్రిపాఠి

ఇదీ చూడండి: 'సెక్సీ సాంగ్‌కు నేను రెడీ'.. సమంత హాట్​ కామెంట్స్​

Last Updated :May 8, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.