ETV Bharat / entertainment

Krishna: అభిమాన హీరోలతో నటించి.. మల్టీస్టారర్ల చిత్రాలతో రికార్డు సృష్టించి...

author img

By

Published : Nov 15, 2022, 10:44 AM IST

దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో సూపర్​స్టార్​గా ఎదిగారు కృష్ణ. అయితే అందులో ఎక్కువగా మల్టీస్టారర్​ చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన ఏ ఏ హీరోలతో కలిసి నటించారో ఓసారి గుర్తు చేసుకుందాం..

super star krishna record multistarrer movies
Krishna: అభిమాన హీరోలతో నటించి.. మల్టీస్టారర్ల చిత్రాలతో రికార్డు సృష్టించి

సూపర్‌స్టార్‌ కృష్ణ తన సినీకెరీర్​లో సుమారు 350 సినిమాలు చేశారు. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం. కొన్నింటిలో ఆయన చేసిన సాహసాలు, పేల్చిన డైలాగులు, సింపుల్‌ డ్యాన్స్‌ స్టెప్పులు కనిపిస్తే.. ఇంకొన్నింటిలో ఇతర హీరోలతో కలిసి పంచిన వినోదం కనిపిస్తుంది. ఒకటీ రెండు కాదు దాదాపు 80 మల్టీస్టారర్‌ చిత్రాలు చేసి కృష్ణ రికార్డు సృష్టించారు. ఆయన ఏ ఏ హీరోలతో కలిసి నటించారో ఓసారి గుర్తు చేసుకుందాం..

ఎన్టీఆర్‌తో అలా.. కృష్ణ మరో హీరోతో కలిసి నటించిన తొలి చిత్రం 'ఇద్దరు మొనగాళ్లు'. అందులో కాంతారావుతో కలిసి తెరను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ కాంబోలో మరో రెండు చిత్రాలొచ్చాయి. 'పాతాళభైరవి' సినిమాలోని ఎన్టీఆర్‌ నటనకు ముగ్దుడైన కృష్ణ.. ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గురించి ప్రత్యేకంగా చెప్పేవారు. ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా 'స్త్రీ జన్మ'. తర్వాత, ఈ కాంబినేషన్‌లో 'నిలువు దోపిడి', 'విచిత్ర కుటుంబం', 'దేవుడు చేసిన మనుషులు', 'వయ్యారి భామలు-వగలమారి భర్తలు' సినిమాలొచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు సోదరులుగా నటించడం విశేషం.

ఏఎన్నార్‌తో ఇలా.. 'ఎప్పటికైనా హీరోనికావాలి' అని అక్కినేని నాగేశ్వరరావును చూసి అనుకున్నారట కృష్ణ. ఏఎన్నార్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను తానూ సంపాదించుకోవాలని నిర్ణయించుకుని అనుకున్నట్టుగానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తనకు స్ఫూర్తినిచ్చిన అక్కినేనితో కలిసి 'మంచి కుటుంబం', 'అక్కాచెల్లెలు', 'హేమాహేమీలు', 'గురుశిష్యులు', 'ఊరంతా సంక్రాంతి', 'రాజకీయ చదరంగం' సినిమాల్లో నటించారు.

ఇతర నటులతో.. కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా కృష్ణంరాజు నిలిచారు. వీరు కలిసి నటించిన 19 చిత్రాలు.. వీరి అనుబంధం ఎలాంటిదో నిరూపించాయి. శోభన్‌బాబుతో 13, మోహన్‌బాబుతో 4, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్‌, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేసిన కృష్ణ తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో కనిపించారు.

ఇదీ చూడండి: సూపర్​స్టార్ కృష్ణ.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు.. అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.