ETV Bharat / entertainment

జన్మలో స్టేజ్‌ ఎక్కనని.. గొప్ప నటుడిగా ఎదిగిన బాలయ్య

author img

By

Published : Apr 9, 2022, 3:12 PM IST

Balayya
మన్నవ బాలయ్య

కళాశాల రోజుల్లో నాటకం వేసినప్పుడు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. జన్మలో మళ్లీ స్టేజ్‌ ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు మన్నవ బాలయ్య. విధి ఆడిన నాటకంలో అనుకోని విధంగా సినీ రంగంవైపు అడుగులు వేసి నటుడిగా పేరుపొందారు. ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల్ని అలరించిన ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మన్నవ బాలయ్యకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలివే..

వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. పట్టుదలతో చదువుకుని ఇంజినీరయ్యారు మన్నవ బాలయ్య. తొలి అవకాశంలోనే హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్‌ ప్రారంభంలో కుటుంబకథా చిత్రాల్లో నటించి, పౌరణిక చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు . ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి ఆనాటి తారలతోపాటు నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ, శ్రీకాంత్‌.. ఇలా ఎంతోమంది అగ్రహీరోలతో ఆయన కలిసి నటించారు.

ఫెయిలైతే వ్యవసాయమే: గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడుకు చెందిన గురువయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1930 ఏప్రిల్‌ 9న బాలయ్య జన్మించారు. బాలయ్యకు వ్యవసాయం నేర్పించి, తనకు చేదోడు వాడోదుగా చేసుకోవాలని తండ్రి అనుకున్నాడు. కానీ, అతడికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన స్కూల్‌ టీచర్‌.. ‘‘మీ అబ్బాయికి చదువుపై మంచి ఆసక్తి ఉంది. ఒక్కసారి పై చదువులకు పరీక్షలు రాయిద్దాం. ఫెయిలైతే మీరు అనుకున్నట్టే వ్యవసాయం. పాస్‌ అయితే పై చదువులకు పంపిద్దాం’’ అని గురువయ్యతో చెప్పాడు. తండ్రి అంగీకరించడంతో పరీక్షలు రాసి పాసై పదో తరగతి కోసం గుంటూరు వెళ్లారు.

Balayya
మన్నవ బాలయ్య

బిచ్చగాడిని చూసి మద్రాస్‌ వెళ్లి: బాలయ్య గుంటూరులో చదువుకుంటున్న రోజుల్లో ఆయన స్కూల్‌ బయట ఓ బిచ్చగాడు ఉండేవాడు. అతను మద్రాస్‌ నుంచి గుంటూరుకు వచ్చి బిక్షాటన చేస్తున్నానని అందరితో చెప్పేవాడు. అతను ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటం బాలయ్య గమనించారు. ‘‘ఈ వ్యక్తే ఇంతలా ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే. మద్రాస్‌లో చదువుకుంటే నాకెంత బాగా ఇంగ్లిష్‌ వస్తుందో’’ అని ముచ్చటపడిన బాలయ్య ఇంట్లో వాళ్లని ఒప్పించి ఇంటర్‌ చదుకోవడానికి మద్రాస్‌ వెళ్లారు. అక్కడ ఆంగ్ల మీడియంలో చేరి మొదట ఫెయిలైనప్పటికీ పట్టుదలతో చదవి ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు.

జన్మలో స్టేజ్‌ ఎక్కకూడదనుకుని: ఇంటర్‌ పూర్తైన వెంటనే ఇంజనీరింగ్‌లో చేరిన బాలయ్య.. ఓ వైపు చదువుపై దృష్టి సారిస్తూనే నాటకాలపైనా ఆసక్తి చూపించాడు. కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటిసారి బాలయ్య స్టేజ్‌ ప్రదర్శన ఇచ్చాడు. అందులో తన ప్రదర్శన సరిగ్గా లేదని భావించిన బాలయ్య.. మళ్లీ జన్మలో స్టేజ్‌ ఎక్కకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో తాపీ చాణక్య అనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఓసారి ఆ కళాశాలకు వచ్చాడు. కళాశాలలో ప్రదర్శించే ఓ నాటకంలో చేయాలని బాలయ్యను కోరాడు. గతంలో తనకెదురైన అనుభవాన్ని చెప్పిన అతడు.. తాను చేయలేనని మొదట చెప్పాడు. అయితే.. చాణక్యను నొప్పించలేక చివరికి ఓకే అన్నాడు. అలా మొదటిసారి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు.

జాబ్‌ వదిలి.. సినిమాల్లోకి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే బాలయ్య కొంతకాలం పాటు లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తిరువత్తియూరులోని కేసీపీ సంస్థలో ఉద్యోగం చేశారు. అలాంటి సమయంలో తాపీ చాణక్య ఓసారి బాలయ్యను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళ్లారు. సారథి ఫిలిమ్స్‌ వాళ్లు కొత్త హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని, కోరి వచ్చిన హీరో ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దని చెప్పడంతో పరిశ్రమలోకి మొదటిసారి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. అలా, ఆయన నటించిన మొదటి చిత్రం ‘ఎత్తుకు పై ఎత్తు’. అనంతరం ఆయన ఎన్నో చిత్రాల్లో హీరో, సహాయనటుడిగా నటించి మెప్పించారు.

సినిమాలు ఎందుకు నిర్మించకూడదు..?: నటుడిగా మంచి స్థాయిలో ఉన్న బాలయ్యకు ఓ జానపద చిత్రంలో వేషం ఇస్తానని విఠలాచార్య మాటిచ్చారు. చర్చలు కూడా జరిగాయి. అయితే.. చివరి క్షణంలో విఠలాచార్య ఏమనుకున్నారో ఏమో వేషం లేదని చెప్పేశారు. ఆ మాటతో షాక్‌కు గురైన ఆయన ‘మనం ఎందుకు సినిమాలు నిర్మించకూడదు?’ అని ఆలోచించారు. అలా, ఆయన ఆలోచనల నుంచి పుట్టిందే ‘అమృతా ఫిలిమ్స్‌’ సంస్థ. ఆ బ్యానర్‌పై విడుదలైన మొదటి చిత్రం ‘చెల్లెలు కాపురం’ సూపర్‌హిట్‌ అయ్యింది. అనంతరం ఆయన దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు.

పేరు తెలిసి పెళ్లి వద్దని: కెరీర్‌లో రాణిస్తున్న తరుణంలో బాలయ్యకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. విజయవాడకు చెందిన ఓ అమ్మాయి ‘బాలయ్య’ పేరు వినగానే.. ‘పేరు బాలేదు. నాకు ఈ సంబంధం వద్దు అనేసింది’. అనంతరం 1995లో కమలాదేవితో బాలయ్య వివాహమైంది.

ఇదీ చదవండి: 'గాడ్​ఫాదర్​'లో పూరి.. కన్ఫామ్​​ చేసిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.