ETV Bharat / entertainment

మల్టీప్లెక్స్‌లలో ట్రైలర్‌ల కోసం ఓ షో.. కేవలం రూ.1కే.. ఎప్పటి నుంచో తెలుసా?

author img

By

Published : Apr 15, 2023, 7:01 AM IST

సినీ ప్రియుల కోసం ప్రముఖ మల్టీప్లెక్స్​ సంస్థలైన ఐనాక్స్​, పీవీఆర్​లు ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాయి. కేవలం ట్రైలర్‌ల కోసం ప్రత్యేక షో ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. అది కూడా రూ.1కే. ఆ వివరాలు మీ కోసం..

pvr inox trailers screening show
pvr inox trailers screening show

ప్రముఖ మల్టీప్లెక్స్​ సంస్థలైన ఐనాక్స్​, పీవీఆర్​లు సినీ ప్రియుల కోసం ఓ తియ్యటి కబురును చెప్పింది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి దాదాపు అరగంట సేపు అన్ని కొత్త సినిమాల ట్రైలర్లను చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపింది. ఇప్పటి కాలంలో ఓ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేది ట్రైలరే అన్న విషయంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి అలాంటి ట్రైలర్‌లను వెండితెరపై చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది కదా. అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా 30 నిమిషాల పాటు త్వరలో రిలీజ్​కు సిద్ధం కానున్న కొత్త సినిమాలకు సంబంధించిన మూవీ ట్రైలర్‌లు అన్నింటిని చూసేస్తే ఇంకెంత బాగుంటుందో కదా అనుకునే వాళ్లను దృష్టిలో పెట్టకునే ఈ సంస్థలు ప్లాన్ చేశాయి.

అందుకే కేవలం ట్రైలర్‌ల కోసం మల్టీప్లెక్స్​లలో షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే విడుదలకు సిద్ధంగా ఉన్న 10 సినిమా ట్రైలర్‌లను ఎంపిక చేసి బిగ్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు. వాటిలో స్థానిక భాషలతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల ట్రైలర్‌లు కూడా ఉండనున్నాయి. 'ట్రైలర్‌ స్క్రీనింగ్‌ షో' అనే కాన్సెప్ట్‌తో మొదలవుతున్న ఈ స్క్రీనింగ్​ కోసం.. పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీ ప్లెక్స్‌లు రోజులో ఒక షో ని కేవలం ట్రైలర్‌లకు మాత్రమే కేటాయించనున్నారు. దీని ద్వారా దాదాపు అరగంట సేపు పాటు ఎంపిక చేసిన కొత్త సినిమా ట్రైలర్స్‌ను ఒక్క రూపాయికే ప్రదర్శించనున్నారు.

ఇటీవలే ఏప్రిల్‌ 7 నుంచి 10 వరకు ఈ ట్రైలర్‌ షోను ముంబయిలోని మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించారు. సుమారు 35,000 మంది ఈ షోని చూసేందుకు వచ్చారు. 'పొన్నియిన్‌ సెల్వన్‌ 2' , 'జవాన్‌'లతో పాటు హాలీవుడ్‌కు చెందిన పలు మూవీ ట్రైలర్‌లను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎక్కడెక్కడి నుంచో ఈ ట్రైలర్లను చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తిగా వచ్చారని.. వీకెండ్స్‌లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని మల్టీప్లెక్స్‌ నిర్వహకులు పేర్కొన్నారు. అయితే ఈ షో ఏ మల్టీప్లెక్స్​లలో అందుబాటులో ఉంటుంది, ఏ టైంలో ప్రదర్శించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా రూ.1కే ఏసీలో కూర్చొని ఎంచక్కా రానున్న సినిమాల ట్రైలర్‌లను చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా గతంలో పీవీఆర్​ సంస్థ జనవరి 20న 'సినిమా లవర్స్‌ డే' సందర్భంగా ఇలానే ఓ క్రేజీ ఆఫర్​ను అమలులోకి తీసుకొచ్చింది. దాని ద్వారా ఆ ఒక్కరోజు మాత్రం దేశంలోని కొన్ని ఎంపికైన ప్రాంతాల్లో రూ.99కే సినిమాను చూసే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా ఒకానొక సమయంలో 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా దేశవ్యాప్తంగా కేవలం రూ.75కే టికెట్లను విక్రయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.